‘మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి వాటి కాళ్ళ కింద పడి నలిగిపోతుంద’ని ఆఫ్రికన్ సామెత. ఉత్తర ఆఫ్రికా దేశం సూడాన్‌లో పరిస్థితి ఇప్పుడదే. పైచేయి కోసం సైన్యానికీ, పారా మిలటరీ దళాలకూ మధ్య... ఆ రెంటికీ సారథ్యం వహిస్తున్న ఇద్దరు సైనిక జనరల్స్ మధ్య... నాలుగు రోజులుగా చెలరేగుతున్న హింసాకాండలో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 వేల మంది గాయపడ్డారు. వీధుల్లో పడివున్నవారి వద్దకు వైద్యులు వెళ్ళే పరిస్థితి లేనందువల్ల అసలు లెక్క ఇంకెన్ని రెట్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.
ఇళ్ళు, ఆస్పత్రులు, విద్యుత్కేంద్రాలు, విమానాశ్ర యాలు – ఏవీ యుద్ధట్యాంకుల కాల్పులకు మినహాయింపు కాదు. లక్షల మంది ఇంటి గడప దాటి బయటకు రాలేని పరిస్థితి. ఒకవైపు కరెంట్ లేక కష్టపడుతుంటే, మరోవైపు ఇళ్ళపై పడి దోచేస్తున్న దుఃస్థితి. అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, సౌదీ అరేబియా సహా పలు దేశాలు రంగంలోకి దిగి, ‘బేషరతుగా శత్రుత్వాన్ని విడనాడాల’ని కోరాల్సి వచ్చింది. ఐరాస ప్రధాన కార్యదర్శి సైతం హింసకు స్వస్తి పలకండంటూ ఇరువర్గాల సైనికనేతలతో మాట్లాడారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సహజ వనరుల సంపన్న దేశమైతేనేం, 1956లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి సూడాన్‌లో నిత్యం ఏదో ఒక కుంపటి. ప్రజాపాలన ఏర్పడేందుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి. అనేకానేక ఆకస్మిక తిరుగుబాట్లు, పౌర కలహాల చరిత్ర. 1989 నాటి విద్రోహంతో దేశాధ్య క్షుడైన నియంత బషీర్ దీర్ఘకాలిక ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనతో పడిపోయింది. ఆ మూడు దశాబ్దాల హింసాత్మక, నిరంకుశ, అవినీతి పాలన స్థానంలో స్వేచ్ఛా యుత, ప్రజాప్రభుత్వం వస్తుందన్న ఆశ ఫలించలేదు. రెండేళ్ళకే, మధ్యంతర పౌరప్రభుత్వం నడు స్తుండగానే ఎన్నికలు జరగాల్సినవేళ 2021లో జనరల్ బుర్హాన్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది.
ఆనాటి నుంచి సదరు సైనిక జనరలే అసలుసిసలు పాలకుడిగా, సైన్యమే సూడాన్‌ను నడిపిస్తోంది. అలా సైన్యాధికారమే సాగేందుకు మహమ్మద్ హమ్దన్ దగలో అలియాస్ హెమెడ్తీ నేతృత్వంలోని పారా మిలటరీ బలగమైన ‘సత్వర మద్దతు దళాల’ (ఆర్‌ఎస్‌ఎఫ్) కూడా సూడాన్ ఆర్మీతో కలసి పనిచేస్తూ వచ్చింది. అయితే... కొంతకాలంగా సూడాన్ సైన్యానికీ, ‘ఆర్‌ఎస్‌ఎఫ్’కూ మధ్య పొసగడం లేదు. రెండేళ్ళ క్రితం చేతిలో చేయి వేసుకు నిలబడి, మధ్యంతర పౌరప్రభుత్వాన్ని పడదోసి, పాలనా పగ్గాలు చేపట్టిన సైనిక జనరల్స్ బుర్హాన్‌కూ, ఆయన డిప్యూటీ దగలోకూ మధ్య ఇప్పుడు అపనమ్మకం పెరిగింది. వారి ఆధిపత్య పోరు ఫలితమే సూడాన్‌లో తాజా సంక్షోభం.
నియంత బషీర్ పదవీచ్యుతి అనంతర రాజకీయ అధికార బదలీలో భాగంగా అసలైతే ఈ 2023 చివరికి ఎన్నికలు జరపాలి. పౌర పాలనకు బాటలు వేస్తామంటూ సైనిక నేత జనరల్ బుర్హాన్ సైతం బాస చేశారు. అయితే, అధికారమంటే ఎవరికి తీపి కాదు! అందుకే, ఇటు సేనా నాయకుడు, అటు ‘ఆర్‌ఎస్‌ఎఫ్’ సారథి... ఎవరూ అధికారాన్ని వదులుకోదలుచుకోలేదు. పైచేయికై పరస్పరం ఢీ కొన్నారు. ఆర్‌ఎస్‌ఎఫ్ పారామిలటరీలను కూడా సూడాన్ ఆర్మీలోకి చేర్చుకొని, రెండేళ్ళలో పౌర సర్కార్ ఏర్పాటుచేయడంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం హింసకు కారణం. ఆర్మీలో ఆర్‌ఎస్ ఎఫ్‌ను చేర్చుకుంటే తన పట్టు పోతుందని దగాలో భయం. పౌర ప్రభుత్వాన్ని మరో పదేళ్ళు జాగు చేయాలని ఆయన భావన. ఇది కడుపులో పెట్టుకొని, సైన్యం అనుమతి లేకనే వివిధ ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఎఫ్ తన వాళ్ళను మోహరించడం మొదలెట్టింది. ఇది ఏప్రిల్ 15 నుంచి హింసాత్మకమైంది.
నిజానికి, ఇవన్నీ ఉన్నట్టుండి జరిగినవి కానే కావు. సూడాన్ దేశ ఆర్థిక సంపదపై, అందులోనూ ప్రత్యేకించి బంగారు గనులపై నియంత్రణ కోసం ఆర్‌ఎస్‌ఎఫ్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అలా ఇరువర్గాల మధ్య పెరిగిన కుతకుతలు ఇక్కడికి దారి తీశాయి. దీర్ఘకాలం దేశాధ్యక్షుడైన నియంత బషీరే కాదు... 2000ల నాటికి జంజవీద్ అనే తీవ్రవాద సంస్థ సారథిగా మొదలై ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎఫ్ అధినేత అయిన దగాలో, ప్రస్తుత సైనిక నేత బుర్హాన్... అంతా ఒకే తాను గుడ్డలు. అందరూ మానవ హక్కులను కాలరాసినవారే. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపినవారే. ఎవరు గద్దెపై ఉన్నా సూడాన్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు అడుగులేయడం కల్ల. వేలకొద్దీ సైన్యం చేతుల్లో ఉన్న ఇద్దరు అహంభావుల వ్యక్తిగత అధికార దాహానికి ఇన్ని లక్షల మంది ఇక్కట్ల పాలవడమే దురదృష్టం. అంతర్యుద్ధాన్ని నివారించడానికే మధ్యంతర సర్కారును కాదని సైన్యం పగ్గాలు పట్టిందని 2021లో అన్న బుర్హాన్ ఇప్పుడచ్చంగా దేశాన్ని అటువైపే నెట్టేస్తున్నారు.
సూడాన్‌లో సుస్థిరత, సురక్షణ, ప్రజాస్వామ్యం భారత్‌కూ కీలకమే. సంక్షుభిత సూడాన్‌లో దాదాపు 4 వేల మంది భారతీయులున్నారు. వారిలో 1200 మంది దశాబ్దాల క్రితమే అక్కడ స్థిరపడ్డారు. తాజా ఘర్షణల్లో కేరళకు చెందిన ఒకరు మరణించగా, కర్ణాటకలోని హక్కీ–పిక్కీ తెగకు చెందినవారు పదుల సంఖ్యలో చిక్కుకుపోయారన్న మాట ఆందోళన రేపుతోంది. ఘర్షణలు మరింత పెరిగితే సూడాన్ సహా ఆ పరిసర ప్రాంతాలన్నీ అస్థిరతలోకి జారిపోతాయి. ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభం, ఆకాశమార్గం పట్టిన ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశానికి ఇరుగు పొరుగుతోనూ సంబంధాలు దెబ్బతింటాయి. దేశం ప్రజాస్వామ్య పాలన దిశగా అడుగులు వేయ డానికీ ఉపకరించదు. వెరసి, సూడాన్ చరిత్రలో ప్రతి రాజకీయ çపరివర్తనకూ సైన్యమే కేంద్ర మవుతూ వచ్చింది గనక ఈసారి ఏ మార్పు జరుగుతుందో వేచిచూడాలి.
సంక్షుభిత దేశంలో సంఘర్షణ
Published Wed, Apr 19 2023 12:51 AM | Last Updated on Wed, Apr 19 2023 12:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment