ప్రముఖ బహుళజాతి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) భారత్‌లోని తమ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును (retirement age) 58 నుండి 60 సంవత్సరాలకు పెంచింది. విస్తృత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.
పేరోల్‌లో ఎలాంటి మార్పు లేకుండా ఆన్-సైట్‌లో బదిలీ అయిన వారితో సహా దేశంలోని కాగ్నిజెంట్ ఉద్యోగులందరికీ ఈ మార్పు వర్తిస్తుంది. అనుభవజ్ఞులను నిలుపుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మెమోలో వివరించింది.
దేశంలోని చాలా ఐటీ కంపెనీల్లో (IT Company) ప్రస్తుతం పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది. అయితే రిటైర్మెంట్ వయసును పెంచుతూ కాగ్నిజెంట్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పోటీతత్వ ప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. అనుభవజ్ఞులైన నిపుణులను సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీకి ఆస్కారం ఏర్పడుతుంది.
చిన్న నగరాలపై దృష్టి
భారత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. కంపెనీ ప్రపంచ కార్యకలాపాలలో భారత్ పాత్ర ఉంటుందన్నది వివరించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుండి ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2025 అవార్డును అందుకున్న రవి, గ్లోబల్ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.
“కాగ్నిజెంట్ చాలా పెద్ద కంపెనీ. భారత్‌లో మాకు 250,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంతకుముందు, మేము పెద్ద నగరాల నుండి ఆపరేట్ చేశాము. ఇప్పుడు మేము చిన్న నగరాల నుండి ఆపరేట్ చేస్తున్నాము. మా ప్రయత్నం చిన్న నగరాలకు తీసుకెళ్లడం, కాబట్టి మేము ఇండోర్‌లో ప్రారంభించాము” అని పేర్కొన్నారు.
పదవీ విరమణ వయస్సును పెంచడంతోపాటు భారత్-ఆధారిత ప్రతిభ వ్యూహాన్ని రెట్టింపు చేయడం ద్వారా గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న భారత్‌కు సహకారం అందిస్తూనే ప్రపంచ ఐటీ సేవల మార్కెట్‌లో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని కాగ్నిజెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment