jobs notification
-
పోస్టుల భర్తీపై కూటమి గేమ్
-
Apsrtc: ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రచారం ఫేక్
సాక్షి, కృష్ణా: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించింది ఏపీఎస్ఆర్టీసీ. తాము ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెబుతూ.. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీఎస్సార్టీసీలో డ్రైవర్ , కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు కొందరు. పైగా వాట్సాప్‌లో Apsrtc వెబ్ సైట్ డొమైన్ ను యాడ్ చేస్తూ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేశారు ఆ అగంతకులు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించింది ఆర్టీసీ. అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటించి రిలీజ్ చేస్తామని స్పస్టం చేసింది. -
TSPSC: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల కొనసాగుతూనే ఉంది. ఏడాది చివరిరోజైన శనివారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చింది. కళాశాల విద్య కమిషనరేట్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లతోపాటు ఇంటర్ విద్య విభాగంలో లైబ్రేరియన్ పోస్టులు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు, రవాణాశాఖ పరిధిలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కొలువులకు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది. ఇందులో అన్నిపోస్టులకు దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యే తేదీలను కమిషన్ ప్రకటించింది. ఏఎంవీఐ పోస్టులకు ఏప్రిల్ 23న పరీక్ష ఉంటుందని.. మిగతావాటికి త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. రవాణాశాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు.. రాష్ట్ర రవాణాశాఖ పరిధిలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మలీ్టజోన్–1 పరిధిలో 54, మల్టీజోన్–2 పరిధిలో 59 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 23న రాత పరీక్ష ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. వాస్తవానికి ఈ పోస్టులకు ఇదివరకే ప్రకటన జారీ చేసినా అభ్యర్థుల అర్హతల్లో మార్పులు చేయడంతో రద్దు చేశారు. తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేశారు. చదవండి: ఇదేమైనా బాహుబలి సినిమానా? -
3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సాక్షి, అమరావతి: అటు హైకోర్టుతోపాటు ఇటు జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో పెద్ద సంఖ్యలో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతమున్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది హైకోర్టు పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు. జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో.. అందుకనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అలాగే, జిల్లా కోర్టులు కూడా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వివరాలన్నింటినీ ఆయా కోర్టుల నుంచి తెప్పించుకున్న ప్రధాన న్యాయమూర్తి అక్కడ ఖాళీల భర్తీకీ ఆదేశాలిచ్చారు. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్లు జారీచేశాయి. అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్సైట్ http://hc.ap.nic.inలో పొందుపరిచారు. దరఖాస్తు చివరి తేదీ ఇదే.. ఇక హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు వెబ్సైట్లో, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు, ఆయా జిల్లాల ఈ–కోర్టు వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి నవంబర్ 15వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 15 రాత్రి 11.59లోపు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఈనెల 22 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 11 రాత్రి 11.59 లోపు ఆన్లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తరువాత పరీక్షా షెడ్యూల్‌ను తెలియజేస్తారు. దరఖాస్తు ఫీజు ఇలా.. : ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు రూ.400లను ఫీజుగా చెల్లించాలి. ప్రతీ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కానీ, హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ (ఎస్ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టులను పదోన్నతుల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భర్తీచేస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారు. హైకోర్టులో పోస్టుల ఖాళీల వివరాలు ఇలా.. ► ఆఫీస్ సబార్డినేట్–135 ►కాపీయిస్టు–20 ►టైపిస్ట్–16 ►అసిస్టెంట్–14 ►అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్–13 ►ఎగ్జామినర్–13 ►కంప్యూటర్ ఆపరేటర్లు–11 ►సెక్షన్ ఆఫీసర్లు–9 ►డ్రైవర్లు–8 ►ఓవర్సీర్–1 ►అసిస్టెంట్ ఓవర్సీర్–1 ►మొత్తం 241 పోస్టులు. జిల్లా కోర్టుల్లో పోస్టుల ఖాళీల వివరాలు ఇవే.. ►ఆఫీస్ సబార్డినేట్–1,520 ►జూనియర్ అసిస్టెంట్–681 ►ప్రాసెస్ సర్వర్–439 ►కాపీయిస్టు–209 ►టైపిస్ట్–170 ►ఫీల్డ్ అసిస్టెంట్–158 ►స్టెనోగ్రాఫర్ (గ్రేడ్–3)–114 ►ఎగ్జామినర్–112 ►డ్రైవర్(ఎల్వీ)–20 ►రికార్డ్ అసిస్టెంట్–9 ►మొత్తం 3,432 పోస్టులు. -
తెలంగాణలో కొత్త కొలువుల భర్తీ కాస్త జాప్యం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో కొత్త కొలువుల భర్తీ ఆలస్యం కానుంది. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుతో సామాజిక వర్గాల వారీగా ఉద్యోగ కేటాయింపుల్లో మార్పులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది. ఇప్పటికే పావువంతు కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వగా.. మిగతా ఉద్యోగాలకు సంబంధించి అనుమతుల జారీ వేగవంతం అయింది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు కూడా ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలు తయారు చేస్తున్నా యి. కాగా, ప్రస్తుతం ఆరుశాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రిజర్వేషన్లు అక్టోబర్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం నోటిఫికేషన్ల దశలో ఉన్న పలు ఉద్యోగాలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో బ్రేక్ పడినట్లైంది. కొత్త ప్రతిపాదనలు తప్పనిసరి.. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలు కాగా, మిగతా కేటగిరీలో గురుకుల కొలువులు, టీచర్ ఉద్యోగాలే ఉన్నా యి. పోలీస్ కొలువులకు సంబంధించిన ప్రకటనలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాల బోర్డు దాదాపు విడుదల చేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన గ్రూప్–1 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువడగా.. ఇంజనీరింగ్ కేటగిరీలో కూడా పలు పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. వైద్య ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను కూడా తెలంగాణ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసింది. ఇక అధిక సంఖ్యలో ఉన్న గురుకుల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం అనుమతించిన మిగతా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సంబంధిత నియామక సంస్థలు చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఈ సమయంలో రిజర్వేషన్ల పెంపు ఉత్తర్వులు రావడంతో కొత్తగా వెలువడాల్సిన నోటిఫికేషన్లు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాల్సి ఉండటంతో మార్పు లు, చేర్పులకు సమయం పడుతుంది. పాత నోటిఫికేషన్లకు ఓకే.. ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లను కొనసాగించి నియామకాలు పూర్తి చేసే వీలుండగా.. కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్ల విషయంలో మాత్రం 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లతో ఉద్యోగాలను భర్తీ చేయా ల్సి ఉండటంతో ఆ దిశగా ప్రభుత్వ శాఖలు చర్యలు మొదలుపెట్టాల్సి ఉంది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల ప్రకటనలకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనల్లో ఎస్టీలకు 10 శాతం కోటా కేటాయించాలి. అందుకు సమయం పడుతుందని, దీంతో కొత్త నోటిఫికేషన్లు కాస్త ఆలస్యం అవుతాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చింది. 833 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ కొత్త నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఇంజినీరింగ్ విభాగంలోని అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. చదవండి: కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం -
తెలంగాణలో 2, 910 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 50 వేల మార్కు దాటింది. ఈ ఏడాది ఇప్పటివరకు 49,550 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించగా, తాజాగా వివిధ శాఖల్లోని మరో 2,910 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాదిలో భర్తీకి అనుమతి లభించిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 52,460కి చేరింది. తాజాగా అనుమతి లభించిన వాటిలో గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్–2 కింద 663, గ్రూప్– 3 కింద 1,373 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లోని మరో 874 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారానే భర్తీ చేయనున్నారు. గ్రూప్–2 పోస్టుల భర్తీ నిమిత్తం జీవో నం.145, గ్రూప్–3 పోస్టుల భర్తీ నిమిత్తం జీవో నం.146ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల భర్తీ గ్రూప్–2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ఏఎస్‌వోలు), గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఏసీటీవోలు, సబ్ రిజిస్ట్రార్లు, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులున్నాయి. గ్రూప్–3 కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఎక్కువ ఉన్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, జూన్, జూలైతో పాటు ఆగస్టు నెలలో కూడా పలు దఫాలుగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా అనుమతి ఇచ్చిన పోస్టుల వివరాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మంగళవారం రాత్రి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోందని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదీ చదవండి: తెలంగాణ.. కానిస్టేబుల్ ఎగ్జామ్ కీ విడుదల.. ప్రతీ అభ్యర్థికి ఐదు మార్కులు! -
అంగట్లో జూనియర్ లైన్‌మన్ పోస్టులు రూ.5 లక్షలకు బేరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: విద్యుత్‌శాఖలో జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం) పోస్టులు దళారులకు వరంగా మారాయి. నిరుద్యోగులను నమ్మించి డబ్బులు గుంజేందుకు గ్రూపులుగా ఏర్పడిన కొందరు వేలం పెట్టారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,000 జేఎల్ఎం పోస్టుల భర్తీకి వెలువడిన నోటిఫికేషన్‌ను ఆసరాగా చేసుకుని.. అందులో పనిచేస్తున్న కొందరు.. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఈ దళారులకు కొందరు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు తోడయ్యారు. దరఖాస్తు చేయడం మొదలు పరీక్ష రాసి ఉద్యోగం వచ్చే వరకు అంతా తామే చూసుకుంటామని అందినకాడికి దండుకున్నారు. ఈనెల 17న జరిగిన రాత పరీక్ష సందర్భంగా పలు అవకతవకలు వెలుగుచూడగా... ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) రంగంలోకి వరంగల్‌లో ఆరా తీస్తుండడం కలకలం రేపుతోంది. చదవండి👉🏻పెద్దరాతియుగం నాటి చిత్రాల తావు గుర్తింపు దళారులకు వరంగా నోటిఫికేషన్.. ఎస్పీడీసీఎల్లో 70 అసిస్టెంట్ ఇంజనీర్లు, 201 సబ్ ఇంజనీర్లు, 1,000 లైన్‌మన్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జేఎల్ఎం కోసం మే 19 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అర్హత ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. వెయ్యి జేఎల్ఎం పోస్టుల కోసం 35,312 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలతో పాటు, హనుమకొండలో నివాసం ఉండే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, సైదాపూర్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన పలువురు కూడా ఇందులో ఉన్నారు. ఎస్పీడీసీఎల్ హైదరాబాద్‌లో పని చేస్తున్న హనుమకొండకు చెందిన కొందరు ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నాయకులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బేరం పెట్టారు. కొందరు మొత్తం.. ఇంకొందరు అడ్వాన్స్‌గా చెల్లించి.. ఈ నెల 17న రాత పరీక్షకు హాజరయ్యారు. డబ్బులు తీçసుకున్న వారు ఒప్పందం ప్రకారం రాత పరీక్షకు సహకరించకపోగా, కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చదవండి👉🏻తీరొక్క భూములు.. చూడచక్కని అడవులు ఎస్ఓటీ అదుపులో ఐదుగురు.. వరంగల్‌లో ఆరా.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన ఏసోబు (పేరు మార్చాం) అనే వ్యక్తి కాజీపేటకు చెందిన ఎస్పీడీసీఎల్కు చెందిన వ్యక్తి ద్వారా హైదరాబాద్‌లో ఓ దళారికి రూ.1.50 లక్షలు చెల్లించాడు. ఇదంతా బోగస్ అని తెలియడంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన పలువురు కూడా విద్యుత్‌శాఖలో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు దందాకు తెరతీశారంటూ పేర్లతో సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. జేఎల్ఎం పోస్టుల కోసం 35,312 మందిలో.. ఉమ్మడి జిల్లా నుంచి నాన్‌లోకల్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నవారు సుమారు నాలుగు వేల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఇందులో దళారులను నమ్మి మోసపోయిన చాలా మంది పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఇదే కేసులో మలక్‌పేట ఏడీలు సైదులు, ఫిరోజ్, నిత్యలు, లైన్మన్లు శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శనివారం ఉమ్మడి వరంగల్లోనూ ఆరా తీశారు. హనుమకొండ, జనగామ, హుజూరాబాద్ ప్రాంతాల నుంచి ఫిర్యాదు చేసిన వారిని పిలిచి మాట్లాడి వివరాలు సేకరించడం చర్చనీయాంశమవుతోంది. చదవండి👉🏻క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్ఎస్కు కొత్త ఆయుధాలా! -
తెలంగాణలో మరో 1,433 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196 పోస్టులు, పబ్లిక్ హెల్త్‌లో236, చీఫ్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లైలో 420 పోస్టులు, 350 ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీ రాజ్ జనరల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. కాగా ఇప్పటి వరకు 35220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకా మిగిలిన ఆయా శాఖాల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియామక ఖాళీలు 91,142 ఉండగా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయగా, మిగిలిన 80,039 ఉద్యోగాల భర్తీ చేస్తామని శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్1 పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్‌పోర్టు, ఫారెస్ట్, ఎక్సైజ్, బ్రెవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 12,775 ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో తొలి విడతగా 1326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేష్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే గ్రూప్ వన్, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం తెలిసిందే. తాజాగా మంగళవారం మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోని మరో 1433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడ చదవండి: ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు.. గ్రేటర్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు -
ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు.. గ్రేటర్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సర్కారు కొలువుల జాబితాలో అత్యధిక ఖాళీలు విద్యాశాఖలో ఉండటంతో నిరుద్యోగుల దృష్టి అంతా టీచరు పోస్టులపై కేంద్రీకృతమైంది. కొత్త జోన్లు, జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానుంది. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం ఫైనలియర్లో ఉన్న అభ్యర్థులకు కూడా కలిసి వచ్చే విధంగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం సుమారు 842కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదించినట్లు తెలుస్తోంది. ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయిదేళ్లుగా నో నోటిఫికేషన్.. గ్రేటర్ పరిధిలో సుమారు 25 వేలమందికిపైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా టీఆర్టీ నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీని నిర్వహించగా ఇప్పటివరకు ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. ఈసారి ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ అవుతాయనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 4,700 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తి చేస్తున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇంటి కరెంట్ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్ తీస్తే.. సర్కారు బడుల్లో భారీగా చేరిక.. గ్రేటర్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీల జాతర కొనసాగుతోంది. పదవీ విరమణ, పదోన్నతులు, బదిలీలతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి చతికిలపడి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు భరించలేక సర్కారు బడుల్లో తమ పిల్లలను పెద్ద ఎత్తున చేర్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతోపాటు విద్యా వలంటీర్లకు కూడా అనుమతి లభించకపోవడంతో ఉన్న ఉపాధ్యాయులపై పనిభారం పడుతోంది. రెండు మాధ్యమాల్లో.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించవచ్చని అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు చేసే అవకాశం ఉండడంతో నియామక పరీక్ష రెండు మాధ్యమాల్లో ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బీఎడ్ పూర్తి చేసినవారి సంఖ్యే అధికంగా ఉంది. ఆంగ్ల బోధనపై ప్రస్తుతం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మున్ముందు ఆంగ్లంలో బోధనను దృష్టిలో ఉంచుకుని.. కొత్తగా నియమించే ఉపాధ్యాయులను కూడా ఆ మాధ్యమం వారిని తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. మొత్తం పోస్టుల్లో ఆంగ్ల మాధ్యమం వారినే తీసుకుంటే తెలుగు మాధ్యమం అభ్యర్థులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో రెండు మాధ్యమాల్లో డీఎస్సీకి నిర్వహించే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. టెట్ కోసం.. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తే టీఆర్టీ రాయవచ్చని నిరీక్షిస్తున్నారు. డీఎస్సీకి ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా అయిదేళ్ల నుంచి టెట్ నిర్వహించలేదు. టెట్ పేపర్– 1, పేపర్– 2లో అర్హత సాధించినవారి కంటే టెట్ క్వాలిఫై కాని, 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సు చేసినవారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ నిర్వహించాలంటే కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇవ్వాల్సి ఉంటుంది. గత పద్ధతి ప్రకారం డీఈడీ చేసినవారు పేపర్– 1, బీఈడీ చదివినవారు పేపర్– 2 రాయడానికి అర్హులు. ఎన్సీఈఆర్టీ కొత్త మార్గదర్శకాల ప్రకారం బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పేపర్– 1, పేపర్– 2 రాయడానికి అర్హులు. ఈ మేరకు ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉత్తర్వులివ్వాల్సి ఉంది. -
TS: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అక్కడినుంచి చదవాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ప్రభుత్వం తీపి కబురు అందించడంతో వారిలో ఆశలు చిగురించాయి. ఉద్యోగాల భర్తీకి సర్కారు చేసిన ప్రకటన అభ్యర్థులకు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మరోసారి పోటీపరీక్షల అధ్యయన కేంద్రంగా మారింది. ఏళ్లకేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఊళ్లకు వెళ్లిన లక్షలాది మంది తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. కోచింగ్ సెంటర్లు, స్టడీహాళ్లు, పుస్తకాల దుకాణాలు కళకళలాడుతున్నాయి. నగరంలోని చిక్కడపల్లి, అశోక్‌నగర్, గాంధీనగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో సందడిగా మారాయి. మరోవైపు సుమారు 18 వేల పోలీసుల ఉద్యోగాల కోసం పోలీసుశాఖ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల శిక్షణకు దిల్సుఖ్నగర్, మలక్‌పేట్‌లలోని కోచింగ్ సెంటర్లకు అభ్యర్థుల తాకిడి పెరిగింది. పోలీసు, గ్రూప్–1 మొదలుకొని గ్రూప్–4 వరకు వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వాళ్లు శాస్త్రీయమైన పద్ధతిలో అధ్యయనం చేయాలని, ఏ పోటీ పరీక్షకైనా ఎలాంటి షార్ట్‌కట్ మెథడ్స్ ఉండబోవని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఉద్యోగ నియామకాలకు రెడీ.. సర్కారు అనుమతులివ్వగానే .. ఏ సెంటర్‌కు వెళ్తున్నారు... ఉద్యోగాల భర్తీపైన ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే కోచింగ్ సెంటర్లు తలుపులు బార్లా తెరిచాయి. మరోవైపు ఆన్లైన్ శిక్షణ సంస్థలు, యూట్యూబ్ కోచింగ్‌లు సైతం ముందుకొచ్చాయి. గ్రేటర్లో చిన్నవి, పెద్దవి కలిసి సుమారు 150కి పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు అంచనా. బాగా పేరున్న సంస్థల్లో గ్రూప్–1కు రూ.70 వేలు.. గ్రూప్ –4కు రూ.25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎస్సై, కానిస్టైబుల్ ఉద్యోగాలకు సైతం ఇదే స్థాయిలో డిమాండ్ ఉంది. ప్రభుత్వం భర్తీ చేయనున్న 80 వేల ఉద్యోగాల కోసం సుమారు 10 లక్షల మందికి పైగా పోటీ పడనున్నట్లు అంచనా. అభ్యర్థులు కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా కోచింగ్ నిర్వహిస్తున్న అనుభవం, ఆయా సెంటర్లలో గతంలో ఎలాంటి ఫలితాలు వెలువడ్డాయనే అంశాల ఆధారంగా ఈ ఎంపిక ఉండాలి. చదవండి: CM KCR: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ: సీఎం కేసీఆర్ ప్రకటన అక్కడినుంచి చదవాల్సిందే.. సాధారణంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రమే సీరియస్‌గా చదవడం మొదలెడతారు. దీంతో అప్పటికప్పుడు మార్కెట్లో లభించే గైడ్లు, ఇతర స్టడీ మెటీరియల్ పైన ఆధారపడుతారు. ప్రామాణికమైన కోచింగ్ కేంద్రాల నుంచి లభించే మెటీరియల్ మంచిదే. కానీ గ్రూప్ –1 నుంచి గ్రూపు–4 వరకు అన్ని పోటీపరీక్షలకు సొంతంగా మెటీరియల్ రూపొందించుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ స్టడీస్, గణితంపై పట్టు సాధించాలి. వివిధ సబ్జెక్టులలో పాఠ్యాంశాలను లోతుగా అధ్యయనం చేయడంతో పాటు ముఖ్యమైన అంశాలను స్వదస్తూరితో రాసుకోవాలి. దీంతో రాయడంలో వేగం, నైపుణ్యం పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సమకాలీన అంశాలపై ప్రిపేర్ కావాలి.. సమకాలీన అంశాలు, సాధారణ పరిజ్ఞానంపై పట్టు పెంచాలి. పోటీ పరీక్షలలో వచ్చే ప్రశ్నల తీరు మారింది. అభ్యర్థుల విస్తృతమైన, లోతైన అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగు కారణాలను ఇచ్చి అందులో ప్రధానమైన కారణమేంటని అడగవచ్చు. నాలుగింటిలో ఏది ప్రధానమో తేల్చుకోవాలంటే సమకాలీన ఘటనలు, పరిణామాలపై స్పష్టత తప్పనిసరి. కొంతకాలంగా ప్రశ్నల తీరు మారింది. అందుకనుగుణంగానే ప్రిపరేషన్ ఉండాలి. గందరగోళానికి గురికావొద్దు.. ఒక సబ్జెక్టుపై ఒకటి, రెండు ప్రామాణికమైన పుస్తకాలను మాత్రమే ఎంపికచేసుకొని లోతుగా అధ్యయనం చేయాలి. ఎస్సై ఉద్యోగాలు, గ్రూప్–1, గ్రూప్–2, వంటి పరీక్షల కోసం చదివేవాళ్లకు గణితం, రీజనింగ్, అరిథ్‌మెటిక్ వంటి అంశాల్లో శిక్షణ తప్పనిసరిగా అవసరం. – వి.వేణుగోపాల్, గణితశాస్త్ర నిపుణులు దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి ఏ పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే వాళ్లయినా సరే హడావుడిగా చదవకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రారంభించాలి. ఇప్పటికే చదువుతున్న వాళ్లు అధ్యయనానికి మరింత పదును పెట్టాలి, కొత్తగా ప్రారంభించేవాళ్లు చక్కటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఆందోళన వద్దు, కోచింగ్ సెంటర్ల ఎంపిక ఎంతో కీలకం. – కేవీఆర్, ఇంగ్లిష్ ఫ్యాకల్టీ -
ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ప్రకటన..మిన్నంటిన సంబరాలు
-
Telangana: కొలువుల భర్తీకి కొత్త రోస్టర్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో కీలకమైన రోస్టర్ పట్టిక ఒకటో నంబర్ నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్ పాయింట్లు సైతం మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉన్నాయి. జిల్లా, జోన్లు ఆధారంగా నియామకాలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం రోస్టర్‌ను ఒకటో నంబర్ నుంచి అమలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో అప్పట్లో ఆ విధానాన్ని ఎంచుకోగా... ఇప్పుడు నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో మరోమారు రోస్టర్ పాయింట్లు క్రమసంఖ్య ఒకటి నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ చేసిన పాయింట్ల ఆధారంగా రోస్టర్‌ను కొనసాగించే వీలు లేకపోవడం, ఈడబ్ల్యూఎస్‌కు పదిశాతం కోటా ఇవ్వాల్సి రావడంతో కొత్తగా రోస్టర్ పాయింట్ల అమలు దిశగా ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన జోనల్ విధానం ప్రకారం ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత రాగా, కొత్త నియామకాల విషయంలో రోస్టర్ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మారిన కేడర్... కొత్త రోస్టర్ రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమలుతో ఉద్యోగ కేడర్లలో భారీ మార్పులు జరిగాయి. తెలంగాణ ఏర్పాటైన సమయంలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉండగా.. ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. ఇదివరకు జిల్లా స్థాయిలో ఉన్న పోస్టుల్లో కేవలం నాల్గోతరగతి, సబార్డినేట్ పోస్టులు మాత్రమే జిల్లా కేడర్‌లోకి వచ్చాయి. మిగతా పోస్టులు జోనల్ స్థాయిలోకి చేర్చారు. అదేవిధంగా ఇదివరకు జోనల్ స్థాయిలో ఉన్న పోస్టులు మల్టీ జోనల్ కేడర్‌లోకి చేర్చారు. దీంతో ఇదివరకున్న కేడర్‌తో నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. అదీగాక రోస్టర్ పాయింట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా నంబర్లను ఖరారు చేయాలి. ఆ తర్వాత ఖరారైన రోస్టర్‌ను ఒకటో క్రమ సంఖ్య నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలు 65వేలు? కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తవడంతో ఖాళీలపై ఒక అంచనా వచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 65వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్రత్యక్షంగా భర్తీ చేసే ఉద్యోగాలు, పదోన్నతుల ద్వారా నింపే ఉద్యోగాలపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యక్షంగా భర్తీ చేసే నియామకాలకు నోటిఫికేషన్లను నియామక బోర్డుల ద్వారా చేపట్టాలి. ఇందుకోసం ఆయా శాఖలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదంతో ఆయా బోర్డులకు సమర్పించాలి. అయితే కొత్త రోస్టర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఏమిటీ రోస్టర్? ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు క్రమపద్ధతిలో అమలు చేసే విధానమే రోస్టర్. రోస్టర్ పాయింట్లు ఒకటి నుంచి వంద వరకు ఉంటాయి. ఒకటో క్రమసంఖ్య జనరల్ మహిళతో మొదలవుతుంది. జనరల్ మహిళ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, ఎస్టీ మహిళ, ఎస్టీ జనరల్, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలో మహిళలు, జనరల్, డిజేబుల్ మహిళ, డిజేబుల్ జనరల్ కేటగిరీలకు ఒక్కో క్రమసంఖ్యను రోస్టర్ పాయింట్లలో ఖరారు చేశారు. ఈ పాయింట్ల ఆధారంగా కొత్త నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకసారి రోస్టర్ అమలు చేసి ఎంపిక పూర్తి చేస్తే... ఏ పాయింట్ దగ్గర నియామకాలు పూర్తవుతాయో... తిరిగి నియామకాలు చేపట్టినప్పుడు ఆ పాయింట్ నుంచే క్రమసంఖ్యను కొనసాగించి నియామకాలు చేపడతారు. దీంతో రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి. -
బీఎస్ఎఫ్లో భారీగా కొలువులు.. 2788 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసి సరిహద్దు రక్షణ దళంలో పనిచేయాలనుకునే వారికోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ఉద్యోగ ప్రకటన వెలువడింది. దీనిలో భాగంగా కానిస్టేబుల్(ట్రేడ్‌మెన్) పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 2788. వీటిల్లో పురుషులకు 2651, మహిళలకు 137 పోస్టులను కేటాయించారు. ఫిజికల్ టెస్టులు, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత ► పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఐటీఐ) నుంచి ఏడాది సర్టిఫికేట్ కోర్సు/రెండేళ్ల డిప్లొమా లేదా తత్సమాన కోర్సు చదివి ఉండాలి. ► వయసు: 01.08.2021 నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ► ఎత్తు: పురుష అభ్యర్థులు ఎత్తు 167.5 సెం.మీ, ఛాతీ కొలత 78–83 సెం.మీ మ«ధ్య ఉండాలి. స్త్రీలు 157 సెం.మీ ఎత్తు ఉంటే సరిపోతుంది. చదవండి: 2022లో సింగరేణిలో ఉద్యోగాల భర్తీ.. పూర్తి విరాలు ఇవే.. ఎంపిక ఇలా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ► హైట్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే పీఈటీ పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో పురుçషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పరుగెత్తాలి. స్ట్రీలు 1.6 కిలో మీటర్ల దూరాన్ని 8.30 నిమిషాల్లో పరుగెత్తాల్సి ఉంటుంది. రాత పరీక్ష ► పైన టెస్టులను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీల్లో నిర్వహించే ఈ పరీక్షను ఓఎంఆర్ షీట్ మీద రాయాలి. అంటే.. ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ► రాత పరీక్షలో మొత్తం 100 మార్కులకు–100 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. జనరల్ అవేర్నెస్/జనరల్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద డిస్టింగ్విష్డ్ ప్యాట్రన్స్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లిష్/హిందీ.. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 2 గంటలు. అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులు కనీసం 35శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఇలా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన ఖాళీలకు అనుగుణంగా సొంత రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో జనరేట్ అయ్యే ఐడీ, పాస్ట్‌వర్డ్‌లను సేవ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న అభ్యర్థులు సదరు రిజిస్ట్రేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇది రికార్డు నిమిత్తం భద్రపరుచుకోవాలి. దరఖాస్తును పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో కరస్పాండెన్స్ అంతా ఈమెయిల్/ఎస్ఎంఎస్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు తప్పులు లేకుండా ఫోన్, మెయిల్ ఐడీ సమాచారాన్ని అందించాలి. ప్రభుత్వ/పాక్షిక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు టెన్త్ సర్టిఫికేట్ అలాగే రెండేళ్ల పని అనుభవానికి సంబంధించి సర్టిఫికేట్, రెసిడెన్సీ, కాస్ట్ సర్టిఫికేట్(అవసరమైతే)లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వేతనాలు పే మ్యాట్రిక్స్ లెవల్–3 ప్రకారం–నెలకు రూ.21,700–రూ69,100–వరకు వేతనంగా చెల్లిస్తారు. ఇవేకాకుండా ఇతర అలవెన్సులు కూడా పొందుతారు. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 01, 2022 వెబ్సైట్: https://rectt.bsf.gov.in -
గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 11 ఏళ్లుగా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేయలేదని, ఈ విషయం గమనిస్తేనే ఎంతమంది నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. అనంతరం పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా, మండలస్థాయి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, కోల జనార్దన్, జయంతి పాల్గొన్నారు. -
కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాల్లో ఉద్యోగ ఖాళీలను త్వరితగతిన భర్తీచేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభలో మంగళవారం జీరో అవర్‌లో ఆయన ఉద్యో గ ఖాళీల భర్తీ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఎనిమిది లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన, పరీక్షల నిర్వహణ, ఫలితాలు ప్రకటనల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, తద్వారా నియామక ప్రక్రియ పూర్తికావడం బాగా ఆలస్యం అవుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో రిక్రూట్మెంట్ పరీక్షల కో సం ఏళ్ల తరబడి రేయింబవళ్లు కష్టపడే యవతీ యువకులను ఈ పరిణామాలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నాయని చెప్పారు. నిర్ణీత కాలవ్యవధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేయడంలో కేంద్రం ఉదాసీన వైఖరి వల్ల లక్షలమంది యువతీయువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిగణలోకి తీసుకుని ఖాళీల భర్తీకి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. భవిష్యత్తులోను నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ఖాళీలను భర్తీచేయడానికి వీలుగా ఒక పటిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. స్విమ్స్‌కు రూ.58.31 కోట్లు విడుదల తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)కు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) తొలిదశలో వైద్య పరికరాల సేకరణకు కేంద్ర వాటాగా రూ.58.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆరో గ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల, అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలల ఆధునికీకరణకు రూ.150 కోట్లు (కేంద్రం వాటా రూ.120 కోట్లు, రాష్ట్ర వాటా రూ.30 కోట్లు) వేర్వేరుగా పీఎంఎస్ఎస్వై–2లో అనుమతించినట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు రూ.10వేల ప్రోత్సాహకం కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహకంతో కలిపి ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు రూ.10 వేలు ఇస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. ఎల్ఐసీ మూలధన పెంపునకు అనుమతి చెల్లింపుల మూలధనాన్ని పెంచుకోవడానికి ఎల్ఐసీకి అనుమతించామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ తెలిపారు. గతనెల 31 నాటికి ఎల్ఐసీ చెల్లింపు మూలధనం రూ.6,324.99 కోట్లు అని వైఎస్సార్సీపీ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు రూ.36.1 కోట్లు విడుదల సాగరమాల పథకంలోని కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పిల్లర్స్‌లో భాగంగా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు రూ.72 కో ట్లు మంజూరు చేశామని, దీన్లో రూ.36.1 కోట్లు విడుదల చేశామని కేంద్ర నౌకాయానశాఖ మంత్రి శర్బానంద సోనోవాల్.. వైఎస్సార్సీపీ ఎంపీ మో పిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలి
ముషీరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీకి 15 రోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం బీసీ భవన్లో నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోనల్విధానం పూర్తయినా నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విమర్శించారు. అన్ని శాఖల్లో అడ్హాక్ ప్రమోషన్ల పేరుమీద ఉద్యోగాలన్నీ భర్తీ చేశారని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను కూడా ప్రమోషన్లకింద భర్తీ చేశారని ఆరోపించారు. సీఎం జోక్యం చేసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను పూర్తిస్థాయిలో లెక్కించి భర్తీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. -
2022లో సింగరేణిలో ఉద్యోగాల భర్తీ.. పూర్తి విరాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి వచ్చే ఏడాది 177 జూనియర్ అసిస్టెంట్, 39 మైనింగ్ ఇంజనీర్, 10 ఇండస్ట్రియల్ ఇంజనీర్, 6 ఐటీ ఇంజనీర్‌తో పాటు ఇతర కేటగిరీల పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఏడేళ్ల కాలంలో 58 ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్ల ద్వారా 3,498, కారుణ్య వారసత్వ నియామకాల ద్వారా 12,553 కలిపి మొత్తం 16,040 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సింగరేణి సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: APPSC: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు.. ఒత్తిళ్లతో అర్హులకు అన్యాయం జరిగే అవకాశముందని ఇంటర్వ్యూల విధానాన్ని పూర్తిగా తొలగించి కేవలం రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వివరించింది. రాత పరీక్ష జరిగిన రోజునే ఫలితాలు వెల్లడించి, ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసినట్లు పేర్కొంది. ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. చదవండి: హైదరాబాద్ ఆర్ఆర్ఆర్.. 320 కి.మీ. -
కొత్త ఏడాదిలో ‘ఉద్యోగాలు’!
ఖాళీలు 85 వేలకు పైనే.. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల విభజన అనంతరం దాదాపు 85వేలకుపైగా ఖాళీలను ప్రభు త్వం గుర్తించినట్టు సమాచారం. అందులో 65వేలకుపైగా పోస్టుల భర్తీకి అనుమతించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తయి.. ఎక్కడి ఉద్యోగులు అక్కడికి వెళ్లాక పోస్టులపై పూర్తి స్పష్టత రానుందని పేర్కొంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలోనైనా సర్కారీ కొలువుల భాగ్యం ఉంటుందా? గతేడాది చివర్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా నోటిఫికేషన్లు వస్తాయా? ఏవైనా చిక్కులు, వివాదాలు తలెత్తుతాయా?.. నాలుగేళ్లుగా సర్కారీ కొలువుల కోసం ఎదురుచూస్తున్న లక్షలామందిని తొలిచేస్తున్న ప్రశ్నలివి. అయితే నిరుద్యోగులకు కొత్త సంవత్సరంలో కచ్చితంగా తీపి కబురు అందుతుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ జనవరి 20 నాటికి పూర్తయి, ఖాళీ పోస్టులపై స్పష్టత రానుందని.. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. సీఎం హామీ ఇచ్చి ఏడాది ‘‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తాం. వివిధ శాఖల్లో సుమారు 50వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సదరు ఖాళీలను గుర్తించి భర్తీకి చర్యలు తీసుకుంటారు’’అని సీఎం కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13న ప్రకటించారు. తొలుత అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని, తద్వారా ఏర్పడే కొత్త ఖాళీలను సైతం భర్తీ చేయా లని అధికారులను ఆదేశించారు. అయితే.. ఉద్యో గుల పదోన్నతుల ప్రక్రియ ముగిసినా నియామక ప్రకటనలు వెలువడలేదు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం.. జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ల వారీగా పోస్టుల విభజన, ఆయా పోస్టులకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యాక కొత్త నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. ఇప్పటి వరకు అది తేలలేదు. మరోవైపు సీఎం హామీ ఇచ్చి ఏడాది గడిచిపోవడంతో నిరుద్యోగులు నిరాశలో మునిగిపోయారు. చాలా మందికి ఉద్యోగ అర్హత వయోపరిమితి దాటిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు చివరి అంకానికి.. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. కొత్త జిల్లా కేడర్లకు కేటాయింపులు పూర్తికాగా.. ఉద్యో గుల నుంచి అభ్యంతరాలు, స్పౌజ్ కేటగిరీ కింద ఒకేచోటికి బదిలీల కోసం దరఖాస్తులు స్వీకరణ జరుగుతోంది. మరోవైపు జోనల్, మల్టీజోనల్ కేడర్ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపు సైతం చివరి దశకు చేరుకుంది. వైద్యారోగ్యశాఖ, పలు సంక్షేమ శాఖలు మినహా మిగతా అన్నిశాఖల్లో జోనల్, మల్టీజోనల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుందని, తర్వాత అభ్యంతరాలు, స్పౌజ్ దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. జనవరి 20 నాటికి మొత్తంగా ఉద్యోగుల కేటాయింపు ముగుస్తుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించాయి. -
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో.. క్లర్క్ కొలువుల పిలుపు
బ్యాంకింగ్ రంగం.. ఒక్కసారి కొలువుదీరితే.. వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు! చక్కటి వేతనాలు, కెరీర్ పరంగానూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనే భావన!! అందుకే.. ఏటా లక్షల మంది బ్యాంకు కొలువుల నియామక పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు! నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తూ.. ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇలాంటి వారందరికీ ఐబీపీఎస్ తీపికబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏడు వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్షల విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్‌పై ప్రత్యేక కథనం... ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ మొదలు స్పెషలిస్ట్ ఆఫీసర్ల వరకూ.. వివిధ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టే సంస్థ. ఐబీపీఎస్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వేల సంఖ్యలో నియామకాలు చేపడుతోంది. తాజాగా ఐబీపీఎస్ సంస్థ.. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్–11(సీఆర్పీ క్లర్క్స్–11) పేరిట 7855 క్లర్క్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 బ్యాంకులు ఐబీపీఎస్ సీఆర్పీ క్లర్క్స్–11 ద్వారా మొత్తం పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7855 క్లర్క్ పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిం«ద్ బ్యాంకుల్లో పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 387, తెలంగాణలో 333 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇతర రీజియన్లకు కూడా పోటీ పడొచ్చు. ఎంచుకున్న రీజియన్‌కు సంబంధించి.. అక్కడి అధికారిక భాష పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి కేవలం ఒక ఒక రాష్ట్రానికి సంబంధించిన పోస్టులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హతలు ► అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► వయోపరిమితి: జూలై 1, 2021 నాటికి 20–28 ఏళ్ల మధ్యలో ఉండాలి. (జూలై 2, 1973 తర్వాత జూలై 1, 2001 లోపు జన్మించి ఉండాలి). ► ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు. రెండంచెల రాత పరీక్ష ఐబీపీఎస్ క్లర్క్స్ ఎంపిక ప్రక్రియ.. రెండంచెల రాత పరీక్ష విధానంలో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండో దశలో మెయిన్ పరీక్ష ఉంటాయి. ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్ అందిస్తారు. తుది ఎంపికలో మెయిన్పరీక్షలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఐబీపీఎస్ సీఆర్పీ క్లర్క్స్–11(2022–23) రాత పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. వీటిలో తెలుగు, ఉర్దూ ఉన్నాయి. వాస్తవానికి జులై నెలలోనే ఈ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ నివేదిక పదిహేను రోజుల్లో వస్తుందని.. అప్పటి వరకు దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐబీపీఎస్‌కు సూచించింది. దీంతో ఐబీపీఎస్ దరఖాస్తు ప్రక్రియను నిలిపేసింది. దీనిపై తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అక్టోబర్ 7వ తేదీ నుంచి తిరిగి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది ప్రిలిమినరీ పరీక్ష ఇలా ఐబీపీఎస్ క్లర్క్స్ నియామక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష మూడు విభాగాల్లో ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు సమయం ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 20 ని. న్యూమరికల్ ఎబిలిటీ 35 35 20 ని రీజనింగ్ ఎబిలిటీ 35 35 20 ని మొత్తం 100 100 60 నిమిషాలు (ఒక గంట) మెయిన్ పరీక్ష విధానం ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారు మెయిన్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఆ వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు సమయం జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 50 35 ని ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40 35 ని రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 50 60 45 ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 45 ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మొత్తం 190 200 160 ని ప్రిపరేషన్ ప్రణాళిక ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 2021లో జరగనుంది. ఆ తర్వాత మెయిన్ జనవరి/ఫిబ్రవరి 2022లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంటే.. ఇప్పటి నుంచి ప్రిలిమ్స్‌కు దాదాపు మూడు నెలల సమయం అందుబాటులో ఉంది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు పటిష్ట ప్రణాళికను రూపొందించుకొని ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. రెండింటికీ కలిసొచ్చేలా ప్రిలిమ్స్, మెయిన్‌కు సంబంధించి మూడు విభాగాలు (ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ) రెండు పరీక్షల్లోనూ ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రిలిమ్స్‌లో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా ఉంటుంది. మెయిన్‌లో క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ మూడు విభాగాలకు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగించాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలో ఉండే ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. గ్రామర్‌కే పరిమితం కాకుండా..జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టిపెట్టాలి. న్యూమరికల్ ఎబిలిటీ ప్రిలిమ్స్‌లోని న్యూమరికల్ ఎబిలిటీ, మెయిన్‌లోని క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌కు సరితూగే విభాగంగానూ పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అర్థమెటిక్ అంశాలైన పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలపై పూర్తిగా పట్టుసాధించేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్లపైనా అవగాహన పెంచుకోవాలి. రీజనింగ్ ఇది కూడా ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలోనూ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్‌తోపాటే మెయిన్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌తోపాటే మెయిన్‌లో అదనంగా ఉండే జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్,కంప్యూటర్ నాలెడ్జ్ అంశాల ప్రిపరేషన్ కూడా సాగించాలి. ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్ అదనపు అంశాలపై దృష్టి పెట్టాలనుకునే ఆలోచన సరికాదు.ఎందుకంటే..ప్రిలిమ్స్ ముగిసిన తర్వాత మెయిన్‌కు అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. తక్కువ సమయంలో మెయిన్ సిలబస్ మొత్తం కవర్ చేయడం కష్ట సాధ్యంగా మారుతుంది. జనరల్ అవేర్నెస్/ఫైనాన్షియల్ అవేర్నెస్: ఈ విభాగంలో బ్యాంకింగ్ రంగం పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అబ్రివేషన్లు, పదజాలం, విధులు, కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్ చట్టాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్లోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల (ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. ఆన్లైన్ టెస్ట్‌పై అవగాహన ప్రిలిమ్స్, మెయిన్.. రెండు కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతాయి. కాబట్టి ఆన్లైన్ టెస్ట్ విధానంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. దీనికి మార్గంగా గ్రాండ్ టెస్ట్‌లను ఎంచుకోవాలి. గ్రాండ్ టెస్ట్‌లకు ఆన్‌ౖలైన్ విధానంలో హాజరైతే సబ్జెక్ట్ నైపుణ్యాల్లో సామర్థ్యంతోపాటు, ఆన్లైన్ విధానంపైనా స్పష్టత ఏర్పడుతుంది. క్లర్క్ కొలువుతో.. డీజీఎం వరకు ► ఐబీపీఎస్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌గా నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులు భవిష్యత్తులో సీజీఎం లేదా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగే అవకాశముంది. ప్రారంభంలో క్లర్క్‌గా నియమితులైన అభ్యర్థులకు ఆరు నెలలపాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. సింగిల్ విండో ఆపరేటర్, హెడ్ క్యాషియర్, స్పెషల్ అసిస్టెంట్, యూనివర్సల్ టెల్లర్, అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆరు నెలల ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. పూర్తి స్థాయిలో నియామకం ఖరారవుతుంది. ► కనీసం మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత బ్యాంకులు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తే.. ట్రైనీ ఆఫీసర్(ఎఎంజీఎస్–ఐఐ) హోదా లభిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానెల్ విధానంలో ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు నేరుగా జేఎంజీఎస్ స్కేల్–1 ఆఫీసర్‌గా పదోన్నతి పొందొచ్చు. ► క్లర్క్‌గా కెరీర్ ప్రారంభించాక జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేస్తే.. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ ద్వారా మూడేళ్ల అనుభవంతో ట్రైనీ ఆఫీసర్‌గా తొలి పదోన్నతి పొంది.. ఆ తర్వాత ప్రతి మూడేళ్ల సీనియారిటీతో డీజీఎం హోదా వరకు చేరుకోవచ్చు. అంతేకాకుండా డీజీఎం హోదాలో మూడేళ్ల అనుభవంతో జీఎంగా.. మరో మూడేళ్ల అనుభవంతో సీజీఎంగా.. ఆ తర్వాత మూడేళ్ల అనుభవంతో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్–ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూలై12–14, 2021లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.10.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021 ► ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబర్ 2021 ► ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్: జనవరి/ఫిబ్రవరి 2022 ► ప్రొవిజినల్ అలాట్మెంట్: ఏప్రిల్ 2022 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ibps.in -
సాయుధ బలగాల్లో జాబ్, యువతకు శుభవార్త
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్‌ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్‌ఎస్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ►ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ►వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ►తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ►ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ►జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ►జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. బఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ►ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్ర ర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ►ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ►ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ►ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ►ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ►తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ►కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్‌ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించాలి. ►గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్‌టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ►ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ►పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ►వెబ్సైట్: https://ssc.nic.in -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అలాగే.. కొత్త ఉద్యోగ నియామకాలకు ఆటంకం కలగదన్నారు. గురువారం శాసనసభలో పెన్షన్ సవరణ బిల్లును, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాజీ శాసనసభ్యుల పెన్షన్‌ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే.. అప్పర్ సీలింగ్ రూ.70 వేలుగా ఖరారు చేసినట్లు చెప్పారు. వైద్య చికిత్సల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు పెంచుతున్నట్లు మంత్రి సభకు వివరించారు. ఈ పథకాన్ని మాజీ సభ్యులతో పాటు వారి సహ చరులు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే భాగన్న వైద్య చికిత్స సమయంలో సీలింగ్ రూ.లక్ష మాత్రమే ఉండటంతో మరింత నగదు చెల్లించాల్సి వచ్చిందని, అప్పట్లో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకూడదని సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ 61కి పెంపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదివరకే నాల్గో తరగతి ఉద్యోగులకు అరవై ఏళ్లు, ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బందికి 65 సంవత్సరాలు, న్యాయ సిబ్బందికి 60 ఏళ్లు పదవీ విరమణ వయోపరిమితి ఉందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో 60 ఏళ్ల వరకు ఉందన్నారు. ఉద్యోగుల సీనియార్టీని, అనుభవాన్ని వినియోగించు కునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వేతన సవరణ సంఘం కూడా ఈ మేరకు ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మానవుని సగటు జీవిత కాలం కూడా పెరిగిందని, దీంతో ఉద్యోగులకు మరో మూడేళ్ల పాటు పనిచేసే వెసులుబాటు ఇస్తున్నామని ఆయన వివరించారు. -
గ్రామాల్లో కొలువుల జాతర
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : గ్రామాల్లో స్వచ్ఛమైన పాలన అందించే మంచి రోజులు కొద్దిరోజుల్లోనే రానున్నాయి. మహాత్ముడి గ్రామ స్వరాజ్య లక్ష్యం సాకారం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగంగా గ్రామాల్లో పారదర్శక పాలన తీసుకొచ్చే ప్రయత్నాలకు అడుగులు పడుతున్నాయి. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. అలాగే కనీసం 3 వేలమంది జనాభా ఉన్న గ్రామానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ప్రభుత్వ పథకాల లబ్ధి శాతం పెరగడమే కాకుండా అక్రమాలు, లంచాలకు తావులేని వ్యవస్థను అందించే వీలుంటుంది. దూర ప్రాంతాలకు వలస పోతున్న యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తూ విధాన నిర్ణయం తీసుకోవడం ద్వారా నిరుద్యోగ సమస్యకు సీఎం చెక్ పెట్టారు. ఈ నిర్ణయంతో జిల్లాలో మొత్తం పల్లెల్లోనే 20,274 ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో అత్యధికంగా వలంటీర్లు 11,924 కాగా, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు 8,350 వరకు ఉన్నాయి. దీంతో వేలాది మంది పల్లె యువకులకు ఉద్యోగ వరం లభించనుంది. ఇవే కాకుండా శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ, రాజాం మున్సిపల్ ప్రాంతాల్లో కూడా వార్డు వలంటీర్లు 1704 పోస్టులతోపాటు వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు రానున్నాయి. 8,350 సచివాలయ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ గ్రామాల్లో స్థిరమైన పాలన, పారదర్శకంగా ఉండాలనే ధ్యేయంతో సీఎం జగన్, స్థానికంగా ఉన్నత విద్యార్హతలున్న నిరుద్యోగులకు అక్కడే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా ‘సచివాలయ ఉద్యోగాల కల్పన’ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈమేరకు ప్రతి గ్రామ సచివాలయానికి పది ప్రభుత్వ ఉద్యోగాలు లభించనున్నాయి. ఈమేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించి, ఉద్యోగాలకు పారదర్శకంగా ఎంపిక చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ కొత్త కొలువులతో అన్ని గ్రామ సచివాలయాలు కళకళలాడనున్నాయి. జిల్లాలో మొత్తం 1141 గ్రామ పంచాయతీల్లో 835 గ్రామ సచివాలయాలు (సెక్రటేరియట్లు) ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఒక్కో సచివాలయానికి పది ఉద్యోగాల చొప్పున జిల్లాలో మొత్తం 8350 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఇదిలావుంటే జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నిర్వహించనున్న రాత పరీక్షలో ఎంపికైన ఉద్యోగులను రెండేళ్లపాటు ప్రొబేషనరీగా ఉంచి, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించనున్నారు. ఇప్పటికే పంచాయతీల్లో ఉన్న ఉద్యోగులు కాకుండా అదనంగా మరో 10 మందిని ప్రతి సచివాలయానికి కేటాయించనున్నారు. దీంతో నిరుద్యోగ సమస్య కొంతమేరకు తీరనుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న యువతకు.. ఇప్పుడు మంచి కాలం వచ్చినట్లయింది. -
భర్తీ చేసింది.. 32 వేలే!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో 32,681 ఉద్యోగాలను భర్తీ చేసింది. పోలీసు శాఖలో అత్యధికంగా 12,152 పోస్టులను భర్తీ చేసింది. టీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వెల్లడించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ మేరకు మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువైన 2014, జూన్ 2 నుంచి 2018, ఆగస్టు 31 వరకు పోస్టుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అన్ని శాఖల్లో కలిపి 1,28,274 పోస్టుల ఖాళీలను గుర్తించారు. వీటిలో 1,02,217 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు నియామక మండలి, గురుకుల విద్యాలయాల నియామక మండలి, ఆయా శాఖల ఎంపిక కమిటీలు.. 87,346 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఇలా నోటిఫికేషన్ జారీ చేసిన వాటిలో 24,476 పోస్టులు భర్తీ అయ్యాయి. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణలో 128 పోస్టులను భర్తీ చేశారు. సింగరేణిలో 8,205 పోస్టులు భర్తీ అయ్యాయి. వివిధ శాఖలో రెగ్యులర్‌గా మార్చినవి.. 811 పోస్టులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. -
716 కొలువుల భర్తీకి ఆమోదం
సాక్షి, హైదరాబాద్ : ఖాళీగా ఉన్న 716 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళ, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలో 325 పోస్టులను, అగ్నిమాపక శాఖలో 391 పోస్టులను భర్తీ చేసేందుకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖలోని వివిధ కేటగిరీల్లోని పోస్టులను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, శాఖాపరమైన ఎంపిక కమిటీ, టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయాలని పేర్కొంది. మహిళా, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలోని 325 గ్రేడ్ 2 విస్తరణ అధికారి పోస్టులను శాఖాపరమైన ఎంపిక కమిటీతో భర్తీ చేయాలని సూచించింది.