job Practice
-
ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు.. గ్రేటర్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సర్కారు కొలువుల జాబితాలో అత్యధిక ఖాళీలు విద్యాశాఖలో ఉండటంతో నిరుద్యోగుల దృష్టి అంతా టీచరు పోస్టులపై కేంద్రీకృతమైంది. కొత్త జోన్లు, జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానుంది. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం ఫైనలియర్లో ఉన్న అభ్యర్థులకు కూడా కలిసి వచ్చే విధంగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం సుమారు 842కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదించినట్లు తెలుస్తోంది. ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయిదేళ్లుగా నో నోటిఫికేషన్.. గ్రేటర్ పరిధిలో సుమారు 25 వేలమందికిపైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా టీఆర్టీ నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీని నిర్వహించగా ఇప్పటివరకు ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. ఈసారి ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ అవుతాయనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 4,700 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తి చేస్తున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇంటి కరెంట్ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్ తీస్తే.. సర్కారు బడుల్లో భారీగా చేరిక.. గ్రేటర్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీల జాతర కొనసాగుతోంది. పదవీ విరమణ, పదోన్నతులు, బదిలీలతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి చతికిలపడి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు భరించలేక సర్కారు బడుల్లో తమ పిల్లలను పెద్ద ఎత్తున చేర్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతోపాటు విద్యా వలంటీర్లకు కూడా అనుమతి లభించకపోవడంతో ఉన్న ఉపాధ్యాయులపై పనిభారం పడుతోంది. రెండు మాధ్యమాల్లో.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించవచ్చని అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు చేసే అవకాశం ఉండడంతో నియామక పరీక్ష రెండు మాధ్యమాల్లో ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బీఎడ్ పూర్తి చేసినవారి సంఖ్యే అధికంగా ఉంది. ఆంగ్ల బోధనపై ప్రస్తుతం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మున్ముందు ఆంగ్లంలో బోధనను దృష్టిలో ఉంచుకుని.. కొత్తగా నియమించే ఉపాధ్యాయులను కూడా ఆ మాధ్యమం వారిని తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. మొత్తం పోస్టుల్లో ఆంగ్ల మాధ్యమం వారినే తీసుకుంటే తెలుగు మాధ్యమం అభ్యర్థులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో రెండు మాధ్యమాల్లో డీఎస్సీకి నిర్వహించే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. టెట్ కోసం.. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తే టీఆర్టీ రాయవచ్చని నిరీక్షిస్తున్నారు. డీఎస్సీకి ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా అయిదేళ్ల నుంచి టెట్ నిర్వహించలేదు. టెట్ పేపర్– 1, పేపర్– 2లో అర్హత సాధించినవారి కంటే టెట్ క్వాలిఫై కాని, 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సు చేసినవారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ నిర్వహించాలంటే కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇవ్వాల్సి ఉంటుంది. గత పద్ధతి ప్రకారం డీఈడీ చేసినవారు పేపర్– 1, బీఈడీ చదివినవారు పేపర్– 2 రాయడానికి అర్హులు. ఎన్సీఈఆర్టీ కొత్త మార్గదర్శకాల ప్రకారం బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పేపర్– 1, పేపర్– 2 రాయడానికి అర్హులు. ఈ మేరకు ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉత్తర్వులివ్వాల్సి ఉంది. -
TS: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అక్కడినుంచి చదవాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ప్రభుత్వం తీపి కబురు అందించడంతో వారిలో ఆశలు చిగురించాయి. ఉద్యోగాల భర్తీకి సర్కారు చేసిన ప్రకటన అభ్యర్థులకు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మరోసారి పోటీపరీక్షల అధ్యయన కేంద్రంగా మారింది. ఏళ్లకేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఊళ్లకు వెళ్లిన లక్షలాది మంది తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. కోచింగ్ సెంటర్లు, స్టడీహాళ్లు, పుస్తకాల దుకాణాలు కళకళలాడుతున్నాయి. నగరంలోని చిక్కడపల్లి, అశోక్‌నగర్, గాంధీనగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో సందడిగా మారాయి. మరోవైపు సుమారు 18 వేల పోలీసుల ఉద్యోగాల కోసం పోలీసుశాఖ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల శిక్షణకు దిల్సుఖ్నగర్, మలక్‌పేట్‌లలోని కోచింగ్ సెంటర్లకు అభ్యర్థుల తాకిడి పెరిగింది. పోలీసు, గ్రూప్–1 మొదలుకొని గ్రూప్–4 వరకు వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వాళ్లు శాస్త్రీయమైన పద్ధతిలో అధ్యయనం చేయాలని, ఏ పోటీ పరీక్షకైనా ఎలాంటి షార్ట్‌కట్ మెథడ్స్ ఉండబోవని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఉద్యోగ నియామకాలకు రెడీ.. సర్కారు అనుమతులివ్వగానే .. ఏ సెంటర్‌కు వెళ్తున్నారు... ఉద్యోగాల భర్తీపైన ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే కోచింగ్ సెంటర్లు తలుపులు బార్లా తెరిచాయి. మరోవైపు ఆన్లైన్ శిక్షణ సంస్థలు, యూట్యూబ్ కోచింగ్‌లు సైతం ముందుకొచ్చాయి. గ్రేటర్లో చిన్నవి, పెద్దవి కలిసి సుమారు 150కి పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు అంచనా. బాగా పేరున్న సంస్థల్లో గ్రూప్–1కు రూ.70 వేలు.. గ్రూప్ –4కు రూ.25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎస్సై, కానిస్టైబుల్ ఉద్యోగాలకు సైతం ఇదే స్థాయిలో డిమాండ్ ఉంది. ప్రభుత్వం భర్తీ చేయనున్న 80 వేల ఉద్యోగాల కోసం సుమారు 10 లక్షల మందికి పైగా పోటీ పడనున్నట్లు అంచనా. అభ్యర్థులు కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా కోచింగ్ నిర్వహిస్తున్న అనుభవం, ఆయా సెంటర్లలో గతంలో ఎలాంటి ఫలితాలు వెలువడ్డాయనే అంశాల ఆధారంగా ఈ ఎంపిక ఉండాలి. చదవండి: CM KCR: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ: సీఎం కేసీఆర్ ప్రకటన అక్కడినుంచి చదవాల్సిందే.. సాధారణంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రమే సీరియస్‌గా చదవడం మొదలెడతారు. దీంతో అప్పటికప్పుడు మార్కెట్లో లభించే గైడ్లు, ఇతర స్టడీ మెటీరియల్ పైన ఆధారపడుతారు. ప్రామాణికమైన కోచింగ్ కేంద్రాల నుంచి లభించే మెటీరియల్ మంచిదే. కానీ గ్రూప్ –1 నుంచి గ్రూపు–4 వరకు అన్ని పోటీపరీక్షలకు సొంతంగా మెటీరియల్ రూపొందించుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ స్టడీస్, గణితంపై పట్టు సాధించాలి. వివిధ సబ్జెక్టులలో పాఠ్యాంశాలను లోతుగా అధ్యయనం చేయడంతో పాటు ముఖ్యమైన అంశాలను స్వదస్తూరితో రాసుకోవాలి. దీంతో రాయడంలో వేగం, నైపుణ్యం పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సమకాలీన అంశాలపై ప్రిపేర్ కావాలి.. సమకాలీన అంశాలు, సాధారణ పరిజ్ఞానంపై పట్టు పెంచాలి. పోటీ పరీక్షలలో వచ్చే ప్రశ్నల తీరు మారింది. అభ్యర్థుల విస్తృతమైన, లోతైన అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగు కారణాలను ఇచ్చి అందులో ప్రధానమైన కారణమేంటని అడగవచ్చు. నాలుగింటిలో ఏది ప్రధానమో తేల్చుకోవాలంటే సమకాలీన ఘటనలు, పరిణామాలపై స్పష్టత తప్పనిసరి. కొంతకాలంగా ప్రశ్నల తీరు మారింది. అందుకనుగుణంగానే ప్రిపరేషన్ ఉండాలి. గందరగోళానికి గురికావొద్దు.. ఒక సబ్జెక్టుపై ఒకటి, రెండు ప్రామాణికమైన పుస్తకాలను మాత్రమే ఎంపికచేసుకొని లోతుగా అధ్యయనం చేయాలి. ఎస్సై ఉద్యోగాలు, గ్రూప్–1, గ్రూప్–2, వంటి పరీక్షల కోసం చదివేవాళ్లకు గణితం, రీజనింగ్, అరిథ్‌మెటిక్ వంటి అంశాల్లో శిక్షణ తప్పనిసరిగా అవసరం. – వి.వేణుగోపాల్, గణితశాస్త్ర నిపుణులు దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి ఏ పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే వాళ్లయినా సరే హడావుడిగా చదవకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రారంభించాలి. ఇప్పటికే చదువుతున్న వాళ్లు అధ్యయనానికి మరింత పదును పెట్టాలి, కొత్తగా ప్రారంభించేవాళ్లు చక్కటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఆందోళన వద్దు, కోచింగ్ సెంటర్ల ఎంపిక ఎంతో కీలకం. – కేవీఆర్, ఇంగ్లిష్ ఫ్యాకల్టీ -
టెక్ రెజ్యుమె ఎలా ఉండాలంటే..
ఇంజనీరింగ్ స్పెషల్ నేడు ఉద్యోగ సాధనలో రెజ్యుమె పాత్ర కీలకం. రెజ్యుమె ఏ మాత్రం సరిగా లేకున్నా రిక్రూటర్స్‌ను ఆకట్టుకోవడం కష్టం. దీంతోనే అభ్యర్థులపై ఒక అంచనాకు వచ్చేస్తాయి నియామక సంస్థలు. ఈ నేపథ్యంలో టెక్నికల్ ఉద్యోగాలకు ఎలాంటి రెజ్యుమెను రూపొందించుకోవాలో తెలుసుకుందాం.. అన్ని ఉద్యోగాలకు ఒకటే రె జ్యుమె సరికాదు కొలువు కావాలంటే దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా పంపాల్సింది.. రెజ్యుమె. ఇది రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్లోని రెజ్యుమె అన్ని రకాల కొలువులకు సరిపోదు. సాంకేతిక కొలువులకు సంబంధిత రెజ్యుమెను జతచేయాలి. ఇది టెక్ ఫ్రెండ్లీగా ఉండాలి. టెక్నాలజీలో మీ అర్హతలు, అనుభవం, నైపుణ్యాలను రిక్రూటర్‌కు సరిగ్గా తెలియజేయాలి. టెక్నాలజీ జాబ్స్‌పై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్ రెజ్యుమెపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. సాంకేతిక నైపుణ్యాలు టెక్నాలజీ రెజ్యుమె రూపకల్పనలో ఇతర విషయాల కంటే మీలోని టెక్నికల్ స్కిల్స్‌కే పెద్దపీట వేయాలి. వీటిని ప్రముఖంగా పేర్కొనాలి. హైరింగ్ మేనేజర్ మీ రెజ్యుమెను ఆసాంతం చదవలేరు. మొదట మీలోని సాంకేతిక నైపుణ్యాలనే పరిశీలిస్తారు. వాటిపట్ల సంతృప్తి చెందితేనే మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తారు. పని అనుభవాలు మీ పని అనుభవాలను క్లుప్తంగా మూడు లేదా నాలుగు లైన్లలో ప్రస్తావిస్తూ రెజ్యుమెను ప్రారంభించండి. తర్వాత వివిధ విభాగాల్లో మీ టెక్నికల్ స్కిల్స్‌ను విపులంగా పేర్కొనండి. ఉదాహరణకు.. ఆపరేటింగ్ సిస్టమ్స్: విండోస్, యూనిక్స్, లైనక్స్ లాంగ్వేజెస్: జావా, విజువల్ బేసిక్, సీ/సీ++, పెర్ల్ డేటాబేస్: ఒరాకిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ నెట్వర్కింగ్: టీసీపీ/ఐపీ, లాన్/వాన్. మీ ప్రొఫైల్‌కు వర్తించే ప్రోగ్రామ్స్/అప్లికేషన్లను మాత్రమే ప్రస్తావించండి. తెలియని వాటిని కూడా పేర్కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో పూర్తి ఆత్మవిశ్వాసంతో చర్చించగలిగే సాంకేతిక అంశాలనే రెజ్యుమెలో చేర్చండి. అంటే వాటిపై మీకు మంచి పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతారు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను కూడా పేర్కొనండి. కీలక పదాలు ఐటీ రెజ్యుమెకు సరిగ్గా నప్పే సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆయా పదాలు ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు.. యాక్టివేటెడ్, డిజైన్డ్, ఆర్గనైజ్డ్, అసిమిలేటెడ్, డెవలప్డ్, ఇనిషియేటెడ్, యుటిలైజ్డ్, డెమాన్స్ట్రేటెడ్, ఇన్స్టాల్డ్ వంటి పదాలను రెజ్యుమెలో సందర్భానుసారం ఉపయోగించాలి. జూనియర్, సీనియర్ జూనియర్, సీనియర్ ప్రొఫెషనల్స్ రెజ్యుమె కంటెంట్ వేర్వేరుగా ఉంటుంది. అనుభవజ్ఞులు, అనుభవం లేనివారి అర్హతలు, నైపుణ్యాలు ఒకేలా ఉండవు. ఈ భేదాన్ని గుర్తించాలి. తొలిసారిగా కెరీర్లో ప్రవేశించేవారు స్కిల్స్, ప్రాజెక్ట్‌లపై ఎక్కువ ఫోకస్ చేయాలి.