unityday
-
‘10 శాతం కోటా’.. వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి విసిగి వేసారిపోయాం. ఇకపై విసిగిపోం. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా వారం రోజుల్లో జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ.. మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావా? లేక దానితో ఉరి వేసుకుంటవా ఆలోచించుకో..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపుతామని.. పట్టాలు ఇచ్చి రైతు బంధు పథకం అమలు చేస్తామని చెప్పారు. భూమిలేని, ఉపాధి లేని గిరిజనుల కోసం ‘గిరిజన బంధు’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ వివరాలు సీఎం కేసీఆర్ మాటల్లోనే.. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. ‘‘జాతి, కులం, మతం, వర్గం అనే విభేదాలు లేకుండా 58 ఏళ్లు ఐక్యంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు ఐదారు శాతంగా ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ వచ్చాక పది శాతానికి పెంచాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఏడేళ్లు దాటిపోయింది. దీనిపై ప్రధాని మోదీని, ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చి విభజన రాజకీయాలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడుగుతున్నా.. ఏం అడ్డుపడుతోందని గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఆపుతున్నారు? రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుదల చేస్తాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రధాని మోదీని తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి అభ్యర్తిస్తున్నా. గిరిజన రిజర్వేషన్ల బిల్లును మీరు ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిస్తే ఆపకుండా ఆమోదం ఇస్తారు. రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే ప్రతిబంధన ఎక్కడా లేదు. పక్కరాష్ట్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే కేంద్రం ఏడో షెడ్యూల్లో చేర్చింది. అదే తరహాలో తెలంగాణ న్యాయపరమైన హక్కుకు కేంద్రానికి ఉన్న ప్రతిబంధకమేంటో చెప్పాలి. కేంద్రం సులభంగా పరిష్కరించే విషయాల్లో కూడా తాత్సారం చేస్తూ ప్రజలను గాలికి వదిలేస్తోంది. ప్రైవేటీకరణ పేరిట లక్షల కోట్ల రూపాయలను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెడుతోంది. పోడు భూములకు పట్టాలు.. గిరిజన బంధు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూమి దక్కేలా కమిటీ ఏర్పాటు చేసి జీవో 140 కూడా ఇచ్చాం. కమిటీల నుంచి నివేదికలు అందిన వెంటనే పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు పథకం అమలు చేస్తాం. సంపద పెంచడం.. అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. పోడు భూమి పట్టాల పంపిణీ తర్వాత భూమి లేని గిరిజనులను గుర్తిస్తాం. దళిత బంధు తరహాలో భూమి, భుక్తి, ఆధారం లేని గిరిజన బిడ్డల కోసం వెసులుబాటు చూసుకుని నా చేతుల మీదుగా ‘గిరిజన బంధు’ పథకాన్ని ప్రారంభిస్తాం. మేధోమధన వేదికలుగా ఆదివాసీ, బంజారా భవన్లు గిరిజనుల సమస్యల పరిష్కారానికి బంజారా, ఆదివాసీ భవన్లు వేదికలుగా మారాలి. రాష్ట్రంలో ‘మా తాండాలో మా రాజ్యం’ నినాదాన్ని ఆచరణలోకి తేవడంతో 3 వేలకు పైగా గిరిజన గూడేలు, తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న పంచాయతీలకు ప్రోత్సాహం, ఉచిత విద్యుత్, గురుకులాలు, రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్, టీ ప్రైడ్ కింద గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజన తండాలు, చెంచు, ఆదివాసీ గూడేల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది. రూ.300 కోట్లతో ప్రతి గిరిజన ఆవాసానికి త్రీఫేజ్ విద్యుత్, రూ.200 కోట్లు విద్యుత్ బకాయిలు మాఫీ, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రోడ్లు, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజనుల సంస్కృతి, భాష, జీవన శైలి కాపాడేలా జాతరలు, పండుగలను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహిస్తున్నాం. గిరిజన గురుకులాల ద్వారా ప్రతిభ చూపుతున్న విద్యార్థులు.. బంగారు తెలంగాణ బిడ్డలుగా, భారత ప్రతినిధులుగా ఎదగాలి. గిరిజన బిడ్డలు చదుకునేందుకు మరిన్ని గురుకుల సంస్థలు ఏర్పాటు దిశగా చర్చలు జరుగుతున్నాయి..’’ అని కేసీఆర్ తెలిపారు. ఇన్నాళ్లూ పార్టీలు ఓటుబ్యాంకుగానే చూశాయి: సత్యవతి రాథోడ్ గతంలో రాజకీయ పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే తప్ప మనుషులుగా చూడలేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్‌ను తమ జాతి ఎప్పటికి మరిచిపోదని చెప్పారు. ఇక జల్, జంగల్, జమీన్ నినాదాన్ని నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగ కాంతారావు అన్నారు. ఈ ఆత్మీయ సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతా.. ‘‘తెలంగాణ సమాజం ఐక్యత, ప్రగతి పరుగులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు. దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు, సంకుచిత స్వార్థంతో వస్తున్నారు. మతపిచ్చి కార్చిచ్చులా అంటుకుంటే ఎటూ కాకుండా పోతాం. మీ బిడ్డగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. తెలంగాణలో కల్లోలం రానీయొద్దు. ఈ సమాజం సర్వమానవ సౌభ్రాతృత్వంతో పురోగమించే దిశగా ప్రజల పక్షాన నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా. ప్రజల రాజ్యం, రైతుల రాజ్యం కోసం తెలంగాణ జాతిగా మనం భారత జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు కదలాలి’’ రాష్ట్రవ్యాప్తంగా సమైక్యత ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాల యాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో సైతం ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు. ఇదీ చదవండి: విమోచనమే నిజమైన స్వాతంత్య్ర దినం -
తెలంగాణ నిజానిజాలు గమనిస్తోంది!
ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? తెలంగాణ తెగదెంపుల సంగ్రామంలో తెగించి స్థిర పడిన తెలంగాణ తనను తాను చూసుకుంటోంది. రేపటి భవిష్యత్తుపై గంపెడు ఆశలతో కలలు కంటోంది. మార్పును ప్రతినిత్యం కోరుకునే తెలంగాణ ఊహించని మార్పులతో ఊహకందనంత వేగంతో అభివృద్ధి చెందుతోంది. విషాదాల కొలిమి, విప్లవాల పొలి కేకలు, ఫెళఫెళ కూలిపడ్డ ఆధిపత్య అహంకారాలు... పాఠ్యాంశాలుగా మారిన తెలంగాణ ఇప్పుడు నిజానిజాల నిగ్గు తేల్చు కుంటోంది. ఎవరిది విద్రోహమో, ఏది విలీనమో, ఏది బల ప్రయోగమో, గాయాలు ఎక్కడ తగిలాయో, గేయాలై ఎక్కడ పలికాయో, సున్నితపు ఐకమత్యపు తెలంగాణ తీగలను ఎవరు తెంచ చూశారో... మళ్లీ అన్నింటినీ కలిపి జాతీయ ఐకమత్య మహానదిగా మన తెలంగాణను ఎవరు మారుస్తున్నారో... అంతా తెలంగాణ బిడ్డలకు తెలుసు. దయచేసి మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాత గాయాల కట్లు విప్పి కారం చల్లే పనులు ఎవరూ చేయకండి. తరతరాల సామాజిక తాత్విక సహజత్వ జీవ జలపాతం తెలంగాణతనం. అబ్బురపరిచిన ఆశ్చర్యాల నుంచీ, నిప్పుల వర్షాల నుంచీ... సకల జనుల ప్రశాంత వెండి వెన్నెల సిరుల పందిరిగా మారిన తెలంగాణను సంరక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. మానవీయ సంస్కృతికి పట్టుగొమ్మయిన తెలంగాణ అత్యున్నత మానవ సమాజ నిర్మాణం వైపు పయనించమంటోంది. ఈ కుళ్ళు కులసంకెళ్లను తెంచమంటోంది. కమ్ముకొస్తున్న మత మబ్బుల్ని చెదరగొట్టమంటోంది. ఒకనాడు భూమి, భుక్తి, విముక్తి అంటూ నినదించి ముందుకు సాగిన తెలంగాణ ఇప్పుడు ప్రతి మనిషినీ సంపదగా మార్చి ప్రపంచానికి ఒక నూతన సందేశం ఇవ్వమంటోంది. అన్నార్తులు, అనాథలు కానరాని సమాజ నిర్మాణం చేయమంటోంది. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని విత్తనాలుగా చల్లి మహోన్నత మానవీయ పాఠంగా దేశాన్నే తీర్చిదిద్దుకుందాం అంటోంది. జాతీయ సమైక్యత దినోత్సవ మహాసందేశంగా జాతిగీతమై మోగ మంటుంది. తరతరాల వారసత్వ చరిత్రకు ఎవరు పేటెంట్ దారులు కాదని తెలంగాణ పదేపదే చెబుతోంది. ప్రపంచానికి పిడికెడు అన్నం పెడుతున్న రైతు భారతానికి పట్టాభిషేకం చేయమంటోంది తెలంగాణ. వ్యవసాయాన్ని పరిశ్రమలుగా మార్చి, పండించిన పంటలకు రైతు కూలీలనే అత్యా ధునిక వ్యవసాయ పరిశ్రమల యజమానులను చేయమంటోంది. సాటి మనుషుల్ని కుల మతాల పేరుతో వెంటాడుతున్న ఆటవిక సంస్కృతిని దరిదాపుల్లోకి రానీయకుండా మానవీయ మహా కోటను నిర్మించుకుంది తెలంగాణ. ఆధిపత్య కుల అహంకార పదఘట్టనల కింద పశువుగా ప్రవర్తించే దుర్మార్గ సంస్కృతిని దరిదాపులకు రాకుండా సరిహద్దు సైనికునిగా పహారా కాస్తోంది తెలంగాణ. ఆదివాసీ గిరిజన వికాసంలో భాగంగా ‘మా గూడెంలో మా రాజ్యం’, ‘మా తండాలో మా రాజ్యం’ అన్న కలలను నిజం చేస్తోంది తెలంగాణ. పేదలైన ముస్లింలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మైనారిటీ పిల్లలకు ఒక్క తెలంగాణ లోనే 1160 గురుకులాలను పెట్టి కార్పొరేట్ స్థాయి చదువు అందిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ వేలాది గురుకులాలు రావాలని తలుస్తోంది తెలంగాణ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును నూతన సచివాలయానికి పెట్టి ఎద ఎదలో రాజ్యాంగ రక్షణ స్ఫూర్తిని చాటింది. దేశ పార్ల మెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టమని నినదిస్తున్న ఆచరణవాది తెలంగాణ. సస్యశ్యామల దేశంలో క్షామాలు, నిరుద్యోగ రక్కసులు, రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని నడుంబిగించింది తెలంగాణ. నెర్రెలు బాసిన కరువు భూముల్లోకి గంగమ్మను రప్పించేందుకు కాళేశ్వరాన్ని కట్టుకొని జలకళతో నిండింది తెలంగాణ. ఇంటింటికీ ‘మిషన్ భగీరథ’నిచ్చి గొంతు తడిపిన తెలంగాణ... దేశానికి ఆ పథకాన్ని ఎందుకు అందించలేమని పయనమవుతోంది. దేశంలో జరగాల్సింది జాతీయ సమైక్యతా ఉత్సవాలు కానీ విద్వేష ఉత్సవాలు కాదని గొంతెత్తి పిలుస్తోంది తెలంగాణ. పగలు సెగలులేని, పరమత ద్వేషాలు లేని దేశమే సకల సంపదలతో తులతూగుతుందని ఆచరణాత్మకంగా తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. దళితుల ఆత్మగౌరవ జెండాగా నిలిచిన ‘దళిత బంధు’ పథకాన్ని పెట్టి వాళ్లను ఉత్పత్తి శక్తులుగా తీర్చి దిద్దుతున్న తెలంగాణ దేశంలో దళితులంతా ఇట్లనే వర్ధిల్లాలని తలంచుతోంది. బహుజనులకు ఆత్మగౌరవ భవనాలనిచ్చి ఆయా కులాల సామాజిక ఎదుగుదలకు ఇంతగా కృషిచేసిన రాష్ట్రం దేశంలో మరోటి లేదంటోంది తెలంగాణ. ఇప్పుడు అన్ని రంగా లలో పురోభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణను చూస్తున్నాం. వర్ధిల్లు వీర తెలంగాణ ! వర్ధిల్లు సామరస్య తెలంగాణ! జూలూరీ గౌరిశంకర్ (ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి) -
కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మూడు రోజులు ఘనంగా వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సంస్థానం.. అధికారికంగా స్వతంత్ర భారత దేశంలో విలీనం అయ్యింది 1948 సెప్టెంబర్ 17వ తేదీన. ఈ తేదీపై రాజకీయంగానూ ఎన్నో ఏళ్ల నుంచి చర్చ నడుస్తోంది కూడా. తాజాగా.. శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అంతేకాదు.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టి.. ఈ ఏడాది సెప్టెంబర్17 నాటికి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇదీ చదవండి: సెప్టెంబర్ 17 గురించి అమిత్ షాకి ఒవైసీ లేఖ -
17న భారతజాతి ఐక్యతదినం
కొత్తకోట రూరల్ : ఒకే నాగరికత, సంస్కృతి గల భారతజాతి తొలిసారిగా ఒకే ప్రభుత్వం, ఒకే పతాకం కిందకు వచ్చిన రోజుగా సెప్టెంబర్ 17ను రాష్ట ప్రభుత్వం అధికారిక పర్వదినంగా జరుపుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అ«ధికారికంగా చేపట్టాలని నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యవారి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, మండల నాయకులు మాధవరెడ్డి, దాసరి నరేష్, శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, సాయిరాం కూర్చున్నారు. వారికి మద్దతుగా టీడీపీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగన్నయాదవ్, ఉమామహేశ్వర్‌రెడ్డి, నాయకులు సత్యం యాదవ్, బాల్‌రాజు, తిరుపతయ్య మద్దతు తెలిపారు. రతంగ్‌పాండ్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశం కోసం రాచరికానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అనేక మంది చేసిన పోరాటానికి ఫలం అన్నారు. నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్ రాష్ట్ర విమోచనకు, మతానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. అనంతరం బీజేపీ మహిళామోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మాజారెడ్డి ముగింపు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.