paramilitary forces
-
చిన్ననాటి స్నేహితులు చెరో దారిలో నడిచారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వాళ్లిద్దరూ చెడ్డీ దోస్తులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహం వారిది. ఇద్దరూ కలిసి పదో తరగతి దాకా చదువుకున్నారు. టెన్త్ పూర్తయ్యాక చెరో దారిలో నడిచారు. అది కూడా వర్గ శత్రువులుగా భావించే నక్సలిజం వైపు ఒకరు వెళ్తే, కేంద్ర పారామిలటరీ బలగాల్లోకి మరొకరు వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత ఏడాది తేడాలో ఆ ఇద్దరూ అసువులు బాసారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామం పెద్ద వెంకట్‌రెడ్డి, భూమవ్వల కుమారుడైన సిద్దారెడ్డి, అదే గ్రామానికి చెందిన కంది నాగమణి, శంకరయ్య దంపతుల పెద్ద కొడుకు సిద్దరాములు ఇద్దరూ చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు. స్కూలుకైనా, వాగులో ఈతకైనా, ఆటల్లో అయినా ఇద్దరూ ఇద్దరే. అలాంటి స్నేహితులు నూనూగు మీసాల వయసులో చెరో దారిని ఎంచుకున్నారు. సిద్దారెడ్డి అలి యాస్ సిద్దన్న సమసమాజం కోసమంటూ అప్పటి పీపు ల్స్వార్ ఉద్యమంలో చేరిపోయాడు. తర్వాత కాలంలో ఆ ప్రాంత ఆర్గనైజర్‌గా చురుగ్గా పాల్గొన్న సిద్దారెడ్డి 1998లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. సిద్దారెడ్డి స్నేహితుడు సిద్దరాము లు దేశ రక్షణ తన విధిగా భావించి 1990లో సీఆర్పీఎఫ్ జవా నుగా సెలెక్టయ్యాడు. ఆయన 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు మందుపాతర పేల్చిన ఘటనలో తనువు చాలించాడు. సిద్దారెడ్డి స్తూపం పక్కనే సిద్దరాములు విగ్రహం...చిట్యాల గ్రామంలోకి అడుగుపెట్టగానే ప్రధాన కూడలి వద్ద రోడ్డు పక్కన స్తూపం, దాని పక్కనే విగ్రహం ఉంటాయి. గ్రామంలో సిద్దారెడ్డితో పాటు చనిపోయిన మరికొందరి పేర్లతో అమరవీరు ల స్తూపం నిర్మించారు. కాగా జవాన్ సిద్దరాములు తల్లి కంది నాగమణి తన కొడుకు విగ్రహం పెట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రయ త్నించి.. చివరకు ఏర్పాటు చేసి గతేడాది మార్చి 27న ఆవిష్కరింపజేసింది. ఇద్దరి విగ్రహాలు పక్కపక్కనే ఏర్పాటు చేయడం యా దృచ్ఛికంగా జరిగినా, దోస్తులూ పక్కపక్కనే ఉన్నట్టుంటుంది. -
Sudan: సూడాన్‌లో కల్లోల పరిస్థితులు.. చిక్కుకుపోయిన మనోళ్లు
ఖార్తూమ్: సూడాన్ సైన్యం, పారామిలటరీ విభాగమైన తక్షణ మద్దతు దళం(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్)కు మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో నెలకొన్న కల్లోల పరిస్థితులు అక్కడి భారతీయులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇరు వర్గాల కాల్పులు, బాంబుల మోతతో ఉన్నచోటు నుంచి కనీసం బయటకురాలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం అర్థిస్తున్నారు. దీంతో దౌత్యమార్గంలో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాల్పుల విరమణకు అమెరికా వంటి దేశాలు పిలుపునిచ్చినా కొద్ది గంటలకే అది విఫలమై గడిచిన 24 గంటల్లోనే మరో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి చేయి దాటేలోపే భారతీయులను వెనక్కితీసుకురావాలనే భారత్ కృతనిశ్చయంతో ఉందని భారత విదేశాంగ శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కర్ణాటక సంప్రదాయ మూలిక వైద్యం చేసే 31 మంది ‘హక్కీ పిక్కీ’ గిరిజనులుసహా 60 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకున్నారని వారి గురించి పట్టించుకోండని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కోరడం, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం తెల్సిందే. సూడాన్ ఘర్షణల్లో ఇప్పటిదాకా దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఖార్తూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక మాజీ భారతీయ సైనికుడు ఆల్బర్ట్ అగస్టీన్ చనిపోయారు. 1,800 మందికిపైగా గాయాలపాలయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, సౌదీ, యూఏఈతో మంతనాలు సూడాన్‌తో సంబంధాలు నెరుపుతున్న అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలతో భారత విదేశాంగ శాఖ మంతనాలు కొనసాగిస్తోంది. క్షేత్రస్థాయిలో భారతీయుల రక్షణకు సాయపడతామని జైశంకర్‌కు సౌదీ, యూఏఈ విదేశాంగ మంత్రులు హామీ ఇచ్చారు. సూడాన్‌లో భారతీయ ఎంబసీ అక్కడి భారతీయులతో వాట్సాప్ గ్రూప్లుసహా పలు మార్గాల్లో టచ్‌లోనే ఉంది. ‘ మా నాన్న వ్యాపార నిమిత్తం అక్కడికెళ్లి శనివారమే ముంబైకి రావాల్సింది. సూడాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా చివరి నిమిషంలో విమానం రద్దయిందని చెప్పి అక్కడి అధికారులు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లగొట్టారు. హోటల్‌కు కాలినడకనే వెళ్లారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఏంటో తెలీడం లేదు’ అని 63 ఏళ్ల వ్యక్తి కూతురు మానసి సేథ్ వాపోయారు. ‘అక్కడంతా ఆటవిక రాజ్యమే. ప్రాణాలకు విలువే లేదు. స్వయంగా సైనికులే లూటీ చేస్తూ అపహరణలకు పాల్పడుతున్నారు. ఖర్తూమ్ హోటల్లో నా భర్త చిక్కుకుపోయారు. బాంబుల దాడి భయంతో హోటల్లోని అతిథులంతా బేస్మెంట్లో దాక్కున్నారు’ అని మరో మహిళ పీటీఐకి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీధుల్లో రాకపోకలు కూడా కష్టమేనని భారత విదేశాంగ శాఖ చెబుతోందంటే అక్కడి పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. 150 ఏళ్ల క్రితమే సూడాన్‌కు వలసలు ప్రస్తుతం సూడాన్‌లో దాదాపు 4,000 మంది భారతీయులున్నారు. వీరిలో 1,200 మంది శాశ్వత స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వీరి కుటుంబాలు 150 ఏళ్ల క్రితమే అక్కడికి వలసవెళ్లాయి. ఇక మిగతావారు సూడాన్ ఆర్థిక రంగం వంటి పలు వృత్తుల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. కొందరు ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలు, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఎవరీ హక్కీ పిక్కీలు ? గుజరాత్ నుంచి శతాబ్దాల క్రితం కర్ణాటకకు హక్కి పిక్కి అనే గిరిజన తెగ ప్రజలు వలసవచ్చారు. అడవుల్లో ఉంటూ మూలికా వైద్యం చేస్తారు. వీరికి సొంత భాష ‘వగ్రీబూలి’తోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వచ్చు. పేద ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఖరీదైన ఇంగ్లిష్ మందులు, వైద్యం పొందగల స్తోమత ఉన్న జనాభా చాలా తక్కువ. అందుకే స్థానికులు చవక వైద్యం వైపు మొగ్గుచూపుతారు. అందుకే వారికి తమ సంప్రదాయ వైద్యం చేసేందుకు సుదూరంలోని సూడాన్‌కు ఈ కర్ణాటక గిరిజనులు చేరుకున్నారు. ఎందుకీ గొడవ ? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని అబ్దల్లా హమ్దోక్ను గత ఏడాది సైన్యం, ఆర్ఎస్ఎఫ్ గద్దెదించి పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. తాజాగా ఆర్ఎస్ఎఫ్ను సైన్యంలో విలీనం చేయాలని సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దుల్ ఫతాహ్ అల్–బుర్హాన్ ప్రతిపాదించగా ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు సాయుధ విభాగాల మధ్య అగ్గి రాజుకుంది. -
సంక్షుభిత దేశంలో సంఘర్షణ
‘మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి వాటి కాళ్ళ కింద పడి నలిగిపోతుంద’ని ఆఫ్రికన్ సామెత. ఉత్తర ఆఫ్రికా దేశం సూడాన్‌లో పరిస్థితి ఇప్పుడదే. పైచేయి కోసం సైన్యానికీ, పారా మిలటరీ దళాలకూ మధ్య... ఆ రెంటికీ సారథ్యం వహిస్తున్న ఇద్దరు సైనిక జనరల్స్ మధ్య... నాలుగు రోజులుగా చెలరేగుతున్న హింసాకాండలో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 వేల మంది గాయపడ్డారు. వీధుల్లో పడివున్నవారి వద్దకు వైద్యులు వెళ్ళే పరిస్థితి లేనందువల్ల అసలు లెక్క ఇంకెన్ని రెట్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇళ్ళు, ఆస్పత్రులు, విద్యుత్కేంద్రాలు, విమానాశ్ర యాలు – ఏవీ యుద్ధట్యాంకుల కాల్పులకు మినహాయింపు కాదు. లక్షల మంది ఇంటి గడప దాటి బయటకు రాలేని పరిస్థితి. ఒకవైపు కరెంట్ లేక కష్టపడుతుంటే, మరోవైపు ఇళ్ళపై పడి దోచేస్తున్న దుఃస్థితి. అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, సౌదీ అరేబియా సహా పలు దేశాలు రంగంలోకి దిగి, ‘బేషరతుగా శత్రుత్వాన్ని విడనాడాల’ని కోరాల్సి వచ్చింది. ఐరాస ప్రధాన కార్యదర్శి సైతం హింసకు స్వస్తి పలకండంటూ ఇరువర్గాల సైనికనేతలతో మాట్లాడారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సహజ వనరుల సంపన్న దేశమైతేనేం, 1956లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి సూడాన్‌లో నిత్యం ఏదో ఒక కుంపటి. ప్రజాపాలన ఏర్పడేందుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి. అనేకానేక ఆకస్మిక తిరుగుబాట్లు, పౌర కలహాల చరిత్ర. 1989 నాటి విద్రోహంతో దేశాధ్య క్షుడైన నియంత బషీర్ దీర్ఘకాలిక ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనతో పడిపోయింది. ఆ మూడు దశాబ్దాల హింసాత్మక, నిరంకుశ, అవినీతి పాలన స్థానంలో స్వేచ్ఛా యుత, ప్రజాప్రభుత్వం వస్తుందన్న ఆశ ఫలించలేదు. రెండేళ్ళకే, మధ్యంతర పౌరప్రభుత్వం నడు స్తుండగానే ఎన్నికలు జరగాల్సినవేళ 2021లో జనరల్ బుర్హాన్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది. ఆనాటి నుంచి సదరు సైనిక జనరలే అసలుసిసలు పాలకుడిగా, సైన్యమే సూడాన్‌ను నడిపిస్తోంది. అలా సైన్యాధికారమే సాగేందుకు మహమ్మద్ హమ్దన్ దగలో అలియాస్ హెమెడ్తీ నేతృత్వంలోని పారా మిలటరీ బలగమైన ‘సత్వర మద్దతు దళాల’ (ఆర్ఎస్ఎఫ్) కూడా సూడాన్ ఆర్మీతో కలసి పనిచేస్తూ వచ్చింది. అయితే... కొంతకాలంగా సూడాన్ సైన్యానికీ, ‘ఆర్ఎస్ఎఫ్’కూ మధ్య పొసగడం లేదు. రెండేళ్ళ క్రితం చేతిలో చేయి వేసుకు నిలబడి, మధ్యంతర పౌరప్రభుత్వాన్ని పడదోసి, పాలనా పగ్గాలు చేపట్టిన సైనిక జనరల్స్ బుర్హాన్కూ, ఆయన డిప్యూటీ దగలోకూ మధ్య ఇప్పుడు అపనమ్మకం పెరిగింది. వారి ఆధిపత్య పోరు ఫలితమే సూడాన్‌లో తాజా సంక్షోభం. నియంత బషీర్ పదవీచ్యుతి అనంతర రాజకీయ అధికార బదలీలో భాగంగా అసలైతే ఈ 2023 చివరికి ఎన్నికలు జరపాలి. పౌర పాలనకు బాటలు వేస్తామంటూ సైనిక నేత జనరల్ బుర్హాన్ సైతం బాస చేశారు. అయితే, అధికారమంటే ఎవరికి తీపి కాదు! అందుకే, ఇటు సేనా నాయకుడు, అటు ‘ఆర్ఎస్ఎఫ్’ సారథి... ఎవరూ అధికారాన్ని వదులుకోదలుచుకోలేదు. పైచేయికై పరస్పరం ఢీ కొన్నారు. ఆర్ఎస్ఎఫ్ పారామిలటరీలను కూడా సూడాన్ ఆర్మీలోకి చేర్చుకొని, రెండేళ్ళలో పౌర సర్కార్ ఏర్పాటుచేయడంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం హింసకు కారణం. ఆర్మీలో ఆర్ఎస్ ఎఫ్‌ను చేర్చుకుంటే తన పట్టు పోతుందని దగాలో భయం. పౌర ప్రభుత్వాన్ని మరో పదేళ్ళు జాగు చేయాలని ఆయన భావన. ఇది కడుపులో పెట్టుకొని, సైన్యం అనుమతి లేకనే వివిధ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎఫ్ తన వాళ్ళను మోహరించడం మొదలెట్టింది. ఇది ఏప్రిల్ 15 నుంచి హింసాత్మకమైంది. నిజానికి, ఇవన్నీ ఉన్నట్టుండి జరిగినవి కానే కావు. సూడాన్ దేశ ఆర్థిక సంపదపై, అందులోనూ ప్రత్యేకించి బంగారు గనులపై నియంత్రణ కోసం ఆర్ఎస్ఎఫ్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అలా ఇరువర్గాల మధ్య పెరిగిన కుతకుతలు ఇక్కడికి దారి తీశాయి. దీర్ఘకాలం దేశాధ్యక్షుడైన నియంత బషీరే కాదు... 2000ల నాటికి జంజవీద్ అనే తీవ్రవాద సంస్థ సారథిగా మొదలై ఇప్పుడు ఆర్ఎస్ఎఫ్ అధినేత అయిన దగాలో, ప్రస్తుత సైనిక నేత బుర్హాన్... అంతా ఒకే తాను గుడ్డలు. అందరూ మానవ హక్కులను కాలరాసినవారే. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపినవారే. ఎవరు గద్దెపై ఉన్నా సూడాన్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు అడుగులేయడం కల్ల. వేలకొద్దీ సైన్యం చేతుల్లో ఉన్న ఇద్దరు అహంభావుల వ్యక్తిగత అధికార దాహానికి ఇన్ని లక్షల మంది ఇక్కట్ల పాలవడమే దురదృష్టం. అంతర్యుద్ధాన్ని నివారించడానికే మధ్యంతర సర్కారును కాదని సైన్యం పగ్గాలు పట్టిందని 2021లో అన్న బుర్హాన్ ఇప్పుడచ్చంగా దేశాన్ని అటువైపే నెట్టేస్తున్నారు. సూడాన్‌లో సుస్థిరత, సురక్షణ, ప్రజాస్వామ్యం భారత్‌కూ కీలకమే. సంక్షుభిత సూడాన్‌లో దాదాపు 4 వేల మంది భారతీయులున్నారు. వారిలో 1200 మంది దశాబ్దాల క్రితమే అక్కడ స్థిరపడ్డారు. తాజా ఘర్షణల్లో కేరళకు చెందిన ఒకరు మరణించగా, కర్ణాటకలోని హక్కీ–పిక్కీ తెగకు చెందినవారు పదుల సంఖ్యలో చిక్కుకుపోయారన్న మాట ఆందోళన రేపుతోంది. ఘర్షణలు మరింత పెరిగితే సూడాన్ సహా ఆ పరిసర ప్రాంతాలన్నీ అస్థిరతలోకి జారిపోతాయి. ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభం, ఆకాశమార్గం పట్టిన ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశానికి ఇరుగు పొరుగుతోనూ సంబంధాలు దెబ్బతింటాయి. దేశం ప్రజాస్వామ్య పాలన దిశగా అడుగులు వేయ డానికీ ఉపకరించదు. వెరసి, సూడాన్ చరిత్రలో ప్రతి రాజకీయ çపరివర్తనకూ సైన్యమే కేంద్ర మవుతూ వచ్చింది గనక ఈసారి ఏ మార్పు జరుగుతుందో వేచిచూడాలి. -
సూడాన్‌లో యుద్ధవాతావరణం.. భారతీయులను హెచ్చరించిన ఎంబసీ
ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో మరోసారి పరిస్థితి అదుపుతప్పింది. సూడాన్‌లో ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సూడన్‌లో ఉన్న భారతీయులను ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. వారు తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. The Sudan Air Force in happier times putting on an air show over Khartoum - today these same planes may be launching unguided missiles into the city attacking paramilitary Rapid Support Forces (RSF) pic.twitter.com/kpJJrb1wG4 — James A. Tidmarsh (@jtidmarsh) April 15, 2023 వివరాల ప్రకారం.. సూడాన్‌లోని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ విషయమై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం.. విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో, సూడాన్ రాజధాని ఖార్టూమ్ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అనంతరం, ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. మరోవైపు.. సూడాన్ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్టూమ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో పౌరులు భయాందోళనలకు గురై వీధుల నుంచి పరుగులు పెట్టారు. NOTICE TO ALL INDIANS IN VIEW OF REPORTED FIRINGS AND CLASHES, ALL INDIANS ARE ADVISED TO TAKE UTMOST PRECAUTIONS, STAY INDOORS AND STOP VENTURING OUTSIDE WITH IMMEDIATE EFFECT. PLEASE ALSO STAY CALM AND WAIT FOR UPDATES. — India in Sudan (@EoI_Khartoum) April 15, 2023 ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమతమై.. సూడన్‌లో ఉన్న భారతీయులను ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లకండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. తదుపరి అప్డేట్స్ కోసం ఎదురుచూడండి అని తెలిపింది. కాగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాడులు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 🚨🚨🚨 🇸🇩🇸🇩🇸🇩 RSF : fighters said they have taken control of Marawi airport. #Sudan#Sudan pic.twitter.com/tIp8gyzq3L — MT WORLD (@MTWORLDNEWS) April 15, 2023 SUDAN pic.twitter.com/SMaHudcPSF — Nuradinsaidmohamed (@Nuradinsaidmoh1) April 15, 2023 BREAKING: Planes on fire at Khartoum airport after coup attempt in Sudan pic.twitter.com/aWdyMv23xs — BNO News (@BNONews) April 15, 2023 #WATCH: Civilians trapped at #Khartoum international airport as #UAE-funded Rapid Support Forces besiege. The @_AfricanUnion & @AUC_MoussaFaki must respond now & build international support to curtail this incoming catastrophe. #Sudan pic.twitter.com/lxtnhLNRUR — Suldan I. Mohamed, MA (@SuldanMohamed_) April 15, 2023 -
సాయుధ బలగాల్లో జాబ్, యువతకు శుభవార్త
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్‌ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్‌ఎస్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ►ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ►వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ►తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ►ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ►జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ►జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. బఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ►ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్ర ర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ►ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ►ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ►ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ►ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ►తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ►కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్‌ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించాలి. ►గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్‌టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ►ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ►పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ►వెబ్సైట్: https://ssc.nic.in -
కశ్మీర్: కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్రం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ మోహరించిన 10 వేల పారా మిలిటరీ బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో సాయుధ బలగాల మోహరింపు అంశంపై హోం మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించిన అనంతరం కేంద్రం ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది.‘‘జమ్మూ కశ్మీర్లో మెహరించిన 100 కంపెనీల బలగాలు తక్షణమే ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకోబడింది. సదరు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. (చదవండి: కొత్త ప్రపంచం.. సరికొత్త జీవితం: షా ఫైజల్) కాగా ఈ 100 కంపెనీల బలగాలలో 40 సీఆర్పీఎఫ్ బలగాలు ఉండగా.. 20 కంపెనీల చొప్పున సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ బలగాలు ఉన్నాయి. ఇక గతేడాది ఆగష్టులో జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా భారీ సంఖ్యలో పారా మిలిటరీ బలగాలను మోహరించింది. అయితే గత కొన్ని నెలలుగా అక్కడ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న హోం మంత్రిత్వ శాఖ క్రమక్రమంగా బలగాలను ఉపసంహరించుకుంటోంది. ఇందులో భాగంగా మే నెలలో 10 సీఏపీఎఫ్ కంపెనీ(ఒక్కో కంపెనీలో దాదాపు 100 మంది)ల బలగాలను వెనక్కి రప్పించింది. ప్రస్తుతం అక్కడ 60 బెటాలియన్ల(ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది) సీఆర్ఎఫ్ బలగాలతో పాటు పారా మిలిటరీ బలగాలు ఉన్నట్లు సమాచారం.(ముర్ము రాజీనామాకు దారి తీసిన పరిస్థితులేమిటి?) -
సీఏపీఎఫ్ రిటైర్మెంట్ @ 60 ఏళ్లు
న్యూఢిల్లీ: అన్ని రకాల కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్) పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ బలగాల్లో కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమాన హోదా) స్థాయి వరకు ఉన్న నాలుగు కేంద్ర బలగాల అధికారులు (సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, సహస్త్ర సీమా బల్) ఇకపై 57 ఏళ్లకు బదులుగా 60 ఏళ్లకు పదవీ విరమణ చేయనున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ) నుంచి అత్యున్నత ర్యాంకు డైరెక్టర్ జనరల్(డీజీ) వరకు ఉన్న ఈ నాలుగు బలగాల అధికారుల రిటైర్మెంట్ వయస్సు కూడా ఇకపై 60 ఏళ్లే. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ బలగాలకు చెందిన అన్ని స్థాయిల అధికారులకు 60 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉండగా తమకు మాత్రమే 57 ఏళ్లను రిటైర్మెంట్ వయస్సుగా నిర్ణయించటం వివక్ష చూపడమేనంటూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఏకీభవించిన న్యాయస్థానం.. ఇలా వేర్వేరు పదవీ విరమణ వయస్సులను నిర్ధారించడం ‘రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితం’ అని, బలగాల మధ్య అంతరం చూపడమేనని వ్యాఖ్యానించింది. ఈ విధానాన్ని సవరించాలని జనవరిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని ఆయా బలగాలను ఆదేశిస్తూ సోమవారం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎవరైనా రిటైరై ఉంటే అలాంటి వారు తాము పొందిన రిటైర్మెంట్ ప్రయోజనాలను వాపసు చేసి తిరిగి విధుల్లో చేరవచ్చనీ లేదా 60 ఏళ్లు వచ్చే వరకు విధుల్లో కొనసాగి, రిటైర్మెంట్ ప్రయోజనాలను అందుకోవచ్చని తెలిపింది. రిటైరైన తర్వాత న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వారు, స్టే పొందిన కూడా 60 ఏళ్లు వచ్చే దాకా తమ విధుల్లో కొనసాగవచ్చని కూడా స్పష్టత ఇచ్చింది. ఈ నాలుగు బలగాలకు చెందిన కమాండెంట్ స్థాయి దిగువ హోదా వారికి ఏడో వేతన సంఘం కమిషన్ సిఫారసులు సీఐఎస్ఎఫ్ మాదిరిగానే వర్తిస్తాయని పేర్కొంది. అయితే, తక్షణం కార్యక్షేత్రం దూకాల్సిన అవసరం ఉండే సీఆర్పీఎఫ్ వంటి బలగాల అధికారుల ఫిట్నెస్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రానికి సీఏపీఎఫ్ నాయకత్వం తెలిపింది. -
నిరుద్యోగులకు బొనాంజా; 84 వేల కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాల్లో దాదాపు 84,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) 9,99,795 పోస్టులు మంజూరు కాగా ఏటా వివిధ గ్రేడుల్లో పది శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయని, దీంతో ప్రస్తుతం 84,037 పోస్టులు భర్తీ చేసేందుకు ఖాళీగా ఉన్నాయని హోం శాఖ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది. కాగా, సీఆర్పీఎఫ్లో 22,980 ఖాళీలు, బీఎస్ఎఫ్లో 21,465, సీఐఎస్ఎఫ్లో 10,415, ఎస్ఎస్బీలో 18,102, ఐటీబీపీలో 6643, అస్సాం రైఫిల్స్‌లో 4432 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. నూతనంగా ఏర్పడిన పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం సత్వర చర్యలు చేపడుతుందని పేర్కొంది. రిక్రూట్మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను నియామకాలు, పదోన్నతులు, డిప్యుటేషన్ల ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. -
అనుక్షణం.. అప్రమత్తం
సాక్షి, సిటీబ్యూరో : నగర శివార్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మిళితమై ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఎన్నికలు సాఫీగా జరిగేందుకు అమలుచేస్తున్న చర్యల పై ‘సాక్షి’కి ఆయన వివరించారు. చేవేళ్ల, మల్కాజిగిరితో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి కొన్ని ప్రాంతాలు వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ లోక్‌సభ స్థానాల్లో ప్రశాంత పోలింగ్ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారీ భద్రత నీడలో.. కమిషనరేట్ పరిధిలోని 4,500 మంది విధుల్లో నిమగ్నమవుతున్నారు. 10 కంపెనీల పారామిలిటరీ బలగాల సేవల్నీ వినియోగిస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ఏసీపీని ఇన్చార్జిగా నియమిం చాం. ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారులతో సమన్వ యం చేసుకోవల్సిన బాధ్యతను అప్పగించాం. ప్రజల్లో ఆత్మవిశ్వా సం నింపేందుకు కీలక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నాం. భద్ర త పరంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనవచ్చు. నిరంతర నిఘా.. వివిధ ప్రాంతాల్లో 11 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాం. అక్రమంగా తరలిస్తు న్న నగదుపై దృష్టి సారించాం. మద్యం తరలిం పుపై నిఘా ఉంచాం. వీటికితోడు స్టాటిక్ సర్వైలైన్స్ బృందాలు, సంచార తనిఖీ బృందాలు, క్వి క్ రెస్పాన్స్ టీమ్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్ బృం దా లు పనిచేస్తున్నాయి. కమిషనరేట్ పరిధి లోని రౌడీషీటర్ల బైండోవర్లపై ఆయా ఠాణాల పోలీసులు దృష్టి సారించారు. లైసెన్స్ గన్లు కలిగిన వారు తమ ఆయుధాలను ఇప్పటికే ఆయా పోలీసు స్టేషన్లలో డిపాజి ట్ చేశారు. -
పుల్వామా దాడి : హోలీకి కేంద్ర బలగాలు దూరం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన క్రమంలో సీఆర్పీఎఫ్కు బాసటగా పది లక్షల మందికి పైగా సైనికులతో కూడిన కేంద్ర సాయుధ దళాలు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. సరిహద్దు భద్రతా దళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, సస్త్ర సీమా బల్లు ఈ ఏడాది హోలీని జరుపుకోరాదని నిర్ణయించాయి. కాగా, చత్తీస్‌గఢ్‌లోని సుక్మా దాడి ఘటన నేపథ్యంలో 2017లోనూ హోలీ వేడుకలను కేంద్ర బలగాలు రద్దు చేసుకున్నాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై మావోయిస్టులు జరిపిన దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. మరోవైపు పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళిగా హోలీ వేడుకలు జరుపుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. -
కేంద్ర బలగాల మార్చ్ఫాస్ట్..
సాక్షి, గుంటూరు : నగరంలో కేంద్ర బలగాల ఆదివారం మార్చ్ఫాస్ట్ చేశాయి. నగర వాసులు ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అర్బన్ జిల్లా పరిధిలో విధులు నిర్వహించేందుకు కేంద్ర పాలమిలటరీ బలగాలు ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేశాయి. ఆయన ఆదేశాల మేరకు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి హిందూ కళాశాల కూడలి నుంచి శంకర్ విలాస్, లక్ష్మీపురం, పట్టాభిపురం, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వరకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో బలగాలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. షిప్టుల వారీగా విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో కమాండోలు సహకారం అందించాలని సూచించారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందస్తు చర్యలు పూర్తి చేశామని వివరించారు. డీఎస్పీలు నజీముద్దీన్, కులశేఖర్, నారాయణరావు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
జంతర్‌మంతర్ వద్ద పారామిలటరీ బలగాల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ : దేశం కోసం ప్రాణాలొడ్డే సైనికులు డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. పారామిలటరీ బలగాలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద జవాన్లు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పారామిలటరీ బలగాలతో దివాళీ వేడుకలు జరుపుకున్నా తమ కోసం ఆయన ఏం చేశారని ఓ సైనికుడు ప్రశ్నించారు. తాము 2004 నుంచి ఫించన్ పొందడం లేదని, తమకు ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ అమలు కావడం లేదని, కనీసం అమరవీరుల హోదాను నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పారామిలటరీ బలగాల డిమాండ్లను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చకుంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు తాము గట్టి సందేశం పంపుతామని నిరసనకారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ పట్ల సవతితల్లి ప్రేమను కనబరుస్తోందన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ తమ కోసం చేసిందేమీ లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. -
మంటపుట్టిస్తాయి.. పారిపోయేలా చేస్తాయి
► భూత్ ఝలోకియా మిరపకాయలతో బాంబులు ► గుంపులు చెదరగొట్టేందుకు, మహిళల రక్షణకు ఉపయోగం ► డీఆర్డీవో శాస్త్రవేత్త శశి బాలా సింగ్ తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అల్లర్ల సమయంలో పోలీసులు, పారామిలటరీ దళాలు భాష్పవాయు గోళాలు వాడటం, పరిస్థితి చేయి దాటితే బుల్లెట్లు ప్రయోగించడం గురించి మనకు తెలుసు. కానీ ఇకపై ఆందోళనకారులను చెదరగొట్టేందుకు మిర్చిబాంబులు వాడనున్నారు. అసోంలో పండే భూత్ ఝలోకియా రకం మిరపకాయలతో డీఆర్డీవో వీటిని తయారు చేస్తోంది. ఈ బాంబులను జమ్మూ కశ్మీర్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లో గుంపులను చెదర గొట్టేందుకు ఉపయోగించినట్లు డీఆర్డీవో లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశి బాలా సింగ్ తెలిపారు. సైన్స్ కాంగ్రెస్‌లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శశి బాలాసింగ్ ‘సాక్షి’తో మాట్లాడారు. భూత్ ఝలోకియా ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చి అని, దాని ఘాటుకు కారణమైన రసాయనాలను వేరు చేసి ఈ బాంబులు తయారుచేసినట్లు ఆమె తెలిపారు. ఈ బాంబుల నుంచి వచ్చే ఘాటుతో పాటు మంట వల్ల గుంపును చెల్లాచెదురు చేయవచ్చన్నారు. ఈ రసాయనాలను పెప్పర్ స్ప్రేల రూపంలో వాడేందుకూ అవకాశముందని, మహిళలు స్వీయ రక్షణకు ఈ పెప్పర్స్ప్రేలను వినియోగించుకోవచ్చ న్నారు. హిమాలయాలతో పాటు సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండే ప్రదేశాల్లో సాధారణ పంటలు పండించేందుకు కొన్ని పద్ధతులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సియాచిన్ తో పాటు హిమాలయ పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికులు ప్రాణవాయువు కోసం ఇబ్బంది పడుతుంటారని, ఈ సమస్యను అధిగమించేందుకు సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు డాక్టర్ శశి బాలా సింగ్ తెలిపారు. ఆక్సిజన్ తక్కువగా ఉండే అలాంటి ప్రాంతాల్లో సైనికులకు ప్రాణవాయువు అందించేందుకు గానూ సోలార్ చాంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. -
81కి చేరిన 'అస్సాం' మృతుల సంఖ్య
అసోం: బోడోలాండ్ మిలిటెంట్ల దాడిలో మృతుల సంఖ్య 81కు పెరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సోనిట్‌పూర్, కోక్రాఝర్, చిరాంగ్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాలపై నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్బీ)కి చెందిన ఓ వర్గం మంగళవారం దాడి చేయడం తెలిసిందే. ఈ పరిస్థితులను సమీక్షించడానికి ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ అసోం వెళ్లనున్నారు. గువహటి, సోనిట్‌పూర్, కోక్రాఝర్ లలో ఆర్మీ చీఫ్ పర్యటించనున్నారు. మిలిటెంట్ల దాడికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతుండటంతో అదనపు బలగాలు కావాలని అస్సాం ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. -
అస్సాం దాడుల మృతులు 72
* బోడో మిలిటెంట్ల దాడిపై సర్వత్రా ఆందోళన * మూడు జిల్లాల్లో ఆదివాసీల ప్రతీకార దాడులు * పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో బోడోలాండ్ మిలిటెంట్ల దాడిలో మృతుల సంఖ్య 72కు పెరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సోనిట్‌పూర్, కోక్రాఝర్, చిరాంగ్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాలపై నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్బీ)కి చెందిన ఓ వర్గం మంగళవారం దాడి చేయడం తెలిసిందే. దీంతో గిరిజనులు ప్రతీకార దాడులకు దిగారు. మూడు జిల్లాల్లోనూ బుధవారం అల్లర్లు చెలరేగాయి. వీటిని అడ్డుకోడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మిలిటెంట్ల దాడికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతుండటంతో అదనపు బలగాలు కావాలని అస్సాం ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీంతో స్పందించిన కేంద్రం వెంటనే 5 వేల మంది పారామిలటరీ బలగాలను అస్సాంకు తరలించింది. కాగా, సోనిట్‌పూర్ జిల్లాలోని ధేకాజులి పోలీస్‌స్టేషన్‌పై ఆదివాసీలు దాడి చేశారని, స్టేషన్‌కు నిప్పంటించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. దీంతో వారిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అ బోడో వర్గానికి చెందిన 29 ఇళ్లను ఆదివాసీలు తగులబెట్టారు. 15వ జాతీయ రహదారిని ఏడు కిలోమీటర్ల మేర దిగ్బంధించారు. తాజా పరిస్థితిపై సీఎం తరుణ్‌గొగోయ్ సమీక్ష జరిపారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు అమాయకులపై మిలిటెంట్ల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. బోడోల చేతిలో మరణించిన వారి కుంటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించారు. బాధితులకు సానుభూతి తెలియజేశారు. ప్రధాని అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మిలిటెంట్లను ఏరివేస్తాం: కేంద్రం ఎన్డీఎఫ్బీ మిలిటెంట్ల ఏరివేతకు సైన్యం, పారామిలిటరీ బలగాలు, పోలీసులతో ఉమ్మడి ఆపరేషన్లు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో హోం, రక్షణ, పారామిలిటరీ బలగాల అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘మిలిటెంట్ల దాడి అత్యంత దారుణమైన చర్య. తగిన జవాబు ఇస్తాం’ అని అన్నారు. ఆయన గువాహటి చేరుకుని భద్రతా పరిస్థితులను సమీక్షించారు. తరుణ్‌గొగోయ్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. మిలిటెంట్ల దాడిపై అస్సాంలో నిరసనలు వెల్లువెత్తాయి. సీపీఎం, అస్సాం గణపరిషత్, అస్సాం పీసీసీ, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి. మిలిటెంట్ల దాడులను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. -
పారామిలిటరీ బలగాల సహాయం కావాలి: నాయిని
మండి( హిమాచల్ ప్రదేశ్): హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన వీఎన్ఆర్ విజ్క్షాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను వెతికేందుకు పారామిలిటరీ బలగాల సహాయం అందించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కోరారు. సహాయ సహకార చర్యలపై రాజ్‌నాథ్‌తో నాయిని నర్సింహరెడ్డి ఫోన్ సంభాషించారు. విద్యార్థులను వెతికేందుకు పారామిలిటరీ బలగాలు దించాలని కోరిన నాయిని ప్రతిపాదనకు హోం మంత్రి రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. హోంశాఖ కార్యదర్శితో మాట్లాడి తక్షణం చర్యలు తీసుకుంటానన్న రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. -
జిల్లాకు త్వరలో అదనపు బలగాలు
సాక్షి, కాకినాడ: ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు ఇరవై నాలుగు కంపెనీల పారా మిలటరీ దళాలు వస్తాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్లోని కోర్టుహాల్లో పోలీసు సూపరింటెండెంట్లు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లతోను, రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ వేర్వేరుగా సమావేశమయ్యారు. కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి నిర్వహించిన అధికారులసమావేశంలో భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం అందించిన హ్యాండ్ బుక్‌ను అధికారులు అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. వ్యయ పరిశీలన తదితర మార్గదర్శకాలతో కూడిన హ్యాండు బుక్‌లను కూడా త్వరలో పంపుతామన్నారు. జిల్లాలో 37 లక్షల మంది ఓటర్లుండగా ఇంకా 30 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు.ఓటరు జాబితాలో పేరు లేకపోతే 92462 80027 సెల్ నంబర్‌కు ఓట్ అని టైపు చేసి ఐడీ కార్డునెంబర్ టైపు చేసి ఎస్ఎంఎస్ పంపితే ఓటరుగా ఎక్కడ నమోదయిందీ సమాధానం లభిస్తుందన్నారు. లేకుంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
రాష్ట్రానికి 25 కంపెనీల అదనపు బలగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి ఢిల్లీలో పరిణామాలు వేగవంతంగా సాగుతున్న క్రమంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా కేంద్రం 25 కంపెనీల(ఒక్కొక్క కంపెనీలో దాదాపు 90 మంది సైనికులు లేదా భద్రతా సిబ్బంది ఉంటారు) అదనపు బలగాలను రాష్ట్రంలో మోహరించింది. ఇప్పటికే ఉన్న 60 కంపెనీల బలగాలకు ఇవి అదనంగా భద్రతా విధులు నిర్వహించనున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న దశలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు 90 కంపెనీల పారామిలిటరీ బలగాలను కేంద్రం అప్పట్లోనే రాష్ట్రానికి పంపింది. అయితే, రెండు నెలల కిందట జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వీటిలోని 30 కంపెనీల బలగాలను కేంద్రం వెనక్కి తీసుకుంది. కాగా, ప్రస్తుతం విభజన ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ముందస్తు భద్రత నిమిత్తం పారామిలిటరీ బలగాలను పంపాలన్న డీజీపీ ప్రసాదరావు విజ్ఞప్తి మేరకు కేంద్ర హోం శాఖ తాజాగా 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది.