సాయుధ బలగాల్లో జాబ్‌, యువతకు శుభవార్త | Details Of SSC GD Constable 2021 CRPF Recruitment for 25271 Vacancies | Sakshi
Sakshi News home page

పదితోనే పారామిలిటరీ కొలువు.. ఇదిగో ప్రిపరేషన్‌ టిప్స్‌

Published Wed, Jul 28 2021 6:13 PM | Last Updated on Wed, Jul 28 2021 8:30 PM

Details Of SSC GD Constable 2021 CRPF Recruitment for 25271 Vacancies - Sakshi

శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్‌ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్‌.. ప్రిపరేషన్‌ టిప్స్‌...  

పోస్టు పేరు: కానిస్టేబుల్‌(జనరల్‌ డ్యూటీ)
మొత్తం ఖాళీల సంఖ్య: 25,271
విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్‌ఎఫ్‌–7545, సీఐఎస్‌ఎఫ్‌–8464, ఎస్‌ఎస్‌బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్‌–3785,ఎస్‌ఎస్‌ఎఫ్‌–240

సీఏపీఎఫ్‌ 
ఆర్మీ, నేవీ ఎయిర్‌ఫోర్స్‌ మాదిరిగానే సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి.
అవి.. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌(సీఐఎస్‌ఎఫ్‌), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(ఎప్‌ఎస్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌(ఏఆర్‌). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. 

అర్హతలు
►ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే.
►వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం
ఎంపికైతే పే లెవెల్‌–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. 
ఎంపిక విధానం: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌(సీబీఈ),సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌) నిర్వహించే ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
ఆన్‌లైన్‌ టెస్ట్‌
►తొలిదశలో సీబీఈ(కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌) ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్‌ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు.
►ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 
►జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌లో.. వెర్బల్, నాన్‌ వెర్బల్, అనలిటికల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్‌ అండ్‌ డైరెక్షన్, నంబర్‌ సిరీస్‌ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్‌ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్‌ థింకింగ్‌ ఉపయోగపడుతుంది. 

►జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్, ఇండియన్‌ పాలిటీ, ఇంటర్నేషనల్‌ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్‌ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. 
బఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో..టైమ్‌ అండ్‌ డిస్టన్స్, బోట్‌ అండ్‌ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, టైమ్‌ అండ్‌ వర్క్‌ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్‌ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. 

►ఇంగ్లిష్‌/హిందీ: ఇందులో మంచి స్కోర్‌ సాధించేందుకు గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్‌ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్‌ ఎరేంజ్‌మెంట్, ఎర్ర ర్స్‌ ఫైండింగ్‌ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్‌ పుస్తకాలు, ఇంగ్లిష్‌ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. 
►ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. 
►ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి.
►ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ): ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
►ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి.
►తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి.

ప్రిపరేషన్‌ టిప్స్‌
►కానిస్టేబుల్‌ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్‌ సిద్దం చేసుకోవాలి. 
► సిలబస్‌ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించాలి.
►గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి.
► ఆన్‌లైన్‌ మాక్‌టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. 
►ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్‌ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. 

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: 
ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి.
►దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021
►పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు
►వెబ్‌సైట్‌: https://ssc.nic.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement