
న్యూఢిల్లీ: సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఢిల్లీ పోలీసు వంటి కేంద్ర పోలీస్ విభాగాల్లో 1,14,245 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉందని కేంద్రప్రభుత్వం బుధవారం వెల్లడించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా బుధవారం ఈ వివరాలు తెలిపారు. ఈ ఏడాది 31,879 పోస్టులకు ప్రకటనలు జారీచేయగా ఇప్పటిదాకా 1,126 పోస్టులే భర్తీ అయ్యాయి.
కేంద్ర హోం శాఖ, దాని విభాగాలైన బీఎస్‌ఎఫ్, సశస్త్ర సీమా బల్, సీఆర్‌పీఎఫ్, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, సీఐఎస్‌ఎఫ్, కేంద్ర పోలీసు సంస్థలు, ఢిల్లీ పోలీస్ ఇలా అన్ని విభాగాల్లో మొత్తంగా 1,14,245 ఖాళీలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో షెడ్యూల్ కులాల పోస్టులు 16,356 ఉన్నాయి. షెడ్యూల్ తెగలకు 8,759, ఇతర వెనుకబడిన వర్గాలకు 21,974, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 7,394 పోస్టులు, మిగతా 59వేలకుపైగా జనరల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.