శవాల దిబ్బగా మొరాకో | Morocco Earthquake: Morocco Mourns Quake Victims As Death Toll Thousand Above - Sakshi
Sakshi News home page

Morocco Earthquake: శవాల దిబ్బగా మొరాకో.. మృతులు 2 వేల పైనే.. మరో 1500 మంది పరిస్థితి విషమం

Published Mon, Sep 11 2023 5:05 AM | Last Updated on Mon, Sep 11 2023 12:40 PM

Morocco Earthquake: Morocco mourns quake victims as death toll thousands abow - Sakshi

మర్రకేశ్‌: భూకంపం సృష్టించిన పెను విధ్వంసం, ప్రాణనష్టం మొరాకో వాసులను షాక్‌కు గురిచేసింది. ఈ ఉత్తర ఆఫ్రికా దేశంలో ఇంతటి తీవ్ర భూకంపం రావడం 120 ఏళ్లలో ఇదే మొదటిసారి. దేశంలోని మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్‌ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు భయాందోళనలతో వీధుల్లో రెండో రోజూ చీకట్లోనే జాగారం చేశారు.

సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది. శిథిలాలను తొలగిస్తుండటంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 2,012కు చేరింది. క్షతగాత్రులైన మరో 2,059 మందిలో 1,404 మందికి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని గుర్తించి, కాపాడేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సుదూరంగా కొండ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు సహాయక బృందాలు చేరడం కష్టంగా మారింది.

అక్కడి మట్టిరోడ్లపై బండరాళ్లు పడిపోవడంతో టాక్సీలు, అంబులెన్సులు, రెడ్‌ క్రాస్‌ సిబ్బంది వాహనాలు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. అక్కడ జరిగిన నష్టం వివరాలు కూడా వెల్లడైతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఈ విలయానికి తీవ్రంగా ప్రభావితమైన అల్‌ హౌజ్‌ ప్రావిన్స్‌లో మరణాలు అత్యధికంగా 1,293 నమోదయ్యాయి. ఆ తర్వాత టరౌడంట్‌ ప్రావిన్స్‌లో 452 మంది చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్, అల్జీరియా, జర్మనీ, యూఏఈ, జోర్డాన్‌ తదితర దేశాలతోపాటు డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ వంటి సంస్థలు చేయూత  అందించేందుకు ముందుకు వచ్చాయి.

కళతప్పిన పర్యాటక పట్టణం
అట్లాస్‌ పర్వతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతం మౌలే బ్రహీం భూకంపం ధాటికి విలవిల్లాడింది. మూడువేల జనాభా కలిగిన ఈ చిన్న పట్టణవాసుల ప్రధాన ఆధారం వ్యవసాయం, పర్యాటకం. ఇక్కడి వందల ఏళ్లనాటి ఇటుకతో నిర్మించిన ఇళ్లు పర్యాటకులను ఆకట్టుకునేవి. భూకంపం తీవ్రతకు ఈ ఇళ్లు చాలా వరకు నామరూపాలు కోల్పోగా మిగిలినవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో, జనం ఇళ్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు.

పట్టణంలోని కూడలిలోనే భారీ టెంట్‌ వేసుకుని, అందులోనే ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ఇల్లంతా ఒక్కసారిగా కదులుతున్నట్లు అనిపించడంతో తమ కుటుంబసభ్యులంతా కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశామని మౌలే బ్రహీంకు చెందిన హంజా లంఘానీ చెప్పాడు. బయటికి వెళ్లాక చూడగా తమ ఇంటితోపాటు పొరుగిల్లు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయన్నాడు. పొరుగింట్లో ఉండే తన చిన్ననాటి స్నేహితులు అయిదుగురూ ఆ శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయారని నిర్వేదంతో చెప్పాడు.

భారతీయులంతా సురక్షితం
భూకంపం నేపథ్యంలో మొరాకోలోని భారత దౌత్యకార్యాలయం స్పందించింది. దేశంలోని భారత పౌరులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం లేదన్నారు. స్థానిక యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాల్సిందిగా సలహా ఇచ్చింది. అవసరమైన పక్షంలో తమ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 212661297491కు కాల్‌ చేయాల్సిందిగా కోరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement