North Africa
-
శవాల దిబ్బగా మొరాకో
మర్రకేశ్: భూకంపం సృష్టించిన పెను విధ్వంసం, ప్రాణనష్టం మొరాకో వాసులను షాక్‌కు గురిచేసింది. ఈ ఉత్తర ఆఫ్రికా దేశంలో ఇంతటి తీవ్ర భూకంపం రావడం 120 ఏళ్లలో ఇదే మొదటిసారి. దేశంలోని మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు భయాందోళనలతో వీధుల్లో రెండో రోజూ చీకట్లోనే జాగారం చేశారు. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది. శిథిలాలను తొలగిస్తుండటంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 2,012కు చేరింది. క్షతగాత్రులైన మరో 2,059 మందిలో 1,404 మందికి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని గుర్తించి, కాపాడేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సుదూరంగా కొండ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు సహాయక బృందాలు చేరడం కష్టంగా మారింది. అక్కడి మట్టిరోడ్లపై బండరాళ్లు పడిపోవడంతో టాక్సీలు, అంబులెన్సులు, రెడ్ క్రాస్ సిబ్బంది వాహనాలు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. అక్కడ జరిగిన నష్టం వివరాలు కూడా వెల్లడైతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఈ విలయానికి తీవ్రంగా ప్రభావితమైన అల్ హౌజ్ ప్రావిన్స్‌లో మరణాలు అత్యధికంగా 1,293 నమోదయ్యాయి. ఆ తర్వాత టరౌడంట్ ప్రావిన్స్‌లో 452 మంది చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్, అల్జీరియా, జర్మనీ, యూఏఈ, జోర్డాన్ తదితర దేశాలతోపాటు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి సంస్థలు చేయూత అందించేందుకు ముందుకు వచ్చాయి. కళతప్పిన పర్యాటక పట్టణం అట్లాస్ పర్వతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతం మౌలే బ్రహీం భూకంపం ధాటికి విలవిల్లాడింది. మూడువేల జనాభా కలిగిన ఈ చిన్న పట్టణవాసుల ప్రధాన ఆధారం వ్యవసాయం, పర్యాటకం. ఇక్కడి వందల ఏళ్లనాటి ఇటుకతో నిర్మించిన ఇళ్లు పర్యాటకులను ఆకట్టుకునేవి. భూకంపం తీవ్రతకు ఈ ఇళ్లు చాలా వరకు నామరూపాలు కోల్పోగా మిగిలినవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో, జనం ఇళ్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పట్టణంలోని కూడలిలోనే భారీ టెంట్ వేసుకుని, అందులోనే ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ఇల్లంతా ఒక్కసారిగా కదులుతున్నట్లు అనిపించడంతో తమ కుటుంబసభ్యులంతా కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశామని మౌలే బ్రహీంకు చెందిన హంజా లంఘానీ చెప్పాడు. బయటికి వెళ్లాక చూడగా తమ ఇంటితోపాటు పొరుగిల్లు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయన్నాడు. పొరుగింట్లో ఉండే తన చిన్ననాటి స్నేహితులు అయిదుగురూ ఆ శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయారని నిర్వేదంతో చెప్పాడు. భారతీయులంతా సురక్షితం భూకంపం నేపథ్యంలో మొరాకోలోని భారత దౌత్యకార్యాలయం స్పందించింది. దేశంలోని భారత పౌరులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం లేదన్నారు. స్థానిక యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాల్సిందిగా సలహా ఇచ్చింది. అవసరమైన పక్షంలో తమ హెల్ప్‌లైన్ నంబర్ 212661297491కు కాల్ చేయాల్సిందిగా కోరింది. -
సంక్షుభిత దేశంలో సంఘర్షణ
‘మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి వాటి కాళ్ళ కింద పడి నలిగిపోతుంద’ని ఆఫ్రికన్ సామెత. ఉత్తర ఆఫ్రికా దేశం సూడాన్‌లో పరిస్థితి ఇప్పుడదే. పైచేయి కోసం సైన్యానికీ, పారా మిలటరీ దళాలకూ మధ్య... ఆ రెంటికీ సారథ్యం వహిస్తున్న ఇద్దరు సైనిక జనరల్స్ మధ్య... నాలుగు రోజులుగా చెలరేగుతున్న హింసాకాండలో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 వేల మంది గాయపడ్డారు. వీధుల్లో పడివున్నవారి వద్దకు వైద్యులు వెళ్ళే పరిస్థితి లేనందువల్ల అసలు లెక్క ఇంకెన్ని రెట్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇళ్ళు, ఆస్పత్రులు, విద్యుత్కేంద్రాలు, విమానాశ్ర యాలు – ఏవీ యుద్ధట్యాంకుల కాల్పులకు మినహాయింపు కాదు. లక్షల మంది ఇంటి గడప దాటి బయటకు రాలేని పరిస్థితి. ఒకవైపు కరెంట్ లేక కష్టపడుతుంటే, మరోవైపు ఇళ్ళపై పడి దోచేస్తున్న దుఃస్థితి. అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, సౌదీ అరేబియా సహా పలు దేశాలు రంగంలోకి దిగి, ‘బేషరతుగా శత్రుత్వాన్ని విడనాడాల’ని కోరాల్సి వచ్చింది. ఐరాస ప్రధాన కార్యదర్శి సైతం హింసకు స్వస్తి పలకండంటూ ఇరువర్గాల సైనికనేతలతో మాట్లాడారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సహజ వనరుల సంపన్న దేశమైతేనేం, 1956లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి సూడాన్‌లో నిత్యం ఏదో ఒక కుంపటి. ప్రజాపాలన ఏర్పడేందుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి. అనేకానేక ఆకస్మిక తిరుగుబాట్లు, పౌర కలహాల చరిత్ర. 1989 నాటి విద్రోహంతో దేశాధ్య క్షుడైన నియంత బషీర్ దీర్ఘకాలిక ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనతో పడిపోయింది. ఆ మూడు దశాబ్దాల హింసాత్మక, నిరంకుశ, అవినీతి పాలన స్థానంలో స్వేచ్ఛా యుత, ప్రజాప్రభుత్వం వస్తుందన్న ఆశ ఫలించలేదు. రెండేళ్ళకే, మధ్యంతర పౌరప్రభుత్వం నడు స్తుండగానే ఎన్నికలు జరగాల్సినవేళ 2021లో జనరల్ బుర్హాన్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది. ఆనాటి నుంచి సదరు సైనిక జనరలే అసలుసిసలు పాలకుడిగా, సైన్యమే సూడాన్‌ను నడిపిస్తోంది. అలా సైన్యాధికారమే సాగేందుకు మహమ్మద్ హమ్దన్ దగలో అలియాస్ హెమెడ్తీ నేతృత్వంలోని పారా మిలటరీ బలగమైన ‘సత్వర మద్దతు దళాల’ (ఆర్ఎస్ఎఫ్) కూడా సూడాన్ ఆర్మీతో కలసి పనిచేస్తూ వచ్చింది. అయితే... కొంతకాలంగా సూడాన్ సైన్యానికీ, ‘ఆర్ఎస్ఎఫ్’కూ మధ్య పొసగడం లేదు. రెండేళ్ళ క్రితం చేతిలో చేయి వేసుకు నిలబడి, మధ్యంతర పౌరప్రభుత్వాన్ని పడదోసి, పాలనా పగ్గాలు చేపట్టిన సైనిక జనరల్స్ బుర్హాన్కూ, ఆయన డిప్యూటీ దగలోకూ మధ్య ఇప్పుడు అపనమ్మకం పెరిగింది. వారి ఆధిపత్య పోరు ఫలితమే సూడాన్‌లో తాజా సంక్షోభం. నియంత బషీర్ పదవీచ్యుతి అనంతర రాజకీయ అధికార బదలీలో భాగంగా అసలైతే ఈ 2023 చివరికి ఎన్నికలు జరపాలి. పౌర పాలనకు బాటలు వేస్తామంటూ సైనిక నేత జనరల్ బుర్హాన్ సైతం బాస చేశారు. అయితే, అధికారమంటే ఎవరికి తీపి కాదు! అందుకే, ఇటు సేనా నాయకుడు, అటు ‘ఆర్ఎస్ఎఫ్’ సారథి... ఎవరూ అధికారాన్ని వదులుకోదలుచుకోలేదు. పైచేయికై పరస్పరం ఢీ కొన్నారు. ఆర్ఎస్ఎఫ్ పారామిలటరీలను కూడా సూడాన్ ఆర్మీలోకి చేర్చుకొని, రెండేళ్ళలో పౌర సర్కార్ ఏర్పాటుచేయడంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం హింసకు కారణం. ఆర్మీలో ఆర్ఎస్ ఎఫ్‌ను చేర్చుకుంటే తన పట్టు పోతుందని దగాలో భయం. పౌర ప్రభుత్వాన్ని మరో పదేళ్ళు జాగు చేయాలని ఆయన భావన. ఇది కడుపులో పెట్టుకొని, సైన్యం అనుమతి లేకనే వివిధ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎఫ్ తన వాళ్ళను మోహరించడం మొదలెట్టింది. ఇది ఏప్రిల్ 15 నుంచి హింసాత్మకమైంది. నిజానికి, ఇవన్నీ ఉన్నట్టుండి జరిగినవి కానే కావు. సూడాన్ దేశ ఆర్థిక సంపదపై, అందులోనూ ప్రత్యేకించి బంగారు గనులపై నియంత్రణ కోసం ఆర్ఎస్ఎఫ్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అలా ఇరువర్గాల మధ్య పెరిగిన కుతకుతలు ఇక్కడికి దారి తీశాయి. దీర్ఘకాలం దేశాధ్యక్షుడైన నియంత బషీరే కాదు... 2000ల నాటికి జంజవీద్ అనే తీవ్రవాద సంస్థ సారథిగా మొదలై ఇప్పుడు ఆర్ఎస్ఎఫ్ అధినేత అయిన దగాలో, ప్రస్తుత సైనిక నేత బుర్హాన్... అంతా ఒకే తాను గుడ్డలు. అందరూ మానవ హక్కులను కాలరాసినవారే. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపినవారే. ఎవరు గద్దెపై ఉన్నా సూడాన్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు అడుగులేయడం కల్ల. వేలకొద్దీ సైన్యం చేతుల్లో ఉన్న ఇద్దరు అహంభావుల వ్యక్తిగత అధికార దాహానికి ఇన్ని లక్షల మంది ఇక్కట్ల పాలవడమే దురదృష్టం. అంతర్యుద్ధాన్ని నివారించడానికే మధ్యంతర సర్కారును కాదని సైన్యం పగ్గాలు పట్టిందని 2021లో అన్న బుర్హాన్ ఇప్పుడచ్చంగా దేశాన్ని అటువైపే నెట్టేస్తున్నారు. సూడాన్‌లో సుస్థిరత, సురక్షణ, ప్రజాస్వామ్యం భారత్‌కూ కీలకమే. సంక్షుభిత సూడాన్‌లో దాదాపు 4 వేల మంది భారతీయులున్నారు. వారిలో 1200 మంది దశాబ్దాల క్రితమే అక్కడ స్థిరపడ్డారు. తాజా ఘర్షణల్లో కేరళకు చెందిన ఒకరు మరణించగా, కర్ణాటకలోని హక్కీ–పిక్కీ తెగకు చెందినవారు పదుల సంఖ్యలో చిక్కుకుపోయారన్న మాట ఆందోళన రేపుతోంది. ఘర్షణలు మరింత పెరిగితే సూడాన్ సహా ఆ పరిసర ప్రాంతాలన్నీ అస్థిరతలోకి జారిపోతాయి. ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభం, ఆకాశమార్గం పట్టిన ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశానికి ఇరుగు పొరుగుతోనూ సంబంధాలు దెబ్బతింటాయి. దేశం ప్రజాస్వామ్య పాలన దిశగా అడుగులు వేయ డానికీ ఉపకరించదు. వెరసి, సూడాన్ చరిత్రలో ప్రతి రాజకీయ çపరివర్తనకూ సైన్యమే కేంద్ర మవుతూ వచ్చింది గనక ఈసారి ఏ మార్పు జరుగుతుందో వేచిచూడాలి. -
‘చరిత్ర’ను చదును చేసేశారు
► బృహత్ శిలాయుగం నాటి జనావాస ఆనవాళ్లు ధ్వంసం ► రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివార్లలో పురావస్తు సంపద ► ఆ రక్షిత ప్రాంతం సబ్‌స్టేషన్‌కు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఆఫ్రికాకు తెలంగాణకు సంబంధం ఏమైనా ఉంటుందా?.. మూడు వేల ఏళ్ల క్రితమే మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి తెలంగాణకు వలసలుండేవన్న విషయం తెలుసా?.. ఇనుముకు కార్బన్‌ను జోడిస్తే అది దృఢంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో నివసించిన ఆనాటి వారు రెండున్నర వేల ఏళ్ల కిందే ఉక్కును రూపొందించారని తెలుసా?.. నిజమే ఇనుపయుగం నాటి మానవుల సమాధులున్న ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, పరిశోధనలు చేసినప్పుడు బయటపడ్డ విషయాలివి. హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పక్కనున్న కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఈ పురాతన సంపద ఉంది. కానీ మూడు వేల ఏళ్ల నాటి పెద్ద జనావాసమున్న ఈ పురాతన సంపద ఆనవాళ్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాశనమైపోయాయి. నిజాం హయాంలో గుర్తింపు కేతిరెడ్డిపల్లి గ్రామం వెలుపల వందల సంఖ్యలో బృహత్ శిలాయుగం నాటి సమాధులున్నాయి. నిజాం హయాంలో నాటి పురావస్తు నిపుణులు దీనిని గుర్తించారు. దాంతో ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలని భావించిన నిజాం.. సమాధులు విస్తరించి ఉన్న దాదాపు 40 ఎకరాల స్థలాన్ని పురావస్తుశాఖకు అప్పగించారు. స్వాతంత్రం అనంతరం పురావస్తు శాఖ దానిని రక్షిత స్థలంగా ప్రకటిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. పురావస్తు రక్షిత ప్రాంతంగా గుర్తిస్తూ 1953లో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. భవిష్యత్తులో వాటిని తవ్వి సమాధుల్లో లభించే వస్తువుల ఆధారంగా పరిశోధనలు చేయాలని అప్పట్లో నిర్ణయించినా తర్వాత పట్టించుకోలేదు. ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలోనిదే కావడంతో అలాగే ఖాళీగా ఉండిపోయింది. సబ్‌స్టేషన్ కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా.. హైదరాబాద్ శివార్లలో 400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ట్రాన్సకో మొయినాబాద్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడ స్థలం కావాలని రెవెన్యూ శాఖను కోరింది. దీంతో అధికారులు సరిగ్గా పురావస్తు సంపద ఉన్న చోటే 71 ఎకరాల స్థలాన్ని ట్రాన్సకోకు అప్పగించారు. ట్రాన్సకో రెండు నెలలుగా ఈ ప్రాంతాన్ని చదును చేసే పని చేపట్టింది. అక్కడ పురావస్తు సంపద ఉన్న విషయాన్ని రెండు శాఖలూ గుర్తించలేదు. ఈ క్రమంలో సమాధులకు గుర్తుగా భారీ రాళ్లతో వృత్తాకారంలో ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించేశారు. కొన్ని వందల నిర్మాణాలు ధ్వంసమయ్యాక గ్రామస్తుల సమాచారంతో మేల్కొన్న పురావస్తు శాఖ అధికారులు... హడావుడిగా వెళ్లి పనులను ఆపివేయించారు. దీంతో 18 ఎకరాల ప్రాంతం మాత్రం మిగిలింది. ఇందులో ఉన్న కొన్ని సమాధులను పరిరక్షించాలని పురావస్తు శాఖ అధికారులు నిర్ణయించారు. -
పోలీసుల అదుపులో మాఫియా డాన్
ఉత్తర ఆఫ్రికాలో పట్టుబడ్డ బన్నంజె రాజ బెంగళూరు : రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మాఫియాడాన్ బన్నంజె రాజను ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర హోంశాఖ అధికారులు అతన్ని బంధించి రాష్ట్రానికి తీసుకురావడానికి సమాయత్తమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూలతహా ఉడిపి జిల్లాలోని బన్నంజె గ్రామానికి చెందిన రాజేంద్ర అలియాస్ బన్నంజె రాజ 1990లో పీయూసీ చదివే సమయంలోనే తన సహ పాఠకుడైన ఒకరిని కళాశాల మొదటి అంతస్తు నుంచి కిందికి తోసి వేశాడు. జైలు జీవితం అనంతరం బైటకు వచ్చిన అతను బెదిరించి డబ్బు వసూలు చేయడంతోపాటు వివిధ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవాడు మొదట్లో ఛోటారాజన్ అనుచరుడిగా గుర్తించబడ్డా అటుపై అండర్ వరల్డ్‌లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. తర్వాత హత్యలు, కిడ్నాపులు, భూ కబ్జాలకు పాల్పడి కోట్లాది రూపాయలు వసూలు చేసేవాడు. బెంగళూరులోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 11 కేసులతో పాటు రాష్ట్ర వ్యాప్త్తంగా వేర్వేరు జిల్లాల్లో మొత్తం 26 కేసులు నమోదయ్యాయి. 1998లో దుబాయికు పారిపోయి అక్కడి నుంచి కర్ణాటకలోని పారిశ్రామిక వేత్తలను బెదిరించి డబ్బు వసూలుకు పాల్పడేవాడు. ఇదిలా ఉండగా ఇటీవల తన మకాంను మొరాకోకు మార్చి అక్కడి నుంచి బెదిరింపులకు పాల్పడే వాడు. ఇతనిపై ఇంటర్‌పోల్ కూడా రెడ్కార్నర్ను కూడా జారీ చేసింది. దీంతో విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు బన్నంజె రాజను అరెస్టు చేసి ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసులకు కూడా తెలియజేశారు. అప్రమత్తమైన పోలీసులు బన్నంజె రాజను అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకురావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, 2009లోనే ఇతన్ని దుబాయిలోని పోలీసులు అరెస్టు చేసినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాష్ట్ర పోలీసులు అప్పట్లో రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. -
ఆఫ్రికాపై ధూళి కమ్మితే.. భారత్‌లో వర్షం!
రుతుపవనాలపై ప్రభావం చూపుతున్న ధూళి కణాలు వాషింగ్టన్: ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా ప్రాంతాలపై ధూళి మేఘాలు కమ్ముకుంటే భారత్‌లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయట. భారత్‌కు పశ్చిమ దిక్కున ఉన్న ప్రాంతాలపై గాలిలో ధూళికణాలు పెరగడం వల్ల అక్కడ గాలి బాగా వేడెక్కుతుందని, ఫలితంగా తూర్పు వైపు ప్రయాణించే గాలిలో తేమ శాతం పెరిగి భారత్‌లో వర్షాలు అధికంగా కురుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబోరేటరీ శాస్త్రవేత్తలతో కలిసి ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన వి.వినోజ్ బృందం జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌లో వర్షపాతంపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసిన వినోజ్ బృందం ఈ మేరకు కనుగొంది.