Retirement age Increase
-
చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు !
బీజింగ్: తగ్గిపోతున్న జనాభా, పెరిగిపోతున్న వృద్దులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్న చైనా వచ్చే సంవత్సరం నుంచి అక్కడి కారి్మకుల రిటైర్మెంట్ వయసును 63 ఏళ్లకు పెంచనుంది. ప్రస్తుతం అక్కడి మగవాళ్లు 60 సంవత్సరాలకు రిటైర్ అవుతుండగా దానిని మరో మూడేళ్లు పెంచారు. ఇక కారి్మకులుగా పనిచేసే మహిళల రిటైర్మెంట్ వయసు ఇన్నాళ్లూ 50 ఏళ్లుకాగా దానిని 55 ఏళ్లు పెంచారు. వృత్తి నిపుణుల వంటి వైట్‌కాలర్ ఉద్యోగాలు చేసే మహిళల రిటైర్మెంట్ వయసును 55 నుంచి 58 సంవత్సరాలకు పొడిగించారు. రిటైర్మెంట్ వయసును మారుస్తూ తీసుకున్న నిర్ణయం 15 ఏళ్లకుపైగా అమల్లో ఉండనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని చైనా అధికార టీవీఛానల్ సీసీటీవీ ఒక కథనం ప్రసారం చేసింది. -
అనర్హులకు లబ్ధి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు పెంపు ప్రతిపాదనలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘దాన్ని పెంచితే సరైన అర్హత లేని, సరైన పనితీరు కనబరచని న్యాయమూర్తుల సర్వీసూ పెరుగుతుంది. పైగా ప్రభుత్వోద్యోగుల నుంచీ రిటైర్మెంట్ వయసు పెంపు డిమాండ్‌కు ఇది దారి తీయొచ్చు’’ అని పేర్కొంది. ఈ మేరకు సిబ్బంది, న్యాయ వ్యవహారాల పార్లమెంటు సంఘానికి ప్రజెంటేషన్ సమర్పించింది. ‘‘కాబట్టి ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరముంది. ఉన్నత న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం చేపట్టే చర్యల్లో భాగంగా రిటైర్మెంట్ వయసు పెంపు అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 ఏళ్లు, హైకోర్టు న్యాయమూర్తులు 62 ఏళ్లకు రిటైరవుతున్నారు. దీన్ని పెంచేందుకు 2010లో 114వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ 15వ లోక్‌సభ రద్దుతో దానికి కాలదోషం పట్టింది. -
ఆంధ్రప్రదేశ్: ‘మోడల్’ టీచర్లకు శుభవార్త
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 165 ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీనిపై ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, టి.కల్పలతారెడ్డి, ఏపీ మోడల్ స్కూల్ స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు పి.మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కండేయులు, మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, అధ్యక్షుడు కె.శివశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందిన ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
AP: ఆ టీచర్ల పదవీవిరమణ వయసు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 164 మోడల్ స్కూళ్లలో పనిచేస్తోన్న ప్రిన్సిపల్స్, టీచర్ల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవీ విరమణ వయస్సు పెంచడంపై మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ మోడల్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కండేయ హనుమంతరావులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: కుప్పంలో భూప్రకంపనలు.. భారీ శబ్దాలు.. -
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీపి కబురు వినిపించారు. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌కు సీఎం ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఈ మేరకు పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనుంది. దీంతోపాటు రామగుండంలో సింగరేణి వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. వీటికి సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. ‘సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు’ అంశంపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధులతో మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో సమీక్ష చేసిన అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ విప్ మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆంత్రం సక్కు, సిర్పూర్ ఖాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు. -
మాకొద్దీ పెంపు, 61 ఏళ్ల వరకు పనిచేయలేం!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యం సహకరించట్లేదు. అందువల్ల డ్యూటీలు చేయలేకపోతున్నాం. మాకు ఇతర విధులుంటే అప్పగించండి. లేదా నిర్బంధ పదవీ విరమణకు అవకాశం కల్పించండి. ఇవీ దాదాపు 2 వేల మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు పెట్టుకున్న వినతులు. ఇలాంటి అభిప్రాయంతో మరికొన్ని వేల మంది కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కార్పొరేషన్లకూ వర్తింపజేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆర్టీసీలో మాత్రం సంబరాలు లేవు. సిబ్బందిలో ఎక్కువ మంది తమకు పాత పద్ధతే కావాలని కోరుతున్నారు. రిటైర్మెంట్కు చేరువయ్యేకొద్దీ ఒంట్లో శక్తి సన్నగిల్లి, కష్టతరమైన డ్రైవర్, శ్రామిక్, కండక్టర్ డ్యూటీలు చేయలేక కూలబడుతున్న ఉద్యోగులు ఆర్టీసీలో ఎందరో. ఈ మూడు కేటగిరీల్లో పనిచేసే వారిలో మరణాల రేటూ ఎక్కువగానే ఉంటోంది. ఏటా ఆర్టీసీలో ఇలా రిటైర్మెంట్‌లోపే దాదాపు 175–200 మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో 61 ఏళ్ల వరకు ఉద్యోగం చేయాల్సి రావడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పాత పద్ధతిలో 58 ఏళ్లకే రిటైరయ్యేలా ఆప్షన్‌ను అందుబాటులోకి తేవాలని అధికారులు ప్రభుత్వం ముం దు ప్రతిపాదించేందుకు సిద్ధమయ్యారు. రెండేళ్లుగా పదవీ విరమణల్లేవు.. ఆర్టీసీలో ప్రస్తుతం 48,600 మంది ఉద్యోగులున్నారు. సంస్థలో ఏటా సగటున 2,200 మంది రిటైరవుతుంటారు. కానీ గత రెండేళ్లుగా సంస్థలో పదవీ విరమణల్లేవు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీలోనూ గతంలో రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగానే ఉండేది. కానీ 2019లో సిబ్బంది చేపట్టిన సమ్మె అనంతరం ప్రభుత్వం ఆర్టీసీలో రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచింది. దీంతో గత రెండేళ్లుగా సంస్థలో రిటైర్మెంట్లు లేవు. డిసెంబర్ నుంచి మళ్లీ రిటైర్మెంట్లు ప్రారంభం కానున్నాయి. దీన్నే చాలా మంది కార్మికులు జీర్ణించుకోలేకపోయారు. ఈ పెంపును ఆరోగ్య సమస్యలు లేనివారు స్వాగతించినప్పటికీ ఎక్కువ మంది మలి దశలో కష్టతరమైన విధులు నిర్వర్తించలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తమకు డ్రైవింగ్‌కు బదులు వేరే బాధ్యతలు అప్పగించాలని డ్రైవర్లు, నిలబడి డ్యూటీ చేయలేనందున కౌంటర్లో కూర్చునే డ్యూటీ ఇవ్వాలని కండక్టర్లు, గ్యారేజీలో బరువు పనులు చేయలేకపోతున్నందున సెక్యూరిటీ లాంటి ఇతర విధులు ఇవ్వాలని శ్రామిక్‌లు కోరుతూ వస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పించాలనే ఒత్తిడి అప్పట్లోనే తెచ్చారు. సమ్మె సమయంలో అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం ముందుంచారు. ఏ వయసుకు ఎందరు వీఆర్ఎస్ తీసుకుంటే ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందో లెక్కలతో సహా సమర్పించారు. అయితే ఆర్టీసీ పరిస్థితి తీసుకట్టుగా ఉండటంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది.ఈ నేపథ్యంలో ఇప్పుడు రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెరగడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పాత పద్ధతిలోనే రిటైర్మెంట్కు అవకాశం కల్పించి సెటిల్మెంట్ చేస్తే విశ్రాంతి తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ముందు కొత్త ప్రతిపాదన ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘61’కి మేం వ్యతిరేకం ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకు, ఆర్టీసీ కార్మికుల పని ఒత్తిడికి చాలా తేడా ఉంటుంది. రిటైర్మెంట్ వయసు దగ్గర పడేసరికి డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు పనిచేయలేరు. బలవంతంగా పనిచేస్తే రిటైరయ్యేలోపు చనిపోతున్నవారెందరో. ఇప్పుడు ఆర్టీసీలో పని ఒత్తిడి ఇంకా పెరిగి చనిపోతున్న వారి సంఖ్య పెరిగింది. ఈ సమయంలో వారికి త్వరగా విశ్రాంతి అవసరం. రిటైర్మెంట్ వయసు 61కి పెంచితే వారికి కష్టమే. అందుకే కొత్త విధానాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. కనీసం స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించాలి – కమల్‌రెడ్డి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
మా పదవీ విరమణను 65 ఏళ్లకు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: తమ రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు నిమ్స్ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రొఫెసర్ల వయసును 65 ఏళ్లకు పెంచుతూ జూన్‌లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని కాలేజీల్లో ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటికీ, నిమ్స్‌లో మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. నిమ్స్ అటానమస్ సంస్థ కావడంతో ఆ సంస్థ డైరెక్టర్ ఈ ఉత్తర్వులను అమలు చేయా ల్సి ఉంది. ఈ రెండు నెలల్లో ముగ్గురు ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఉందని, ఇకనైనా ఏజ్ హైక్ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని శనివారం మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. -
ఉపాధ్యాయులపై నిందలు సహించం
సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నిందలు వేస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఏదో ఒక సందర్భంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నిందలు వేస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పీఆర్సీని అమలు చేయాలని, ఉద్యోగులకు పదవీ విరమణ 60 ఏళ్లకు పెంచాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గతంలో అసెంబ్లీలో వీఆర్వోలు ఎంత పవర్ఫుల్ అంటే హోంమంత్రి మహమూద్ అలీ భూమిని వేరేవారి పేరున ఇతరుల భూమిని ఆయన పేరున మార్చే సత్తా ఉందని హేళన చేశారని అన్నారు. ప్రతిశాఖ ఉద్యోగులపై ఏదో ఒక సందర్భంలో నిందలు వేశారని, దీనిపై ప్రజలు ప్రశ్నించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల జేఏసీలు సీఎంకు బలం చేకూర్చేలా ఉన్నాయని, అన్ని జేఏసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు బి.రాజేశం మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరం అన్నారు. పోరాటం చేస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు జంగయ్య చెప్పారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకుడు కొండల్ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ కార్యదర్శి చావ రవి, టీటీఎఫ్ నాయకుడు కె.రమణ, వివిధ సంఘాల నాయకులు పద్మశ్రీ, సుధాకర్ రావు, ప్రొఫెసర్ పురుషోత్తం, బి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీఏపీఎఫ్ రిటైర్మెంట్ @ 60 ఏళ్లు
న్యూఢిల్లీ: అన్ని రకాల కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్) పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ బలగాల్లో కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమాన హోదా) స్థాయి వరకు ఉన్న నాలుగు కేంద్ర బలగాల అధికారులు (సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, సహస్త్ర సీమా బల్) ఇకపై 57 ఏళ్లకు బదులుగా 60 ఏళ్లకు పదవీ విరమణ చేయనున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ) నుంచి అత్యున్నత ర్యాంకు డైరెక్టర్ జనరల్(డీజీ) వరకు ఉన్న ఈ నాలుగు బలగాల అధికారుల రిటైర్మెంట్ వయస్సు కూడా ఇకపై 60 ఏళ్లే. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ బలగాలకు చెందిన అన్ని స్థాయిల అధికారులకు 60 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉండగా తమకు మాత్రమే 57 ఏళ్లను రిటైర్మెంట్ వయస్సుగా నిర్ణయించటం వివక్ష చూపడమేనంటూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఏకీభవించిన న్యాయస్థానం.. ఇలా వేర్వేరు పదవీ విరమణ వయస్సులను నిర్ధారించడం ‘రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితం’ అని, బలగాల మధ్య అంతరం చూపడమేనని వ్యాఖ్యానించింది. ఈ విధానాన్ని సవరించాలని జనవరిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని ఆయా బలగాలను ఆదేశిస్తూ సోమవారం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎవరైనా రిటైరై ఉంటే అలాంటి వారు తాము పొందిన రిటైర్మెంట్ ప్రయోజనాలను వాపసు చేసి తిరిగి విధుల్లో చేరవచ్చనీ లేదా 60 ఏళ్లు వచ్చే వరకు విధుల్లో కొనసాగి, రిటైర్మెంట్ ప్రయోజనాలను అందుకోవచ్చని తెలిపింది. రిటైరైన తర్వాత న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వారు, స్టే పొందిన కూడా 60 ఏళ్లు వచ్చే దాకా తమ విధుల్లో కొనసాగవచ్చని కూడా స్పష్టత ఇచ్చింది. ఈ నాలుగు బలగాలకు చెందిన కమాండెంట్ స్థాయి దిగువ హోదా వారికి ఏడో వేతన సంఘం కమిషన్ సిఫారసులు సీఐఎస్ఎఫ్ మాదిరిగానే వర్తిస్తాయని పేర్కొంది. అయితే, తక్షణం కార్యక్షేత్రం దూకాల్సిన అవసరం ఉండే సీఆర్పీఎఫ్ వంటి బలగాల అధికారుల ఫిట్నెస్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రానికి సీఏపీఎఫ్ నాయకత్వం తెలిపింది. -
ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 60 ఏళ్ళు వర్తింపజేయాలి
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. 1984లో 55 ఏళ్ళ నుంచి 58 ఏళ్ళకు పదవీ విరమణ వయస్సు పెంచినప్పుడు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తింపజేశారని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 310, 311 పద్దు కింద వేతనాలు చెల్లిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యన్.రఘురామిరెడ్డి, పి.పాండురంగ వరప్రసాద్‌లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జోసఫ్ సుధీర్‌బాబులు సచివాలయంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్‌ను కలిసి ఎయిడెడ్ టీచర్లను పదవీ విరమణ వయస్సు పెంపులో విస్మరించడం తగదని వినతి చేశారు. తక్షణమే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఎయిడెడ్ సిబ్బందికి 60 ఏళ్ళు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదాశివరావు, జి.హృదయరాజులు ఓ ప్రకటనలో కోరారు.