సాక్షిప్రతినిధి, వరంగల్: విద్యుత్‌శాఖలో జూనియర్ లైన్‌మన్ (జేఎల్‌ఎం) పోస్టులు దళారులకు వరంగా మారాయి. నిరుద్యోగులను నమ్మించి డబ్బులు గుంజేందుకు గ్రూపులుగా ఏర్పడిన కొందరు వేలం పెట్టారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1,000 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి వెలువడిన నోటిఫికేషన్‌ను ఆసరాగా చేసుకుని.. అందులో పనిచేస్తున్న కొందరు.. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి వసూళ్లకు శ్రీకారం చుట్టారు.
ఈ దళారులకు కొందరు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు తోడయ్యారు. దరఖాస్తు చేయడం మొదలు పరీక్ష రాసి ఉద్యోగం వచ్చే వరకు అంతా తామే చూసుకుంటామని అందినకాడికి దండుకున్నారు. ఈనెల 17న జరిగిన రాత పరీక్ష సందర్భంగా పలు అవకతవకలు వెలుగుచూడగా... ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) రంగంలోకి వరంగల్‌లో ఆరా తీస్తుండడం కలకలం రేపుతోంది.
చదవండి👉🏻పెద్దరాతియుగం నాటి చిత్రాల తావు గుర్తింపు
దళారులకు వరంగా నోటిఫికేషన్..
ఎస్పీడీసీఎల్‌లో 70 అసిస్టెంట్ ఇంజనీర్లు, 201 సబ్ ఇంజనీర్లు, 1,000 లైన్‌మన్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జేఎల్‌ఎం కోసం మే 19 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అర్హత ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. వెయ్యి జేఎల్‌ఎం పోస్టుల కోసం 35,312 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలతో పాటు, హనుమకొండలో నివాసం ఉండే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, సైదాపూర్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన పలువురు కూడా ఇందులో ఉన్నారు.
ఎస్‌పీడీసీఎల్ హైదరాబాద్‌లో పని చేస్తున్న హనుమకొండకు చెందిన కొందరు ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నాయకులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బేరం పెట్టారు. కొందరు మొత్తం.. ఇంకొందరు అడ్వాన్స్‌గా చెల్లించి.. ఈ నెల 17న రాత పరీక్షకు హాజరయ్యారు. డబ్బులు తీçసుకున్న వారు ఒప్పందం ప్రకారం రాత పరీక్షకు సహకరించకపోగా, కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
చదవండి👉🏻తీరొక్క భూములు.. చూడచక్కని అడవులు
ఎస్‌ఓటీ అదుపులో ఐదుగురు.. వరంగల్‌లో ఆరా..
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన ఏసోబు (పేరు మార్చాం) అనే వ్యక్తి కాజీపేటకు చెందిన ఎస్పీడీసీఎల్‌కు చెందిన వ్యక్తి ద్వారా హైదరాబాద్‌లో ఓ దళారికి రూ.1.50 లక్షలు చెల్లించాడు. ఇదంతా బోగస్ అని తెలియడంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన పలువురు కూడా విద్యుత్‌శాఖలో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు దందాకు తెరతీశారంటూ పేర్లతో సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
జేఎల్‌ఎం పోస్టుల కోసం 35,312 మందిలో.. ఉమ్మడి జిల్లా నుంచి నాన్‌లోకల్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నవారు సుమారు నాలుగు వేల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఇందులో దళారులను నమ్మి మోసపోయిన చాలా మంది పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఇదే కేసులో మలక్‌పేట ఏడీలు సైదులు, ఫిరోజ్, నిత్యలు, లైన్‌మన్లు శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు శనివారం ఉమ్మడి వరంగల్‌లోనూ ఆరా తీశారు. హనుమకొండ, జనగామ, హుజూరాబాద్ ప్రాంతాల నుంచి ఫిర్యాదు చేసిన వారిని పిలిచి మాట్లాడి వివరాలు సేకరించడం చర్చనీయాంశమవుతోంది.
చదవండి👉🏻క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్‌ఎస్‌కు కొత్త ఆయుధాలా!
Comments
Please login to add a commentAdd a comment