బ్యాంకింగ్ రంగం.. ఒక్కసారి కొలువుదీరితే.. వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు! చక్కటి వేతనాలు, కెరీర్ పరంగానూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనే భావన!! అందుకే.. ఏటా లక్షల మంది బ్యాంకు కొలువుల నియామక పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు! నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తూ.. ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇలాంటి వారందరికీ ఐబీపీఎస్ తీపికబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏడు వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్షల విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్‌పై ప్రత్యేక కథనం...
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ మొదలు స్పెషలిస్ట్ ఆఫీసర్ల వరకూ.. వివిధ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టే సంస్థ. ఐబీపీఎస్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వేల సంఖ్యలో నియామకాలు చేపడుతోంది. తాజాగా ఐబీపీఎస్ సంస్థ.. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ క్లర్క్స్–11(సీఆర్‌పీ క్లర్క్స్–11) పేరిట 7855 క్లర్క్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 11 బ్యాంకులు
ఐబీపీఎస్ సీఆర్‌పీ క్లర్క్స్–11 ద్వారా మొత్తం పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7855 క్లర్క్ పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఒవర్‌సీస్ బ్యాంక్, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిం«ద్ బ్యాంకుల్లో పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 387, తెలంగాణలో 333 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇతర రీజియన్లకు కూడా పోటీ పడొచ్చు. ఎంచుకున్న రీజియన్‌కు సంబంధించి.. అక్కడి అధికారిక భాష పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి కేవలం ఒక ఒక రాష్ట్రానికి సంబంధించిన పోస్టులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
అర్హతలు
► అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
► వయోపరిమితి: జూలై 1, 2021 నాటికి 20–28 ఏళ్ల మధ్యలో ఉండాలి. (జూలై 2, 1973 తర్వాత జూలై 1, 2001 లోపు జన్మించి ఉండాలి).
► ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు.
రెండంచెల రాత పరీక్ష
ఐబీపీఎస్ క్లర్క్స్ ఎంపిక ప్రక్రియ.. రెండంచెల రాత పరీక్ష విధానంలో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండో దశలో మెయిన్ పరీక్ష ఉంటాయి. ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. ప్రొవిజినల్ అలాట్‌మెంట్ లెటర్ అందిస్తారు. తుది ఎంపికలో మెయిన్‌పరీక్షలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు
13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష
ఐబీపీఎస్ సీఆర్‌పీ క్లర్క్స్–11(2022–23) రాత పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. వీటిలో తెలుగు, ఉర్దూ ఉన్నాయి. వాస్తవానికి జులై నెలలోనే ఈ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ నివేదిక పదిహేను రోజుల్లో వస్తుందని.. అప్పటి వరకు దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐబీపీఎస్‌కు సూచించింది. దీంతో ఐబీపీఎస్ దరఖాస్తు ప్రక్రియను నిలిపేసింది. దీనిపై తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అక్టోబర్ 7వ తేదీ నుంచి తిరిగి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది
ప్రిలిమినరీ పరీక్ష ఇలా
ఐబీపీఎస్ క్లర్క్స్ నియామక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష మూడు విభాగాల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. వివరాలు..
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 30 | 30 | 20 ని. |
న్యూమరికల్ ఎబిలిటీ | 35 | 35 | 20 ని |
రీజనింగ్ ఎబిలిటీ | 35 | 35 | 20 ని |
మొత్తం | 100 | 100 | 60 నిమిషాలు (ఒక గంట) |
మెయిన్ పరీక్ష విధానం
ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారు మెయిన్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఆ వివరాలు..
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ | 50 | 50 | 35 ని |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 40 | 40 | 35 ని |
రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ | 50 | 60 | 45 ని |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 | 50 | 45 ని |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మొత్తం | 190 | 200 | 160 ని |
ప్రిపరేషన్ ప్రణాళిక
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 2021లో జరగనుంది. ఆ తర్వాత మెయిన్ జనవరి/ఫిబ్రవరి 2022లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంటే.. ఇప్పటి నుంచి ప్రిలిమ్స్‌కు దాదాపు మూడు నెలల సమయం అందుబాటులో ఉంది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు పటిష్ట ప్రణాళికను రూపొందించుకొని ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి.
రెండింటికీ కలిసొచ్చేలా
ప్రిలిమ్స్, మెయిన్‌కు సంబంధించి మూడు విభాగాలు (ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ) రెండు పరీక్షల్లోనూ ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రిలిమ్స్‌లో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా ఉంటుంది. మెయిన్‌లో క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ మూడు విభాగాలకు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగించాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలో ఉండే ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. గ్రామర్‌కే పరిమితం కాకుండా..జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టిపెట్టాలి.
న్యూమరికల్ ఎబిలిటీ
ప్రిలిమ్స్‌లోని న్యూమరికల్ ఎబిలిటీ, మెయిన్‌లోని క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌కు సరితూగే విభాగంగానూ పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అర్థమెటిక్ అంశాలైన పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలపై పూర్తిగా పట్టుసాధించేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపైనా అవగాహన పెంచుకోవాలి.
రీజనింగ్
ఇది కూడా ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలోనూ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను ప్రాక్టీస్ చేయాలి.
ప్రిలిమ్స్‌తోపాటే మెయిన్
ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌తోపాటే మెయిన్‌లో అదనంగా ఉండే జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్,కంప్యూటర్ నాలెడ్జ్ అంశాల ప్రిపరేషన్ కూడా సాగించాలి. ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్ అదనపు అంశాలపై దృష్టి పెట్టాలనుకునే ఆలోచన సరికాదు.ఎందుకంటే..ప్రిలిమ్స్ ముగిసిన తర్వాత మెయిన్‌కు అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. తక్కువ సమయంలో మెయిన్ సిలబస్ మొత్తం కవర్ చేయడం కష్ట సాధ్యంగా మారుతుంది.
జనరల్ అవేర్‌నెస్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్: ఈ విభాగంలో బ్యాంకింగ్ రంగం పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అబ్రివేషన్లు, పదజాలం, విధులు, కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్ చట్టాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్‌లోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల (ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
కంప్యూటర్ నాలెడ్జ్
ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి.
ఆన్‌లైన్ టెస్ట్‌పై అవగాహన
ప్రిలిమ్స్, మెయిన్.. రెండు కూడా ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. కాబట్టి ఆన్‌లైన్ టెస్ట్ విధానంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. దీనికి మార్గంగా గ్రాండ్ టెస్ట్‌లను ఎంచుకోవాలి. గ్రాండ్ టెస్ట్‌లకు ఆన్‌ౖలైన్ విధానంలో హాజరైతే సబ్జెక్ట్ నైపుణ్యాల్లో సామర్థ్యంతోపాటు, ఆన్‌లైన్ విధానంపైనా స్పష్టత ఏర్పడుతుంది.
క్లర్క్ కొలువుతో.. డీజీఎం వరకు
► ఐబీపీఎస్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌గా నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులు భవిష్యత్తులో సీజీఎం లేదా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగే అవకాశముంది. ప్రారంభంలో క్లర్క్‌గా నియమితులైన అభ్యర్థులకు ఆరు నెలలపాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. సింగిల్ విండో ఆపరేటర్, హెడ్ క్యాషియర్, స్పెషల్ అసిస్టెంట్, యూనివర్సల్ టెల్లర్, అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆరు నెలల ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. పూర్తి స్థాయిలో నియామకం ఖరారవుతుంది.
► కనీసం మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత బ్యాంకులు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తే.. ట్రైనీ ఆఫీసర్(ఎఎంజీఎస్–ఐఐ) హోదా లభిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానెల్ విధానంలో ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు నేరుగా జేఎంజీఎస్ స్కేల్–1 ఆఫీసర్‌గా పదోన్నతి పొందొచ్చు.
► క్లర్క్‌గా కెరీర్ ప్రారంభించాక జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేస్తే.. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ ద్వారా మూడేళ్ల అనుభవంతో ట్రైనీ ఆఫీసర్‌గా తొలి పదోన్నతి పొంది.. ఆ తర్వాత ప్రతి మూడేళ్ల సీనియారిటీతో డీజీఎం హోదా వరకు చేరుకోవచ్చు. అంతేకాకుండా డీజీఎం హోదాలో మూడేళ్ల అనుభవంతో జీఎంగా.. మరో మూడేళ్ల అనుభవంతో సీజీఎంగా.. ఆ తర్వాత మూడేళ్ల అనుభవంతో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్–ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూలై12–14, 2021లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
► ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.10.2021
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021
► ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబర్ 2021
► ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్: జనవరి/ఫిబ్రవరి 2022
► ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్ 2022
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ibps.in
Comments
Please login to add a commentAdd a comment