జనాభా దామాషా పద్ధతిన గిరిజన రిజర్వేషన్లు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ప్రకటనలకు ముందే జనాభా దామాషా పద్ధతిన గిరిజన రిజర్వేషన్లు ప్రకటించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం గిరిజనులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గిరిజన రిజర్వేషన్ల సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతిజ్ఞసభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ 12 నెలలుగా ఇస్తున్న ఏ హామీ సవ్యంగా అమలు కావటం లేదని విమర్శించారు.
ప్రజాగాయని విమలక్క మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లు సాధించే వరకు ఐక్యంగా పోరాడుదామన్నారు. రాచకొండగుట్టలను పర్యాటక ప్రాంతంగా మారిస్తే తండాలు న ష్టపోతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, గిరిజన రిజర్వేషన్ల సాధన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్యే సాయం బాబురావు, వివిధ రాష్ట్రాల నుం చి వచ్చిన గిరిజన ప్రతినిధులు వి.మురుగేశన్, జాన్ ఎఫ్. కార్‌శింగ్, కె.ఎ.గుణ శేఖరన్, ఎ. అన్నమలై, ఎన్.మోహన్, కె.వివేక్ వినాయక్ పాల్గొన్నారు.