Tribal reservations
-
గిరిజనులను మోసగిస్తున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: గిరిజన రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున పెంచలేమంటూ కేంద్రమంత్రి అర్జున్ ముండా పార్లమెంటు వేది కగా ప్రకటించడం దుర్మార్గమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి 2015లో చెల్లప్ప కమిషన్ నివేదిక ఇవ్వగా, 2016లో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం పంపిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంగళవారం సత్యవతి మీడియాతో మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉండాలంటే తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల తీర్మానం అందలేదని చెప్పిన కేంద్రమంత్రులు.. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతున్నారన్నారు. గిరిజనులను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లంబాడాలను గిరిజనుల జాబితా నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు దీక్షలకు పురిగొల్పుతున్నారని, దీనిపై బీజేపీ స్పష్టతనివ్వాలన్నారు. గిరిజనుల పట్ల బీజేపీ ధోరణి మారకుంటే ఆ పార్టీ నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా గిరిజనుల బతుకులు మారాలంటే బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరముందని సత్యవతి పేర్కొన్నారు. -
తెలంగాణలో కొత్త కొలువుల భర్తీ కాస్త జాప్యం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో కొత్త కొలువుల భర్తీ ఆలస్యం కానుంది. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుతో సామాజిక వర్గాల వారీగా ఉద్యోగ కేటాయింపుల్లో మార్పులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది. ఇప్పటికే పావువంతు కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వగా.. మిగతా ఉద్యోగాలకు సంబంధించి అనుమతుల జారీ వేగవంతం అయింది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు కూడా ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలు తయారు చేస్తున్నా యి. కాగా, ప్రస్తుతం ఆరుశాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రిజర్వేషన్లు అక్టోబర్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం నోటిఫికేషన్ల దశలో ఉన్న పలు ఉద్యోగాలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో బ్రేక్ పడినట్లైంది. కొత్త ప్రతిపాదనలు తప్పనిసరి.. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలు కాగా, మిగతా కేటగిరీలో గురుకుల కొలువులు, టీచర్ ఉద్యోగాలే ఉన్నా యి. పోలీస్ కొలువులకు సంబంధించిన ప్రకటనలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాల బోర్డు దాదాపు విడుదల చేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన గ్రూప్–1 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువడగా.. ఇంజనీరింగ్ కేటగిరీలో కూడా పలు పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. వైద్య ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను కూడా తెలంగాణ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసింది. ఇక అధిక సంఖ్యలో ఉన్న గురుకుల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం అనుమతించిన మిగతా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సంబంధిత నియామక సంస్థలు చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఈ సమయంలో రిజర్వేషన్ల పెంపు ఉత్తర్వులు రావడంతో కొత్తగా వెలువడాల్సిన నోటిఫికేషన్లు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాల్సి ఉండటంతో మార్పు లు, చేర్పులకు సమయం పడుతుంది. పాత నోటిఫికేషన్లకు ఓకే.. ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లను కొనసాగించి నియామకాలు పూర్తి చేసే వీలుండగా.. కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్ల విషయంలో మాత్రం 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లతో ఉద్యోగాలను భర్తీ చేయా ల్సి ఉండటంతో ఆ దిశగా ప్రభుత్వ శాఖలు చర్యలు మొదలుపెట్టాల్సి ఉంది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల ప్రకటనలకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనల్లో ఎస్టీలకు 10 శాతం కోటా కేటాయించాలి. అందుకు సమయం పడుతుందని, దీంతో కొత్త నోటిఫికేషన్లు కాస్త ఆలస్యం అవుతాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
గిరిజనులకు 10% కోటా.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు శుభవార్త. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు (జీవో నం.33) జారీ చేశారు. రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం హామీ నేపథ్యంలో.. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్బంగా సెప్టెంబర్ 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ‘గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా వారం రోజుల్లో జీవో విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ..మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావా? లేక దానితో ఉరి వేసుకుంటావా ఆలోచించుకో..’ అని ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు ఐదారు శాతంగా ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ వచ్చాక 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఏడేళ్లు గడిచినా రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడాన్ని ఈ సభలో సీఎం కేసీఆర్ తీవ్ర స్థా యిలో తప్పుబట్టా రు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఐదు నిమిషాల్లో జీవో జారీ చేసుకుంటా మన్నారు. సీఎం హామీ ఇచ్చి వారం రోజులు గడిచిన నేపథ్యంలో.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన త ర్వాత రాష్ట్ర ప్రభు త్వం ఆఘమేఘాల మీద రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేసింది. తమిళనాడులో 28 ఏళ్లుగా 69 శాతం రిజర్వేషన్లు అమలవుతుండటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాతిపదికగా జీవోలో చూపింది. 66 నుంచి 70 శాతానికి రిజర్వేషన్లు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మొత్తం రిజర్వేషన్లు 70 శాతానికి పెరిగాయి. అగ్రకుల పేదల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ గతేడాది మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో 65 జారీ చేయడంతో అప్పట్లో మొత్తం రిజర్వేషన్ల శాతం 66 శాతానికి పెరిగింది. తాజాగా ఎస్టీ కోటాను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో 70 శాతానికి చేరింది. -
‘10 శాతం కోటా’.. వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి విసిగి వేసారిపోయాం. ఇకపై విసిగిపోం. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా వారం రోజుల్లో జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ.. మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావా? లేక దానితో ఉరి వేసుకుంటవా ఆలోచించుకో..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపుతామని.. పట్టాలు ఇచ్చి రైతు బంధు పథకం అమలు చేస్తామని చెప్పారు. భూమిలేని, ఉపాధి లేని గిరిజనుల కోసం ‘గిరిజన బంధు’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ వివరాలు సీఎం కేసీఆర్ మాటల్లోనే.. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. ‘‘జాతి, కులం, మతం, వర్గం అనే విభేదాలు లేకుండా 58 ఏళ్లు ఐక్యంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు ఐదారు శాతంగా ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ వచ్చాక పది శాతానికి పెంచాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఏడేళ్లు దాటిపోయింది. దీనిపై ప్రధాని మోదీని, ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చి విభజన రాజకీయాలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడుగుతున్నా.. ఏం అడ్డుపడుతోందని గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఆపుతున్నారు? రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుదల చేస్తాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రధాని మోదీని తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి అభ్యర్తిస్తున్నా. గిరిజన రిజర్వేషన్ల బిల్లును మీరు ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిస్తే ఆపకుండా ఆమోదం ఇస్తారు. రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే ప్రతిబంధన ఎక్కడా లేదు. పక్కరాష్ట్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే కేంద్రం ఏడో షెడ్యూల్లో చేర్చింది. అదే తరహాలో తెలంగాణ న్యాయపరమైన హక్కుకు కేంద్రానికి ఉన్న ప్రతిబంధకమేంటో చెప్పాలి. కేంద్రం సులభంగా పరిష్కరించే విషయాల్లో కూడా తాత్సారం చేస్తూ ప్రజలను గాలికి వదిలేస్తోంది. ప్రైవేటీకరణ పేరిట లక్షల కోట్ల రూపాయలను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెడుతోంది. పోడు భూములకు పట్టాలు.. గిరిజన బంధు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూమి దక్కేలా కమిటీ ఏర్పాటు చేసి జీవో 140 కూడా ఇచ్చాం. కమిటీల నుంచి నివేదికలు అందిన వెంటనే పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు పథకం అమలు చేస్తాం. సంపద పెంచడం.. అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. పోడు భూమి పట్టాల పంపిణీ తర్వాత భూమి లేని గిరిజనులను గుర్తిస్తాం. దళిత బంధు తరహాలో భూమి, భుక్తి, ఆధారం లేని గిరిజన బిడ్డల కోసం వెసులుబాటు చూసుకుని నా చేతుల మీదుగా ‘గిరిజన బంధు’ పథకాన్ని ప్రారంభిస్తాం. మేధోమధన వేదికలుగా ఆదివాసీ, బంజారా భవన్లు గిరిజనుల సమస్యల పరిష్కారానికి బంజారా, ఆదివాసీ భవన్లు వేదికలుగా మారాలి. రాష్ట్రంలో ‘మా తాండాలో మా రాజ్యం’ నినాదాన్ని ఆచరణలోకి తేవడంతో 3 వేలకు పైగా గిరిజన గూడేలు, తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న పంచాయతీలకు ప్రోత్సాహం, ఉచిత విద్యుత్, గురుకులాలు, రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్, టీ ప్రైడ్ కింద గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజన తండాలు, చెంచు, ఆదివాసీ గూడేల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది. రూ.300 కోట్లతో ప్రతి గిరిజన ఆవాసానికి త్రీఫేజ్ విద్యుత్, రూ.200 కోట్లు విద్యుత్ బకాయిలు మాఫీ, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రోడ్లు, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజనుల సంస్కృతి, భాష, జీవన శైలి కాపాడేలా జాతరలు, పండుగలను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహిస్తున్నాం. గిరిజన గురుకులాల ద్వారా ప్రతిభ చూపుతున్న విద్యార్థులు.. బంగారు తెలంగాణ బిడ్డలుగా, భారత ప్రతినిధులుగా ఎదగాలి. గిరిజన బిడ్డలు చదుకునేందుకు మరిన్ని గురుకుల సంస్థలు ఏర్పాటు దిశగా చర్చలు జరుగుతున్నాయి..’’ అని కేసీఆర్ తెలిపారు. ఇన్నాళ్లూ పార్టీలు ఓటుబ్యాంకుగానే చూశాయి: సత్యవతి రాథోడ్ గతంలో రాజకీయ పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే తప్ప మనుషులుగా చూడలేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్‌ను తమ జాతి ఎప్పటికి మరిచిపోదని చెప్పారు. ఇక జల్, జంగల్, జమీన్ నినాదాన్ని నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగ కాంతారావు అన్నారు. ఈ ఆత్మీయ సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతా.. ‘‘తెలంగాణ సమాజం ఐక్యత, ప్రగతి పరుగులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు. దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు, సంకుచిత స్వార్థంతో వస్తున్నారు. మతపిచ్చి కార్చిచ్చులా అంటుకుంటే ఎటూ కాకుండా పోతాం. మీ బిడ్డగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. తెలంగాణలో కల్లోలం రానీయొద్దు. ఈ సమాజం సర్వమానవ సౌభ్రాతృత్వంతో పురోగమించే దిశగా ప్రజల పక్షాన నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా. ప్రజల రాజ్యం, రైతుల రాజ్యం కోసం తెలంగాణ జాతిగా మనం భారత జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు కదలాలి’’ రాష్ట్రవ్యాప్తంగా సమైక్యత ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాల యాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో సైతం ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు. ఇదీ చదవండి: విమోచనమే నిజమైన స్వాతంత్య్ర దినం -
ఎస్టీ రిజర్వేషన్లపై అబద్ధం చెప్పారు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడుపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ పెంపు అంశంపై ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటును పక్కదోవ పట్టించేందుకు బిశ్వేశ్వర్ వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందించారు. దీంతోపాటు బుధవారం సభా కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్లకార్డులతో వెల్‌లో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 6.8% నుంచి 10శాతానికి పెంచుతూ 2017 ఏప్రిల్ 16న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర హోంశాఖ, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు పంపిన విషయాన్ని నోటీసులో గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఈ నెల 21న ఒక ప్రశ్నకు బిశ్వేశ్వర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం పార్లమెంటును పక్కదోవ పట్టించేదిలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను బర్తరఫ్ చేసి కేంద్రప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాలోత్ కవిత మాట్లాడారు. అబద్ధం చెప్పారు ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశంపై తెలంగాణ నుంచి బిల్లు వచ్చిన విషయం తెలిసినప్పటికీ, బిశ్వేశ్వర్ అబద్ధం చెప్పారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ఆరోపించారు. తెలంగాణ నుంచి ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశంపై బిల్లు తమకు వచ్చిందని మూడేళ్ల క్రితం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిందన్నారు. ‘ఐదేళ్ళుగా ఈ బిల్లుకు సంబంధించి అనేకసార్లు కేంద్రమంతులకు వినతిపత్రాలు ఇచ్చాం. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు రాయడంతోపాటు భేటీ అయిన సందర్భంలో చర్చించారు. అయినప్పటికీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణపై బిశ్వేశ్వర్ అక్కసు వెళ్లగక్కారు’అని నామా చెప్పారు. ఆ నలుగురు ఏంచేస్తున్నారు: ప్రభాకర్ రెడ్డి లోక్‌సభలో ఉన్న తెలంగాణకు చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు ప్రతీరోజు కేసీఆర్‌ను తిట్టడమే తప్ప, తెలంగాణకు ఏం చేస్తారో చెప్పరని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బిశ్వేశ్వర్ సమాధానంతో తెలంగాణ గిరిజనులు కలత చెందారని ఎంపీ మాలోత్ కవిత చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, వెంకటేశ్ నేత, రంజిత్‌రెడ్డి, రాములు, పసునూరి దయాకర్, లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
గిరిజన రిజర్వేషన్లపై మొదటి సంతకమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న 9.9 శాతం ఓట్ల మేరకు గిరిజనులకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని, తాను అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లపై మొదటి సంతకం పెడతానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ఏఐసీసీ ఆది వాసీ వైస్‌చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గిరిజనుల పట్ల రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కనీసం రాష్ట్రంలో 1/70 చట్టం కూడా అమలు కావడం లేదని ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలే కరులతో మాట్లాడుతూ జీవో 317 పేరుతో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోకి గిరిజనేతర ఉద్యోగులను తెస్తున్నారని, గిరిజన ద్రోహి తరహాలో ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అటవీ హక్కుల చట్టాన్ని అమల్లోకి తెచ్చి లక్షలాది మంది గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తే తెలంగాణ ఏర్పాటైన తర్వా త ఒక్క ఎకరం కూడా గిరిజనులకు భూపం పిణీ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజనులు కాంగ్రెస్‌ను నమ్మడం లేదని మంత్రి సత్యవతి రాథోడ్ అనడం సరైంది కాదన్నారు. -
ముఖ్యమంత్రిపై ఆరోపణలు అర్థం లేనివి
ఎంపీ సీతారాంనాయక్ సాక్షి, హైదరాబాద్: గిరిజను ల రిజర్వేషన్లు, తండాలను పంచాయతీలుగా చేయడం లేదని సీఎం కేసీఆర్‌పై కొం దరు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ సీతారాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల సమస్యలపై శనివా రం సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఆజ్మీర చందూలాల్ నిర్వహిం చిన సమావేశానికి పలువురు గిరిజన ఎంపీలు, నేతలు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు తండాలకు నిధులు మంజూరు చేసింది ఏ ప్రభుత్వమో ఓ సారి గుర్తుచేసుకోవాలన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనం కావడంతో గిరిజనుల శాతం 9.34 నుంచి 9.08కు పడిపోయిందన్నారు. -
జనాభా దామాషా పద్ధతిన గిరిజన రిజర్వేషన్లు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ప్రకటనలకు ముందే జనాభా దామాషా పద్ధతిన గిరిజన రిజర్వేషన్లు ప్రకటించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం గిరిజనులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గిరిజన రిజర్వేషన్ల సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతిజ్ఞసభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ 12 నెలలుగా ఇస్తున్న ఏ హామీ సవ్యంగా అమలు కావటం లేదని విమర్శించారు. ప్రజాగాయని విమలక్క మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లు సాధించే వరకు ఐక్యంగా పోరాడుదామన్నారు. రాచకొండగుట్టలను పర్యాటక ప్రాంతంగా మారిస్తే తండాలు న ష్టపోతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, గిరిజన రిజర్వేషన్ల సాధన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్యే సాయం బాబురావు, వివిధ రాష్ట్రాల నుం చి వచ్చిన గిరిజన ప్రతినిధులు వి.మురుగేశన్, జాన్ ఎఫ్. కార్శింగ్, కె.ఎ.గుణ శేఖరన్, ఎ. అన్నమలై, ఎన్.మోహన్, కె.వివేక్ వినాయక్ పాల్గొన్నారు.