అస్సాం దాడుల మృతులు 72 | Assam: Death toll rises to 72; angry Adivasis retaliate | Sakshi
Sakshi News home page

అస్సాం దాడుల మృతులు 72

Published Thu, Dec 25 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

అస్సాం దాడుల మృతులు 72

అస్సాం దాడుల మృతులు 72

* బోడో మిలిటెంట్ల దాడిపై సర్వత్రా ఆందోళన
* మూడు జిల్లాల్లో ఆదివాసీల ప్రతీకార దాడులు
* పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి

 
 న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో బోడోలాండ్ మిలిటెంట్ల దాడిలో మృతుల సంఖ్య 72కు పెరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సోనిట్‌పూర్, కోక్రాఝర్, చిరాంగ్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాలపై నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్‌బీ)కి చెందిన ఓ వర్గం మంగళవారం దాడి చేయడం తెలిసిందే. దీంతో గిరిజనులు ప్రతీకార దాడులకు దిగారు. మూడు జిల్లాల్లోనూ బుధవారం అల్లర్లు చెలరేగాయి. వీటిని అడ్డుకోడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మిలిటెంట్ల దాడికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతుండటంతో అదనపు బలగాలు కావాలని అస్సాం ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
 
  దీంతో స్పందించిన కేంద్రం వెంటనే 5 వేల మంది పారామిలటరీ బలగాలను అస్సాంకు తరలించింది. కాగా, సోనిట్‌పూర్ జిల్లాలోని ధేకాజులి పోలీస్‌స్టేషన్‌పై ఆదివాసీలు దాడి చేశారని, స్టేషన్‌కు నిప్పంటించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. దీంతో వారిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అ బోడో వర్గానికి చెందిన 29 ఇళ్లను ఆదివాసీలు తగులబెట్టారు. 15వ జాతీయ రహదారిని ఏడు కిలోమీటర్ల మేర దిగ్బంధించారు. తాజా పరిస్థితిపై సీఎం తరుణ్‌గొగోయ్ సమీక్ష జరిపారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు అమాయకులపై మిలిటెంట్ల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. బోడోల చేతిలో మరణించిన వారి కుంటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించారు. బాధితులకు సానుభూతి తెలియజేశారు. ప్రధాని అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
 
 మిలిటెంట్లను ఏరివేస్తాం: కేంద్రం
 ఎన్‌డీఎఫ్‌బీ మిలిటెంట్ల ఏరివేతకు సైన్యం, పారామిలిటరీ బలగాలు, పోలీసులతో ఉమ్మడి ఆపరేషన్లు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో హోం, రక్షణ, పారామిలిటరీ బలగాల అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘మిలిటెంట్ల దాడి అత్యంత దారుణమైన చర్య. తగిన జవాబు ఇస్తాం’ అని అన్నారు. ఆయన గువాహటి చేరుకుని భద్రతా పరిస్థితులను సమీక్షించారు. తరుణ్‌గొగోయ్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. మిలిటెంట్ల దాడిపై అస్సాంలో నిరసనలు వెల్లువెత్తాయి. సీపీఎం, అస్సాం గణపరిషత్, అస్సాం పీసీసీ, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి. మిలిటెంట్ల దాడులను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement