‘10 శాతం కోటా’.. వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు | CM KCR Says Facilitate 10 Per Cent Reservation For Tribal In Week | Sakshi
Sakshi News home page

‘10 శాతం కోటా’.. వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు

Published Sun, Sep 18 2022 2:12 AM | Last Updated on Sun, Sep 18 2022 7:36 AM

CM KCR Says Facilitate 10 Per Cent Reservation For Tribal In Week - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి విసిగి వేసారిపోయాం. ఇకపై విసిగిపోం. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా వారం రోజుల్లో జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ.. మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావా? లేక దానితో ఉరి వేసుకుంటవా ఆలోచించుకో..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపుతామని.. పట్టాలు ఇచ్చి రైతు బంధు పథకం అమలు చేస్తామని చెప్పారు. భూమిలేని, ఉపాధి లేని గిరిజనుల కోసం ‘గిరిజన బంధు’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. శనివారం ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ వివరాలు సీఎం కేసీఆర్‌ మాటల్లోనే.. 

అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. 
‘‘జాతి, కులం, మతం, వర్గం అనే విభేదాలు లేకుండా 58 ఏళ్లు ఐక్యంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు ఐదారు శాతంగా ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ వచ్చాక పది శాతానికి పెంచాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఏడేళ్లు దాటిపోయింది. దీనిపై ప్రధాని మోదీని, ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చి విభజన రాజకీయాలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను అడుగుతున్నా.. ఏం అడ్డుపడుతోందని గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఆపుతున్నారు? రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుదల చేస్తాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రధాని మోదీని తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి అభ్యర్తిస్తున్నా. గిరిజన రిజర్వేషన్ల బిల్లును మీరు ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిస్తే ఆపకుండా ఆమోదం ఇస్తారు. రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే ప్రతిబంధన ఎక్కడా లేదు. పక్కరాష్ట్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే కేంద్రం ఏడో షెడ్యూల్లో చేర్చింది. అదే తరహాలో తెలంగాణ న్యాయపరమైన హక్కుకు కేంద్రానికి ఉన్న ప్రతిబంధకమేంటో చెప్పాలి. కేంద్రం సులభంగా పరిష్కరించే విషయాల్లో కూడా తాత్సారం చేస్తూ ప్రజలను గాలికి వదిలేస్తోంది. ప్రైవేటీకరణ పేరిట లక్షల కోట్ల రూపాయలను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెడుతోంది. 

శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్‌

పోడు భూములకు పట్టాలు.. గిరిజన బంధు 
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూమి దక్కేలా కమిటీ ఏర్పాటు చేసి జీవో 140 కూడా ఇచ్చాం. కమిటీల నుంచి నివేదికలు అందిన వెంటనే పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు పథకం అమలు చేస్తాం. సంపద పెంచడం.. అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. పోడు భూమి పట్టాల పంపిణీ తర్వాత భూమి లేని గిరిజనులను గుర్తిస్తాం. దళిత బంధు తరహాలో భూమి, భుక్తి, ఆధారం లేని గిరిజన బిడ్డల కోసం వెసులుబాటు చూసుకుని నా చేతుల మీదుగా ‘గిరిజన బంధు’ పథకాన్ని ప్రారంభిస్తాం. 

మేధోమధన వేదికలుగా ఆదివాసీ, బంజారా భవన్‌లు 
గిరిజనుల సమస్యల పరిష్కారానికి బంజారా, ఆదివాసీ భవన్‌లు వేదికలుగా మారాలి. రాష్ట్రంలో ‘మా తాండాలో మా రాజ్యం’ నినాదాన్ని ఆచరణలోకి తేవడంతో 3 వేలకు పైగా గిరిజన గూడేలు, తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న పంచాయతీలకు ప్రోత్సాహం, ఉచిత విద్యుత్, గురుకులాలు, రూ.20 లక్షల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్, టీ ప్రైడ్‌ కింద గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజన తండాలు, చెంచు, ఆదివాసీ గూడేల్లో మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది. రూ.300 కోట్లతో ప్రతి గిరిజన ఆవాసానికి త్రీఫేజ్‌ విద్యుత్, రూ.200 కోట్లు విద్యుత్‌ బకాయిలు మాఫీ, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రోడ్లు, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజనుల సంస్కృతి, భాష, జీవన శైలి కాపాడేలా జాతరలు, పండుగలను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహిస్తున్నాం. గిరిజన గురుకులాల ద్వారా ప్రతిభ చూపుతున్న విద్యార్థులు.. బంగారు తెలంగాణ బిడ్డలుగా, భారత ప్రతినిధులుగా ఎదగాలి. గిరిజన బిడ్డలు చదుకునేందుకు మరిన్ని గురుకుల సంస్థలు ఏర్పాటు దిశగా చర్చలు జరుగుతున్నాయి..’’ అని కేసీఆర్‌ తెలిపారు. 

ఇన్నాళ్లూ పార్టీలు ఓటుబ్యాంకుగానే చూశాయి: సత్యవతి రాథోడ్‌ 
గతంలో రాజకీయ పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే తప్ప మనుషులుగా చూడలేదని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కేసీఆర్‌ను తమ జాతి ఎప్పటికి మరిచిపోదని చెప్పారు. ఇక జల్, జంగల్, జమీన్‌ నినాదాన్ని నిజం చేసిన నాయకుడు కేసీఆర్‌ అని ప్రభుత్వ విప్‌ రేగ కాంతారావు అన్నారు. ఈ ఆత్మీయ సభలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతా.. 
‘‘తెలంగాణ సమాజం ఐక్యత, ప్రగతి పరుగులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు. దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు, సంకుచిత స్వార్థంతో వస్తున్నారు. మతపిచ్చి కార్చిచ్చులా అంటుకుంటే ఎటూ కాకుండా పోతాం. మీ బిడ్డగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. తెలంగాణలో కల్లోలం రానీయొద్దు. ఈ సమాజం సర్వమానవ సౌభ్రాతృత్వంతో పురోగమించే దిశగా ప్రజల పక్షాన నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా. ప్రజల రాజ్యం, రైతుల రాజ్యం కోసం తెలంగాణ జాతిగా మనం భారత జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు కదలాలి’’

రాష్ట్రవ్యాప్తంగా సమైక్యత ఉత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాల యాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో సైతం ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు.

ఇదీ చదవండి: విమోచనమే నిజమైన స్వాతంత్య్ర దినం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement