బ్రాంచ్ ఎంపికలో.. అభిరుచి
ఇంజనీరింగ్ స్పెషల్
జాతీయ స్థాయిలో ఐఐటీలు, నిట్‌లతోపాటు రాష్ట్ర స్థాయి కాలేజీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు భారీ కసరత్తు జరుగుతోంది. జేఈఈ మెయిన్ ఫలితాలు ఇప్పటికే వెలువడగా, తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ముగిసింది. తెలంగాణలో మే 15న ఎంసెట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టంతా ఇంజనీరింగ్‌లో బ్రాంచ్ సెలక్షన్ గురించే! ఈ నేపథ్యంలో బ్రాంచ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై నిపుణుల సలహాలు, సూచనలు..
1. తొలి ప్రాధాన్యం.. ఆసక్తి
సివిల్ ఇంజనీరింగ్ నుంచి సిరామిక్ టెక్నాలజీ వరకు.. ఐటీ కొలువుకు దారిచూపే కంప్యూటర్ సైన్స్.. కోర్ బ్రాంచ్‌లు, అప్‌కమింగ్ బ్రాంచ్‌లు.. ఇలా పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు! బ్రాంచ్‌లు ఎన్ని ఉన్నా.. విద్యార్థులు మాత్రం తమ వ్యక్తిగత అభిరుచికి తగ్గ బ్రాంచ్‌నే ఎంచుకోవాలన్నది నిపుణుల సూచన. తాము అప్పటివరకు అకడమిక్‌గా మంచి ఆసక్తి కనబర్చిన సబ్జెక్ట్‌లను ఇందుకు ఉపకరణాలుగా మలచుకోవాలి. ఎందుకంటే.. సబ్జెక్టుపై ఆసక్తి ఉంటేనే అకడమిక్‌గా రాణించడం సాధ్యమవుతుంది.
మ్యాథమెటిక్స్‌లో అల్గారిథమ్స్, స్టాటిస్టికల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు ప్రోగ్రామింగ్‌లో ప్రతిభ కనబర్చగలరు. ఇలాంటి విద్యార్థులు సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ వంటి బ్రాంచ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. డ్రాయింగ్, డిజైనింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ వంటి బ్రాంచ్‌లు సరిపోతాయి.
2. ‘భవిష్యత్తు’ బేరీజు
బ్రాంచ్ ఎంపికలో ఆసక్తితోపాటు భవిష్యత్తులో లభించే కెరీర్ అవకాశాలపైనా దృష్టిపెట్టాలి. కొన్ని బ్రాంచ్‌లకు మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మరికొన్ని బ్రాంచ్‌లు మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు సీఎస్‌ఈ ద్వారా అవకాశాలు లభించే సాఫ్ట్‌వేర్ రంగాన్ని పరిగణిస్తే ఈ రంగం ఒడిదుడుకులకు లోనవుతుంది. భవిష్యత్తు అంచనాలు తెలుసుకునేందుకు అసోచామ్, ఫిక్కీ వంటి సంస్థల సర్వేల నివేదికలను పరిశీలించొచ్చు.
3. ఉన్నత విద్య
బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. ఆయా బ్రాంచ్ ద్వారా లభించే ఉన్నత విద్య.. వాటిని పూర్తి చేశాక లభించే కెరీర్ అవకాశాలపైనా దృష్టిపెట్టాలి. ఉదాహరణకు ఈఈఈ బ్రాంచ్‌ను పరిగణిస్తే బీటెక్ ఈఈఈతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో నాలెడ్జ్ లభిస్తుంది. కాని ఈఈఈకి సంబంధించి జాబ్ మార్కెట్ పరంగా అందుబాటులో ఉన్న ప్రత్యేక విభాగాల్లో జాబ్స్ కోసం ఎంటెక్ స్థాయిలో నైపుణ్యాలు పొందాలి. ఉదా: మైక్రో చిప్స్, మెమొరీ చిప్స్ తయారు చేసే పలు ఎలక్ట్రానిక్ సంస్థల్లో ఉన్నత కొలువులు పొందాలంటే నానో టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ పూర్తిచేయాలి.
4. ఆటిట్యూడ్ కూడా ముఖ్యమే
బ్రాంచ్ ఎంపికలో ఆసక్తితోపాటు విద్యార్థి వ్యక్తిగత దృక్పథం కూడా కీలకం. బ్రాంచ్ ద్వారా ఉత్తీర్ణత లభించే ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకుంటే.. కొన్ని రంగాల్లో (ఉదాహరణకు.. సివిల్, మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తదితర) ఓర్పు, సహనం, శ్రమించే తత్వం, ఫీల్డ్ వర్క్‌కు ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని రంగాల్లో (సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఐటీ సంస్థల్లో) రాణించాలంటే.. బృంద నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌తోనే సాధ్యం. విద్యార్థులు ఆయా బ్రాంచ్‌ల ద్వారా లభించే ఉద్యోగాల నేచర్ ఆఫ్ ది జాబ్, అందుకు తగ్గ దృక్పథం తనకు ఉందా లేదా అనేది కూడా పరిశీలించుకోవాలి. బ్రాంచ్ ఎంపికలో పరిగణించాల్సిన మరో అంశం.. నిరంతరం నేర్చుకునే తత్వం! కారణం.. నిత్యం కొత్త మార్పులు జరిగే సాఫ్ట్‌వేర్ వంటి రంగాల్లో రాణించేందుకు అప్‌డేట్ అవడం చాలా అవసరం.
5. అనుబంధ బ్రాంచ్‌లపైనా
విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచ్‌లో సీటు లభించే అవకాశాలు తక్కువగా ఉంటే.. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ఒక బ్రాంచ్‌కు అనుబంధంగా ఎన్నో కొత్త బ్రాంచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సీఎస్‌ఈకి అనుబంధంగా ఐటీ; ఈసీఈకి అనుబంధంగా ఈటీఎం (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం మేనేజ్‌మెంట్); మెకానికల్‌కు అనుబంధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వంటివి.
బ్రాంచ్ ముఖ్యమా.. కాలేజ్ ప్రధానమా
బ్రాంచ్ విషయంలో స్పష్టత లభించాక ఆ బ్రాంచ్‌కు సంబంధించి అకడమిక్‌గా పేరున్న కళాశాలలను అన్వేషించడం అవసరం. ఆ కాలేజ్‌లకు ఉన్న అకడెమిక్ రికార్డ్, ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ తదితరాల ఆధారంగా కాలేజీల జాబితా రూపొందించుకోవాలి. ఆయా కళాశాలలకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించాలి. ఆ క్రమంలో కొన్నిసార్లు బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా? లేదా కాలేజ్ /ఇన్‌స్టిట్యూట్‌కు ప్రాధాన్యమివ్వాలా? అనే ప్రశ్న ఎదురవుతుంది. నూటికి 75 శాతం బ్రాంచ్‌కే ప్రాధాన్యమివ్వాలి అనేది నిపుణుల సలహా.
క్రేజ్ కంటే... ఇష్టానికి ప్రాధాన్యం
ప్రస్తుతం విద్యార్థుల్లో అధిక శాతం మంది జాబ్ మార్కెట్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బ్రాంచ్‌లు ఎంపిక చేసుకుంటున్నారు. కానీ ఇది కొంతమేరకే ఫలితం ఇస్తుంది. కాబట్టి క్రేజ్ కంటే వ్యక్తిగత ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తిగత ఆసక్తి ఉంటే బ్రాంచ్ ఏదైనా భవిష్యత్తు అవకాశాలు పుష్కలం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆసక్తి గల బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు మారాల్సి వస్తే విద్యార్థులు తమ మైండ్ సెట్‌ను కూడా అందుకు అనుగుణంగా మార్చుకోవాలి.
- ప్రొఫెసర్ బి.చెన్నకేశవ రావు, ప్రిన్సిపాల్, సీబీఐటీ
ప్లేస్‌మెంట్సే ప్రధానం కాదు
విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలో భవిష్యత్తు ప్లేస్‌మెంట్స్‌నే ప్రధానంగా భావించకూడదు. ముందుగా నచ్చిన బ్రాంచ్‌ను ఎంపిక చేసుకుని దాని ద్వారా లభించే అవకాశాలు, వాటిని అందిపుచ్చుకునే మార్గాల గురించి అన్వేషణ సాగించాలి. ప్లేస్‌మెంట్స్ కోణంలోనే బ్రాంచ్‌లను ఎంపిక చేసుకుంటే ఇబ్బందికి గురవుతారు. నచ్చిన బ్రాంచ్‌లో సీటు రాకపోతే అనుబంధ బ్రాంచ్‌లపై ముందు నుంచే దృష్టిపెట్టి వాటిల్లో చేరేందుకు కృషి చేయాలి.
- ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్, నిట్-వరంగల్