ఖాళీలు 85 వేలకు పైనే..
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల విభజన అనంతరం దాదాపు 85వేలకుపైగా ఖాళీలను ప్రభు త్వం గుర్తించినట్టు సమాచారం. అందులో 65వేలకుపైగా పోస్టుల భర్తీకి అనుమతించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తయి.. ఎక్కడి ఉద్యోగులు అక్కడికి వెళ్లాక పోస్టులపై పూర్తి స్పష్టత రానుందని పేర్కొంటున్నాయి.
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలోనైనా సర్కారీ కొలువుల భాగ్యం ఉంటుందా? గతేడాది చివర్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా నోటిఫికేషన్లు వస్తాయా? ఏవైనా చిక్కులు, వివాదాలు తలెత్తుతాయా?.. నాలుగేళ్లుగా సర్కారీ కొలువుల కోసం ఎదురుచూస్తున్న లక్షలామందిని తొలిచేస్తున్న ప్రశ్నలివి. అయితే నిరుద్యోగులకు కొత్త సంవత్సరంలో కచ్చితంగా తీపి కబురు అందుతుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ జనవరి 20 నాటికి పూర్తయి, ఖాళీ పోస్టులపై స్పష్టత రానుందని.. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.
సీఎం హామీ ఇచ్చి ఏడాది
‘‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తాం. వివిధ శాఖల్లో సుమారు 50వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సదరు ఖాళీలను గుర్తించి భర్తీకి చర్యలు తీసుకుంటారు’’అని సీఎం కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13న ప్రకటించారు. తొలుత అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని, తద్వారా ఏర్పడే కొత్త ఖాళీలను సైతం భర్తీ చేయా లని అధికారులను ఆదేశించారు. అయితే.. ఉద్యో గుల పదోన్నతుల ప్రక్రియ ముగిసినా నియామక ప్రకటనలు వెలువడలేదు.
రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం.. జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ల వారీగా పోస్టుల విభజన, ఆయా పోస్టులకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యాక కొత్త నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. ఇప్పటి వరకు అది తేలలేదు. మరోవైపు సీఎం హామీ ఇచ్చి ఏడాది గడిచిపోవడంతో నిరుద్యోగులు నిరాశలో మునిగిపోయారు. చాలా మందికి ఉద్యోగ అర్హత వయోపరిమితి దాటిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కోసం ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేలకు చివరి అంకానికి..
కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. కొత్త జిల్లా కేడర్లకు కేటాయింపులు పూర్తికాగా.. ఉద్యో గుల నుంచి అభ్యంతరాలు, స్పౌజ్ కేటగిరీ కింద ఒకేచోటికి బదిలీల కోసం దరఖాస్తులు స్వీకరణ జరుగుతోంది. మరోవైపు జోనల్, మల్టీజోనల్ కేడర్ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపు సైతం చివరి దశకు చేరుకుంది.
వైద్యారోగ్యశాఖ, పలు సంక్షేమ శాఖలు మినహా మిగతా అన్నిశాఖల్లో జోనల్, మల్టీజోనల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుందని, తర్వాత అభ్యంతరాలు, స్పౌజ్ దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. జనవరి 20 నాటికి మొత్తంగా ఉద్యోగుల కేటాయింపు ముగుస్తుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment