న్యూఢిల్లీ: ఇతర సంస్థల నుంచి అక్రమంగా అత్యున్నత అధికారులను ఆకట్టుకోవడం(పోచింగ్)వల్ల కంపెనీ బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం పడబోదని ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ తాజాగా పేర్కొన్నారు.
ఇటీవల దేశీ ఐటీ కంపెనీల మధ్య అత్యున్నత అధికారుల అక్రమ వలస(పోచింగ్)లపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో నంబియార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడేందుకు నిరాకరించిన నంబియార్ ఉద్యోగులతో గల కాంట్రాక్టు అమలుకు కంపెనీలు పట్టుబట్టడాన్ని సమర్ధించారు. ఇందుకు ఆయా కంపెనీలకు అధికారముంటుందని వ్యాఖ్యానించారు. అయితే నాన్‌పోచింగ్‌పై పరిశ్రమవ్యాప్తంగా వర్తించే నిబంధనలకు ఆస్కారంలేదని స్పష్టం చేశారు. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీ అధికారులను లేదా నిపుణులను తీసుకోవడాన్ని నివారించేందుకు నిబంధనలు వర్తింపచేయలేమని అభిప్రాయపడ్డారు.
ఐటీ పరిశ్రమ ప్రధానంగా నైపుణ్య ఆధారితంకావడమే దీనికి కారణమని తెలియజేశారు. నిపుణులతోనే నిర్మితమైన సాఫ్ట్‌వేర్ సేవల పరిశ్రమలో ఉద్యోగ వలసలకు చెక్ పెట్టేందుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేమని వివరించారు. అయితే ఉపాధి కల్పనకు సంబంధించి పరిశ్రమవ్యాప్తంగా వర్తించే మార్గదర్శకాలకు వీలున్నట్లు తెలియజేశారు. పోచింగ్ సమస్య తమ కంపెనీపై ప్రభావాన్ని చూపబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా పరిశ్రమపైన సైతం ప్రభావాన్ని చూపబోదని అభిప్రాయపడ్డారు. గత కొన్ని వారాలుగా సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజాల మధ్య పోచింగ్ వివాదాలు తలెత్తిన విషయం విదితమే.
దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల.. తమ అధికారులను కాగ్నిజెంట్ అనైతిక పద్ధతుల్లో విధుల్లోకి తీసుకుంటున్నట్లు విమర్శించడంతో పరిశ్రమలో అలజడి తలెత్తింది. గతంలో ఇన్ఫోసిస్‌లో పనిచేసి ప్రస్తుతం కాగ్నిజెంట్ సీఈవోగా వ్యవహరిస్తున్న రవి కుమార్ ఇతర సంస్థల నుంచి 20 మంది సీనియర్ లీడర్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు ఇన్ఫోసిస్, విప్రోలో బాధ్యతలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఉద్యోగులతో కనీసం ప్రాథమిక స్థాయిలో నియామకాలలో సైతం ఎలాంటి సర్వీసు ఒప్పందాలు లేదా బాండ్లకు తెరతీయడంలేదని నంబియార్ వివరించారు. క్యాంపస్‌ల నుంచి ప్రధానంగా ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇది స్వేచ్చా ప్రపంచమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment