సాక్షి, హైదరాబాద్: గిరిజన రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున పెంచలేమంటూ కేంద్రమంత్రి అర్జున్ ముండా పార్లమెంటు వేది కగా ప్రకటించడం దుర్మార్గమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి 2015లో చెల్లప్ప కమిషన్ నివేదిక ఇవ్వగా, 2016లో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం పంపిన విషయాన్ని గుర్తు చేశారు.
టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంగళవారం సత్యవతి మీడియాతో మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉండాలంటే తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల తీర్మానం అందలేదని చెప్పిన కేంద్రమంత్రులు.. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతున్నారన్నారు.
గిరిజనులను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లంబాడాలను గిరిజనుల జాబితా నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు దీక్షలకు పురిగొల్పుతున్నారని, దీనిపై బీజేపీ స్పష్టతనివ్వాలన్నారు. గిరిజనుల పట్ల బీజేపీ ధోరణి మారకుంటే ఆ పార్టీ నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా గిరిజనుల బతుకులు మారాలంటే బీఆర్‌ఎస్ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరముందని సత్యవతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment