ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించింది. ఆగ్నేయ మొరాకోలోని ఎడారి ప్రాంతంలో వర్షం పడడమంటే చాలా అరుదైన ఘటన. మొరాకో ప్రభుత్వ సమాచారం మేరకు సెప్టెంబరులో రెండురోజుల పాటు కురిసిన వర్షం.. చాలా ప్రాంతాల్లో ఏడాది సగటును మించిపోయింది.
ఇక్కడ ఏటా 250 మి.మీ. కంటే తక్కువగా సగటు వర్షపాతం నమోదవుతుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని రబత్‌కు 450 కి.మీ. దూరంలోని టాగౌనైట్ గ్రామంలో 24 గంటల్లోనే 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసిందని.. ఇది అత్యంత అరుదైన పరిణామమని పేర్కొన్నాయి.
జాగోరా, టాటా మధ్య 50 ఏళ్లుగా పాటు పొడిగా ఉన్న ఇరికీ సరస్సు వరద కారణంగా తిరిగి నిండినట్లు నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడవుతోంది. గత 30 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వర్షాలు కురవడం ఇదే తొలిసారి అనిి మొరాకో వాతావరణ సంస్థ అధికారి హౌసీన్ యూబెబ్ పేర్కొన్నారు. కాగా గత నెలలో మొకరాలో సంభవించిన వరదలు 18 మందిని బలిగొన్నాయి.
ఇక సహారా ఎడారి, ఉత్తర, మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా అంతటా 9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రమైన వాతావరణ వేడిని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ తరహా తుఫానులు మరింత తరచుగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment