మీడియాతో మాట్లాడుతున్న కె.కేశవరావు. చిత్రంలో మాలోత్ కవిత, నామా, ప్రభాకర్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడుపై లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ పెంపు అంశంపై ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటును పక్కదోవ పట్టించేందుకు బిశ్వేశ్వర్ వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందించారు. దీంతోపాటు బుధవారం సభా కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్లకార్డులతో వెల్‌లో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన టీఆర్‌ఎస్ ఎంపీలు అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.
తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 6.8% నుంచి 10శాతానికి పెంచుతూ 2017 ఏప్రిల్ 16న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర హోంశాఖ, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు పంపిన విషయాన్ని నోటీసులో గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఈ నెల 21న ఒక ప్రశ్నకు బిశ్వేశ్వర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం పార్లమెంటును పక్కదోవ పట్టించేదిలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను బర్తరఫ్ చేసి కేంద్రప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్ ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాలోత్ కవిత మాట్లాడారు.
అబద్ధం చెప్పారు
ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశంపై తెలంగాణ నుంచి బిల్లు వచ్చిన విషయం తెలిసినప్పటికీ, బిశ్వేశ్వర్ అబద్ధం చెప్పారని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ఆరోపించారు. తెలంగాణ నుంచి ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశంపై బిల్లు తమకు వచ్చిందని మూడేళ్ల క్రితం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిందన్నారు. ‘ఐదేళ్ళుగా ఈ బిల్లుకు సంబంధించి అనేకసార్లు కేంద్రమంతులకు వినతిపత్రాలు ఇచ్చాం. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు రాయడంతోపాటు భేటీ అయిన సందర్భంలో చర్చించారు. అయినప్పటికీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణపై బిశ్వేశ్వర్ అక్కసు వెళ్లగక్కారు’అని నామా చెప్పారు.
ఆ నలుగురు ఏంచేస్తున్నారు: ప్రభాకర్ రెడ్డి
లోక్‌సభలో ఉన్న తెలంగాణకు చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు ప్రతీరోజు కేసీఆర్‌ను తిట్టడమే తప్ప, తెలంగాణకు ఏం చేస్తారో చెప్పరని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బిశ్వేశ్వర్ సమాధానంతో తెలంగాణ గిరిజనులు కలత చెందారని ఎంపీ మాలోత్ కవిత చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, వెంకటేశ్ నేత, రంజిత్‌రెడ్డి, రాములు, పసునూరి దయాకర్, లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment