
నాస్‌డాక్-లిస్టెడ్ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు చేదు వార్త ఇది. ఏప్రిల్‌లో జరగాల్సిన జీతాల పెంపు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఆగస్టు 1 నుండి "అర్హత" ఉన్న ఉద్యోగులకు జీతాల పెంపును అందజేస్తుందని ‘మనీకంట్రోల్’ నివేదించింది. జీతాల పెంపు గత సంవత్సరంతో పోలిస్తే సుమారు నాలుగు నెలల ఆలస్యం కానుంది.
స్థూల ఆర్థిక సమస్యల కారణంగా కంపెనీ బలహీనమైన డిమాండ్ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీతాల పెంపు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇతర ఐటీ కంపెనీలను కూడా ప్రభావితం చేయనుంది. జీతాల పెంపు ఆలస్యాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించినట్లు మనీకంట్రోల్ పేర్కొంది.
“వార్షిక మెరిట్ పెంపుదల, బోనస్‌ల ద్వారా మా ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధతలో భాగంగా, అర్హతగల అసోసియేట్‌లకు మెరిట్ పెంపుదల ఈ సంవత్సరం ఆగస్టు 1న అందిస్తాం. ముఖ్యంగా మూడు సంవత్సరాలలో మా చాలా మంది ఉద్యోగులకు నాలుగు మెరిట్ హైక్స్ దక్కాయి” అని కంపెనీ పేర్కొంది.
తాజా చర్యతో మెజారిటీ కాగ్నిజెంట్ ఉద్యోగులు మూడు సంవత్సరాలలో నాలుగు పెంపులను అక్టోబర్ 2021, అక్టోబర్ 2022, ఏప్రిల్ 2023, ఆగస్టు 2024 పొందుతున్నట్లవుతుంది. కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 2.54 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment