జిల్లాకు త్వరలో అదనపు బలగాలు
సాక్షి, కాకినాడ: ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు ఇరవై నాలుగు కంపెనీల పారా మిలటరీ దళాలు వస్తాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్లో పోలీసు సూపరింటెండెంట్లు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లతోను, రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ వేర్వేరుగా సమావేశమయ్యారు.
కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి నిర్వహించిన అధికారులసమావేశంలో భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం అందించిన హ్యాండ్ బుక్‌ను అధికారులు అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. వ్యయ పరిశీలన తదితర మార్గదర్శకాలతో కూడిన హ్యాండు బుక్‌లను కూడా త్వరలో పంపుతామన్నారు.
జిల్లాలో 37 లక్షల మంది ఓటర్లుండగా ఇంకా 30 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు.ఓటరు జాబితాలో పేరు లేకపోతే 92462 80027 సెల్ నంబర్‌కు ఓట్ అని టైపు చేసి ఐడీ కార్డునెంబర్ టైపు చేసి ఎస్‌ఎంఎస్ పంపితే ఓటరుగా ఎక్కడ నమోదయిందీ సమాధానం లభిస్తుందన్నారు. లేకుంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.