సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో కొత్త కొలువుల భర్తీ ఆలస్యం కానుంది. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుతో సామాజిక వర్గాల వారీగా ఉద్యోగ కేటాయింపుల్లో మార్పులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది. ఇప్పటికే పావువంతు కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వగా.. మిగతా ఉద్యోగాలకు సంబంధించి అనుమతుల జారీ వేగవంతం అయింది.
సంబంధిత ప్రభుత్వ విభాగాలు కూడా ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలు తయారు చేస్తున్నా యి. కాగా, ప్రస్తుతం ఆరుశాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రిజర్వేషన్లు అక్టోబర్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం నోటిఫికేషన్ల దశలో ఉన్న పలు ఉద్యోగాలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో బ్రేక్ పడినట్లైంది.
కొత్త ప్రతిపాదనలు తప్పనిసరి..
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలు కాగా, మిగతా కేటగిరీలో గురుకుల కొలువులు, టీచర్ ఉద్యోగాలే ఉన్నా యి. పోలీస్ కొలువులకు సంబంధించిన ప్రకటనలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాల బోర్డు దాదాపు విడుదల చేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన గ్రూప్–1 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువడగా.. ఇంజనీరింగ్ కేటగిరీలో కూడా పలు పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. వైద్య ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను కూడా తెలంగాణ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు జారీ చేసింది.
ఇక అధిక సంఖ్యలో ఉన్న గురుకుల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం అనుమతించిన మిగతా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సంబంధిత నియామక సంస్థలు చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఈ సమయంలో రిజర్వేషన్ల పెంపు ఉత్తర్వులు రావడంతో కొత్తగా వెలువడాల్సిన నోటిఫికేషన్లు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాల్సి ఉండటంతో మార్పు లు, చేర్పులకు సమయం పడుతుంది.
పాత నోటిఫికేషన్లకు ఓకే..
ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లను కొనసాగించి నియామకాలు పూర్తి చేసే వీలుండగా.. కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్ల విషయంలో మాత్రం 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లతో ఉద్యోగాలను భర్తీ చేయా ల్సి ఉండటంతో ఆ దిశగా ప్రభుత్వ శాఖలు చర్యలు మొదలుపెట్టాల్సి ఉంది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల ప్రకటనలకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనల్లో ఎస్టీలకు 10 శాతం కోటా కేటాయించాలి. అందుకు సమయం పడుతుందని, దీంతో కొత్త నోటిఫికేషన్లు కాస్త ఆలస్యం అవుతాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment