Junior Lineman
-
అంగట్లో జూనియర్ లైన్‌మన్ పోస్టులు రూ.5 లక్షలకు బేరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: విద్యుత్‌శాఖలో జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం) పోస్టులు దళారులకు వరంగా మారాయి. నిరుద్యోగులను నమ్మించి డబ్బులు గుంజేందుకు గ్రూపులుగా ఏర్పడిన కొందరు వేలం పెట్టారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,000 జేఎల్ఎం పోస్టుల భర్తీకి వెలువడిన నోటిఫికేషన్‌ను ఆసరాగా చేసుకుని.. అందులో పనిచేస్తున్న కొందరు.. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఈ దళారులకు కొందరు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు తోడయ్యారు. దరఖాస్తు చేయడం మొదలు పరీక్ష రాసి ఉద్యోగం వచ్చే వరకు అంతా తామే చూసుకుంటామని అందినకాడికి దండుకున్నారు. ఈనెల 17న జరిగిన రాత పరీక్ష సందర్భంగా పలు అవకతవకలు వెలుగుచూడగా... ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) రంగంలోకి వరంగల్‌లో ఆరా తీస్తుండడం కలకలం రేపుతోంది. చదవండి👉🏻పెద్దరాతియుగం నాటి చిత్రాల తావు గుర్తింపు దళారులకు వరంగా నోటిఫికేషన్.. ఎస్పీడీసీఎల్లో 70 అసిస్టెంట్ ఇంజనీర్లు, 201 సబ్ ఇంజనీర్లు, 1,000 లైన్‌మన్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జేఎల్ఎం కోసం మే 19 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అర్హత ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. వెయ్యి జేఎల్ఎం పోస్టుల కోసం 35,312 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలతో పాటు, హనుమకొండలో నివాసం ఉండే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, సైదాపూర్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన పలువురు కూడా ఇందులో ఉన్నారు. ఎస్పీడీసీఎల్ హైదరాబాద్‌లో పని చేస్తున్న హనుమకొండకు చెందిన కొందరు ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నాయకులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బేరం పెట్టారు. కొందరు మొత్తం.. ఇంకొందరు అడ్వాన్స్‌గా చెల్లించి.. ఈ నెల 17న రాత పరీక్షకు హాజరయ్యారు. డబ్బులు తీçసుకున్న వారు ఒప్పందం ప్రకారం రాత పరీక్షకు సహకరించకపోగా, కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చదవండి👉🏻తీరొక్క భూములు.. చూడచక్కని అడవులు ఎస్ఓటీ అదుపులో ఐదుగురు.. వరంగల్‌లో ఆరా.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన ఏసోబు (పేరు మార్చాం) అనే వ్యక్తి కాజీపేటకు చెందిన ఎస్పీడీసీఎల్కు చెందిన వ్యక్తి ద్వారా హైదరాబాద్‌లో ఓ దళారికి రూ.1.50 లక్షలు చెల్లించాడు. ఇదంతా బోగస్ అని తెలియడంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన పలువురు కూడా విద్యుత్‌శాఖలో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు దందాకు తెరతీశారంటూ పేర్లతో సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. జేఎల్ఎం పోస్టుల కోసం 35,312 మందిలో.. ఉమ్మడి జిల్లా నుంచి నాన్‌లోకల్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నవారు సుమారు నాలుగు వేల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఇందులో దళారులను నమ్మి మోసపోయిన చాలా మంది పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఇదే కేసులో మలక్‌పేట ఏడీలు సైదులు, ఫిరోజ్, నిత్యలు, లైన్మన్లు శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శనివారం ఉమ్మడి వరంగల్లోనూ ఆరా తీశారు. హనుమకొండ, జనగామ, హుజూరాబాద్ ప్రాంతాల నుంచి ఫిర్యాదు చేసిన వారిని పిలిచి మాట్లాడి వివరాలు సేకరించడం చర్చనీయాంశమవుతోంది. చదవండి👉🏻క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్ఎస్కు కొత్త ఆయుధాలా! -
‘లైన్మన్ల’ నియామకం నెలలో పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 2017లో జారీచేసిన నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ లైన్మన్ల నియామకాలను నెలరోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. వీటికి సంబంధించిన మరో ఏడు పిటిషన్లను కూడా కొట్టివేసింది. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో చేపట్టిన సబ్ ఇంజనీర్, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన సబ్ ఇంజనీర్ల నియామకాలకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఇటీవల తీర్పునిచ్చారు. లైన్మన్ల నియామకాల్లో 20 మార్కులు వెయిటేజీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం వెయిటేజీ మార్కులను సమర్థించింది. మరో ధర్మాసనం తప్పుబట్టింది. దీంతో ఈ వివాదం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ముందుకు రాగా అది కూడా వెయిటేజీని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. -
ఏపీఈపీడీసీఎల్: జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(ఏపీఈపీడీసీఎల్).. ఎనర్జీ అసిస్టెంట్లు(జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► పోస్టులు: ఎనర్జీ అసిస్టెంట్లు(జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2) ► మొత్తం పోస్టుల సంఖ్య: 398 ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 30.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021 ► వెబ్సైట్: https://apeasternpower.com -
‘వయస్సు’మీరింది!
సాక్షి, హైదరాబాద్:నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల అమలు గడువు ముగియడంతో లక్షలాది నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యంతో 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితి దాటి అనర్హులుగా మారిన నిరుద్యోగులకు మరో అవకాశం కల్పించేందుకు గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు పొడిగిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 44 ఏళ్లకు వయోపరిమితి పెరగడంతో వేలాది మందికి ప్రయోజనం కలిగింది. తొలుత ఏడాది అమలు గడువుతో ఈ ఉత్తర్వులను జారీ చేయగా, నాలుగేళ్లుగా గడువును పొడిగిస్తూ వస్తున్నారు. చివరిసారి జారీ చేసిన జీవో అమలు గడువు గత జూలై 27తో ముగిసింది. మళ్లీ జీవో అమలు గడువును పొడిగిస్తూ కొత్త జీవో జారీ చేసే అంశాన్ని ప్రభుత్వం మర్చిపోయింది.దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 3,025 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు టీఎస్పీఎస్సీ నుంచి నియామక ప్రకటనలు వస్తున్నాయి.వీటితో పాటు భవిష్యత్తులో చేపట్టే ఉద్యోగ నియామకాలకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయామని నిరుద్యోగులు మదనపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సుల మేరకు గతంలో గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు ప్రభుత్వం పెంచిందని, ఈ ఉత్తర్వుల అమలు గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
విధి చేతిలో ఓడిన యువకుడు
సాక్షి, పాలకొండ : విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఆ యువకుడు విధి చేతిలో ఓడిపోయాడు. ఆ కుటుంబ ఇంకా ఆనందం నుంచి తేరుకోక ముందే తీవ్ర విషాదం నెలకొంది. పేద కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. ప్రతి ఒక్కరికి సహాయం అందించే వ్యక్తి రెప్పపాటులో విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదం అలముకుంది. మండలంలోని నవగాం గ్రామానికి చెందిన బెహరా రమేష్ (35) గ్రామంలో ఒప్పంద పద్ధతిలో విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సచివాలయ ఉద్యోగాల నియమాకంలో జూనియర్ లైన్‌మన్‌గా ఉద్యోగం పొందాడు. వంగర మండలంలో ఇటీవల విధుల్లో చేరాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటిలోనే ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో పక్క ఇంటిలో విద్యుత్ రావడం లేదని పిలవడంతో పరిశీలించడానికి వెళ్లాడు. ఈ సమయంలో విద్యుత్ బోర్డు తగిలి షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు రమేష్‌ను పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఉషారాణి, ఎనిమిది నెలల పాప, తల్లిదండ్రులు ఉన్నారు. రమేష్ గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండేవాడని, ఎవరి ఇంటిలో విద్యుత్ సమస్య వచ్చినా తక్షణం స్పందించేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. డబ్బులు కూడా తీసుకోకుండా సాయం అందించేవాడన్నారు. భర్త మృతిచెందిన విషయం తెలుసుకున్న భార్య ఉషారాణి బోరున విలపించింది. ఉద్యోగం వచ్చిన ఆనందం ఎన్నో రోజులు నిలవలేదని తమకు ఇక దిక్కెవరంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదించారు. -
ఇక ‘లైన్’గా ఉద్యోగాలు!
సాక్షి, అరసవల్లి: రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్లను నియమించిన ప్రభుత్వం, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మరిన్ని పోస్టులు అదనంగా చేరనున్నాయి. ఇంతవరకు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యార్హతలతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, తాజాగా పదో తరగతి, ఎలక్ట్రికల్ ఐటీఐ వంటి విద్యార్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలోని ఖాళీలుగా ఉన్న 679 లైన్మెన్ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. దీంతో జగన్ ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగులకు వరంలా మారింది. మొత్తం 679 పోస్టుల భర్తీ.. జిల్లాలో విద్యుత్ సంస్థలో ఇంత భారీగా లైన్మెన్ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. దశాబ్దాల కాలం నుంచి ఈ రిక్రూట్మెంట్ కోసం వేచిచూస్తున్న అభ్యర్థులకు ఇన్నాళ్లకు కల నెరవేరనుంది. వయో పరిమితిని సడలించడంతో చాలా మందికి అర్హత కలగనుంది. గ్రామ/ వార్డు సచివాలయాలు అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సచివాలయాల్లోనే ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్మెన్–గ్రేడ్–3) పేరిట ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలో 835 గ్రామ సచివాలయాల్లో 592 లైన్మెన్లు, 94 వార్డు సచివాలయాల్లో 87 లైన్మెన్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎనర్జీ అసిస్టెంట్లను గ్రామాల్లో 2177, వార్డుల్లో 682 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఖరు తేదీ 17.. లైన్మెన్ల పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంది. ఇప్పటికే దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. ఈ నెల 17 అర్థరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులను ఆన్లైన్లో అనుమతిస్తారు. రాతపరీక్ష ద్వారా ఎంపికలు జరగనున్న ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులకు కచ్చితంగా విద్యుత్ స్తంభం ఎక్కడం తెలుసుండాలి. మీటర్ రీడింగ్ నిర్వహణపై అవగాహన ఉండాలి. పూర్తి వివరాలకు ఏపీఈపీడీసీఎల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు చెబుతున్నారు. పోస్టులకు అర్హతలు ఇవే... జూనియర్ లైన్మెన్ పోస్టుల కోసం ఐటీఐ ఎలక్ట్రికల్, వైర్‌మెన్ ట్రేడ్‌తో పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న వారు/ ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్– రివైండింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్– కాంట్రాక్టింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు. ఇతరుల విభాగంలో 35 ఏళ్లు వయస్సున్న పురుషులు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. 20 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో (నాన్ లోకల్), మిగిలిన 80 శాతం స్థానిక కోటాలో (లోకల్) భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున గరిష్టంగా 20 మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు. నిబంధనల ప్రకారం ఇదే జిల్లాలో వరుసగా నాలుగు విద్యాసంవత్సరాలు ఒకేచోట చదివితే లోకల్ క్యాండిడేట్‌గా గుర్తించనున్నారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కూడా వర్తింపజేయనున్నారు. -
ఏసీబీకి చిక్కిన జూనియర్ లైన్‌మన్
మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా) : ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ జూనియర్ లైన్‌మన్ లింగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మహేశ్వరం మండలం తుక్కుగూడ ఏఈ కార్యాలయంలో మంగళవారం ఓ వ్యక్తి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.