
న్యూఢిల్లీ: అన్ని రకాల కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్) పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ బలగాల్లో కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమాన హోదా) స్థాయి వరకు ఉన్న నాలుగు కేంద్ర బలగాల అధికారులు (సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, సహస్త్ర సీమా బల్) ఇకపై 57 ఏళ్లకు బదులుగా 60 ఏళ్లకు పదవీ విరమణ చేయనున్నారు.
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డీఐజీ) నుంచి అత్యున్నత ర్యాంకు డైరెక్టర్ జనరల్(డీజీ) వరకు ఉన్న ఈ నాలుగు బలగాల అధికారుల రిటైర్మెంట్ వయస్సు కూడా ఇకపై 60 ఏళ్లే. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్ బలగాలకు చెందిన అన్ని స్థాయిల అధికారులకు 60 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉండగా తమకు మాత్రమే 57 ఏళ్లను రిటైర్మెంట్ వయస్సుగా నిర్ణయించటం వివక్ష చూపడమేనంటూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఏకీభవించిన న్యాయస్థానం.. ఇలా వేర్వేరు పదవీ విరమణ వయస్సులను నిర్ధారించడం ‘రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితం’ అని, బలగాల మధ్య అంతరం చూపడమేనని వ్యాఖ్యానించింది. ఈ విధానాన్ని సవరించాలని జనవరిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని ఆయా బలగాలను ఆదేశిస్తూ సోమవారం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎవరైనా రిటైరై ఉంటే అలాంటి వారు తాము పొందిన రిటైర్మెంట్ ప్రయోజనాలను వాపసు చేసి తిరిగి విధుల్లో చేరవచ్చనీ లేదా 60 ఏళ్లు వచ్చే వరకు విధుల్లో కొనసాగి, రిటైర్మెంట్ ప్రయోజనాలను అందుకోవచ్చని తెలిపింది. రిటైరైన తర్వాత న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వారు, స్టే పొందిన కూడా 60 ఏళ్లు వచ్చే దాకా తమ విధుల్లో కొనసాగవచ్చని కూడా స్పష్టత ఇచ్చింది. ఈ నాలుగు బలగాలకు చెందిన కమాండెంట్ స్థాయి దిగువ హోదా వారికి ఏడో వేతన సంఘం కమిషన్ సిఫారసులు సీఐఎస్‌ఎఫ్ మాదిరిగానే వర్తిస్తాయని పేర్కొంది. అయితే, తక్షణం కార్యక్షేత్రం దూకాల్సిన అవసరం ఉండే సీఆర్పీఎఫ్ వంటి బలగాల అధికారుల ఫిట్‌నెస్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రానికి సీఏపీఎఫ్ నాయకత్వం తెలిపింది.