టెక్ రెజ్యుమె ఎలా ఉండాలంటే..
ఇంజనీరింగ్ స్పెషల్
నేడు ఉద్యోగ సాధనలో రెజ్యుమె పాత్ర కీలకం. రెజ్యుమె ఏ మాత్రం సరిగా లేకున్నా రిక్రూటర్స్‌ను ఆకట్టుకోవడం కష్టం. దీంతోనే అభ్యర్థులపై ఒక అంచనాకు వచ్చేస్తాయి నియామక సంస్థలు. ఈ నేపథ్యంలో టెక్నికల్ ఉద్యోగాలకు ఎలాంటి రెజ్యుమెను రూపొందించుకోవాలో తెలుసుకుందాం..
అన్ని ఉద్యోగాలకు ఒకటే రె జ్యుమె సరికాదు
కొలువు కావాలంటే దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా పంపాల్సింది.. రెజ్యుమె. ఇది రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్‌లోని రెజ్యుమె అన్ని రకాల కొలువులకు సరిపోదు. సాంకేతిక కొలువులకు సంబంధిత రెజ్యుమెను జతచేయాలి. ఇది టెక్ ఫ్రెండ్లీగా ఉండాలి. టెక్నాలజీలో మీ అర్హతలు, అనుభవం, నైపుణ్యాలను రిక్రూటర్‌కు సరిగ్గా తెలియజేయాలి. టెక్నాలజీ జాబ్స్‌పై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్ రెజ్యుమెపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి.
సాంకేతిక నైపుణ్యాలు
టెక్నాలజీ రెజ్యుమె రూపకల్పనలో ఇతర విషయాల కంటే మీలోని టెక్నికల్ స్కిల్స్‌కే పెద్దపీట వేయాలి. వీటిని ప్రముఖంగా పేర్కొనాలి. హైరింగ్ మేనేజర్ మీ రెజ్యుమెను ఆసాంతం చదవలేరు. మొదట మీలోని సాంకేతిక నైపుణ్యాలనే పరిశీలిస్తారు. వాటిపట్ల సంతృప్తి చెందితేనే మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తారు.
పని అనుభవాలు
మీ పని అనుభవాలను క్లుప్తంగా మూడు లేదా నాలుగు లైన్లలో ప్రస్తావిస్తూ రెజ్యుమెను ప్రారంభించండి. తర్వాత వివిధ విభాగాల్లో మీ టెక్నికల్ స్కిల్స్‌ను విపులంగా పేర్కొనండి. ఉదాహరణకు..
ఆపరేటింగ్ సిస్టమ్స్: విండోస్, యూనిక్స్, లైనక్స్
లాంగ్వేజెస్: జావా, విజువల్ బేసిక్, సీ/సీ++, పెర్ల్
డేటాబేస్: ఒరాకిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్
నెట్‌వర్కింగ్: టీసీపీ/ఐపీ, లాన్/వాన్.
మీ ప్రొఫైల్‌కు వర్తించే ప్రోగ్రామ్స్/అప్లికేషన్లను మాత్రమే ప్రస్తావించండి. తెలియని వాటిని కూడా పేర్కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో పూర్తి ఆత్మవిశ్వాసంతో చర్చించగలిగే సాంకేతిక అంశాలనే రెజ్యుమెలో చేర్చండి. అంటే వాటిపై మీకు మంచి పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతారు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను కూడా పేర్కొనండి.
కీలక పదాలు
ఐటీ రెజ్యుమెకు సరిగ్గా నప్పే సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆయా పదాలు ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు.. యాక్టివేటెడ్, డిజైన్డ్, ఆర్గనైజ్డ్, అసిమిలేటెడ్, డెవలప్డ్, ఇనిషియేటెడ్, యుటిలైజ్డ్, డెమాన్‌స్ట్రేటెడ్, ఇన్‌స్టాల్డ్ వంటి పదాలను రెజ్యుమెలో సందర్భానుసారం ఉపయోగించాలి.
జూనియర్, సీనియర్
జూనియర్, సీనియర్ ప్రొఫెషనల్స్ రెజ్యుమె కంటెంట్ వేర్వేరుగా ఉంటుంది. అనుభవజ్ఞులు, అనుభవం లేనివారి అర్హతలు, నైపుణ్యాలు ఒకేలా ఉండవు. ఈ భేదాన్ని గుర్తించాలి. తొలిసారిగా కెరీర్‌లో ప్రవేశించేవారు స్కిల్స్, ప్రాజెక్ట్‌లపై ఎక్కువ ఫోకస్ చేయాలి.