చాలెంజింగ్ కెరీర్‌కు.. మెరైన్ ఇంజనీరింగ్! | Challenging career in marine engineering ..! | Sakshi
Sakshi News home page

చాలెంజింగ్ కెరీర్‌కు.. మెరైన్ ఇంజనీరింగ్!

Published Fri, Jun 17 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

చాలెంజింగ్ కెరీర్‌కు.. మెరైన్ ఇంజనీరింగ్!

చాలెంజింగ్ కెరీర్‌కు.. మెరైన్ ఇంజనీరింగ్!

ఇంజనీరింగ్ స్పెషల్
ఇంజనీరింగ్ విభాగంలో చాలెంజింగ్ కెరీర్ కోరుకునే వారికి సరైన బ్రాంచ్.. మెరైన్ ఇంజనీరింగ్! ఇది ప్రధానంగా సముద్ర రవాణా, నౌకల తయారీ, వాటి నిర్వహణకు సంబంధించిన విభాగం. ప్రస్తుతం మెరైన్ ఇంజనీర్ల పని పరిధి విస్తరించింది. అంతర్జాతీయంగా ఎగుమతి, దిగుమతులకు ఎక్కువగా సముద్ర రవాణాను ఉపయోగిస్తుండటం, ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం సరకు రవాణా షిప్పుల ద్వారానే జరుగుతుండటంతో మెరైన్ ఇంజనీరింగ్ ఉజ్వల కెరీర్‌కు వేదికగా నిలుస్తోంది..
 
మెరైన్ ఇంజనీర్లు ఏం చేస్తారు?
మెరైన్ ఇంజనీర్ల విధులు కొద్దిగా రిస్క్‌తో కూడుకున్నవైనప్పటికీ.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, నేవిగేషన్‌లలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులభతరమయ్యాయి. ఇంజనీర్లకు నౌక ఆకృతి, దాని తయారీకి అవసరమైన పరికరాల ఎంపిక, వాటి అమరిక, పర్యవేక్షణ, నిర్వహణ, మరమ్మత్తులు తదితర విధులు ఉంటాయి.
 
నౌకకు సంబంధించిన ప్రధాన యంత్రాలైన డీజిల్ ఇంజన్లు, గ్యాస్ టర్బైన్లు, పంపులు, కంప్రెషర్లు, హీట్ ఎక్స్‌చేంజర్స్, హైడ్రాలిక్ మెషిన్స్, ఆటోమేషన్ అండ్ కంట్రోల్ పరికరాలు, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్స్ తదితరాల నిర్వహణ బాధ్యత పూర్తిగా మెరైన్ ఇంజనీర్లదే.
 
నౌకల డిజైన్, నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్చర్లతో కూడా కలిసి పని చేయాల్సి ఉంటుంది. కేవలం నౌకకు సంబంధించే కాకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు సైనికుల్లా స్పందించి, సామాన్యులను కాపాడటం కూడా మెరైన్ ఇంజనీర్ల అదనపు బాధ్యత. దీనికి తగిన విధంగా సన్నద్ధమై ఉండాలి.
 
కోర్సులు-వివరాలు
పదో తరగతి తర్వాత డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్‌లో చేరవచ్చు. ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పూర్తిచేసిన వారు బీఎస్సీ (నాటికల్ సైన్స్), బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆసక్తిని బట్టి మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు.
 
ప్రత్యేక విభాగాలు
మారిటైమ్ కామర్స్, మెరైన్ రిఫ్రిజిరేషన్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం, నేవిగేషన్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్‌మెంట్, మెరైన్ రిన్యువబుల్ ఎనర్జీ రీసెర్చ్, అండర్ వాటర్ వెహికల్ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్-కమ్యూనికేషన్ సిస్టమ్స్-ఎక్విప్‌మెంట్, ఆఫ్‌షోర్ ఎక్స్‌ట్రాక్టివ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్    (కేబుల్ లైయింగ్) వంటివి..
 
కెరీర్ వివరాలు
అనేక ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉన్న రంగం మెరైన్ ఇంజనీరింగ్. ఇండియన్ మర్చెంట్ నేవీ, నేవీతోపాటు నౌకా నిర్మాణ కంపెనీల్లో ఉద్యోగాలు అపారం. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి దేశీయ సంస్థలతో పాటు విదేశాల్లో అవకాశాలపై ఆసక్తి ఉన్నవారికి ది అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్, ఆంగ్లో ఈస్టెర్న్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, గ్రేట్ ఈస్టెర్న్ షిప్పింగ్ వంటి అంతర్జాతీయ కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
 
ఇంటర్నేషనల్ మారిటైమ్ అకాడమీ వంటి సంస్థలు మెరైన్ ఇంజనీరింగ్ పూర్తిచేసినవారిని జూనియర్ ఇంజనీర్లుగా నియమించుకుంటున్నాయి.
 
ప్రతిభ, మంచి పనితీరుతో ఐదారేళ్లలోనే చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదగవచ్చు. మరికొన్ని సంస్థలు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా మెరైన్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
 
వేతనాలు
ఇతర ఇంజనీరింగ్ విభాగాలతో పోల్చితే పోటీ తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మెరైన్ ఇంజనీర్లకు ప్రారంభంలోనే అధిక వేతనాలు అందుతున్నాయి. ఇందులో ఫిఫ్త్, ఫోర్త్, థర్డ్, సెకండ్, చీఫ్ ఇంజనీర్ అనే స్థాయిలు ఉంటాయి.  హోదాను బట్టి నెలకు కనీసం రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వేతనాలను అందుకోవచ్చు.
 
కోర్సులు అందిస్తున్న కొన్ని ప్రముఖ సంస్థలు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్, గోవా
 www.imsgoa.org
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్
 www.iitm.ac.in
ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ కోల్‌కతా క్యాంపస్  
 www.merical.ac.in
ఇంటర్నేషనల్ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్, గ్రేటర్ నోయిడా
 www.imi.edu.in
ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
 www.andhrauniversity.edu.in/engg
 
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల తర్వాత విద్యార్థులు ఎక్కువగా మెరైన్ ఇంజనీరింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మెరైన్ ఇంజనీర్లకు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పెద్ద కంపెనీలు ఆకర్షణీయ ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ రంగంలో నైపుణ్యం, అనుభవం ఉన్న వారికి కెరీర్ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.
- డా. బి.వి.అప్పారావు, ప్రొఫెసర్, మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్, ఆంధ్రా యూనివర్సిటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement