ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు.. గ్రేటర్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు  | Telangana Govt Jobs 2022: Most Of Vacancies Are In Education Department | Sakshi
Sakshi News home page

ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు..హైదరాబాద్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు 

Published Tue, Mar 22 2022 7:55 AM | Last Updated on Tue, Mar 22 2022 3:41 PM

Telangana Govt Jobs 2022: Most Of Vacancies Are In Education Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సర్కారు కొలువుల జాబితాలో అత్యధిక ఖాళీలు విద్యాశాఖలో ఉండటంతో నిరుద్యోగుల దృష్టి అంతా టీచరు పోస్టులపై కేంద్రీకృతమైంది. కొత్త జోన్లు, జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానుంది. ఇప్పటికే బీఎడ్, డీఎడ్‌ కోర్సులు పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం ఫైనలియర్‌లో ఉన్న అభ్యర్థులకు కూడా కలిసి వచ్చే విధంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం సుమారు 842కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదించినట్లు తెలుస్తోంది. ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.  

అయిదేళ్లుగా నో నోటిఫికేషన్‌.. 
గ్రేటర్‌ పరిధిలో సుమారు 25 వేలమందికిపైగా బీఎడ్, డీఎడ్‌ కోర్సులు పూర్తిచేసిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా టీఆర్టీ నోటిఫికేషన్‌ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీని నిర్వహించగా ఇప్పటివరకు ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. ఈసారి ఎలాగైనా టీచర్‌ పోస్టులను భర్తీ అవుతాయనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్‌ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్‌ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 4,700 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తి చేస్తున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఇంటి కరెంట్‌ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్‌ తీస్తే..

సర్కారు బడుల్లో భారీగా చేరిక.. 
గ్రేటర్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీల జాతర కొనసాగుతోంది. పదవీ విరమణ, పదోన్నతులు, బదిలీలతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి చతికిలపడి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులు భరించలేక సర్కారు బడుల్లో తమ పిల్లలను పెద్ద ఎత్తున చేర్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతోపాటు విద్యా వలంటీర్లకు కూడా అనుమతి లభించకపోవడంతో ఉన్న ఉపాధ్యాయులపై పనిభారం పడుతోంది. 
 
రెండు మాధ్యమాల్లో.. 
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించవచ్చని అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు చేసే అవకాశం ఉండడంతో నియామక పరీక్ష రెండు మాధ్యమాల్లో ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బీఎడ్‌ పూర్తి చేసినవారి సంఖ్యే అధికంగా ఉంది.

ఆంగ్ల బోధనపై ప్రస్తుతం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మున్ముందు ఆంగ్లంలో బోధనను దృష్టిలో ఉంచుకుని.. కొత్తగా నియమించే ఉపాధ్యాయులను కూడా ఆ మాధ్యమం వారిని తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. మొత్తం పోస్టుల్లో ఆంగ్ల మాధ్యమం వారినే తీసుకుంటే తెలుగు మాధ్యమం అభ్యర్థులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో రెండు మాధ్యమాల్లో డీఎస్సీకి నిర్వహించే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. 

టెట్‌ కోసం.. 
బీఎడ్, డీఎడ్‌ కోర్సులు పూర్తి చేసి టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తే టీఆర్టీ రాయవచ్చని నిరీక్షిస్తున్నారు. డీఎస్సీకి ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా అయిదేళ్ల నుంచి టెట్‌ నిర్వహించలేదు. టెట్‌ పేపర్‌– 1, పేపర్‌– 2లో అర్హత సాధించినవారి కంటే టెట్‌ క్వాలిఫై కాని, 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సు చేసినవారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

టెట్‌ నిర్వహించాలంటే కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇవ్వాల్సి ఉంటుంది. గత పద్ధతి ప్రకారం డీఈడీ చేసినవారు పేపర్‌– 1, బీఈడీ చదివినవారు పేపర్‌– 2 రాయడానికి అర్హులు. ఎన్‌సీఈఆర్‌టీ కొత్త మార్గదర్శకాల ప్రకారం బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్‌ పేపర్‌– 1, పేపర్‌– 2 రాయడానికి అర్హులు. ఈ మేరకు ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉత్తర్వులివ్వాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement