ఖార్తూమ్: సూడాన్ సైన్యం, పారామిలటరీ విభాగమైన తక్షణ మద్దతు దళం(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్)కు మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో నెలకొన్న కల్లోల పరిస్థితులు అక్కడి భారతీయులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇరు వర్గాల కాల్పులు, బాంబుల మోతతో ఉన్నచోటు నుంచి కనీసం బయటకురాలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం అర్థిస్తున్నారు. దీంతో దౌత్యమార్గంలో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాల్పుల విరమణకు అమెరికా వంటి దేశాలు పిలుపునిచ్చినా కొద్ది గంటలకే అది విఫలమై గడిచిన 24 గంటల్లోనే మరో 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో పరిస్థితి చేయి దాటేలోపే భారతీయులను వెనక్కితీసుకురావాలనే భారత్ కృతనిశ్చయంతో ఉందని భారత విదేశాంగ శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కర్ణాటక సంప్రదాయ మూలిక వైద్యం చేసే 31 మంది ‘హక్కీ పిక్కీ’ గిరిజనులుసహా 60 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకున్నారని వారి గురించి పట్టించుకోండని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కోరడం, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం తెల్సిందే. సూడాన్ ఘర్షణల్లో ఇప్పటిదాకా దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఖార్తూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక మాజీ భారతీయ సైనికుడు ఆల్బర్ట్ అగస్టీన్ చనిపోయారు. 1,800 మందికిపైగా గాయాలపాలయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
అమెరికా, బ్రిటన్, సౌదీ, యూఏఈతో మంతనాలు
సూడాన్‌తో సంబంధాలు నెరుపుతున్న అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలతో భారత విదేశాంగ శాఖ మంతనాలు కొనసాగిస్తోంది. క్షేత్రస్థాయిలో భారతీయుల రక్షణకు సాయపడతామని జైశంకర్‌కు సౌదీ, యూఏఈ విదేశాంగ మంత్రులు హామీ ఇచ్చారు. సూడాన్‌లో భారతీయ ఎంబసీ అక్కడి భారతీయులతో వాట్సాప్ గ్రూప్‌లుసహా పలు మార్గాల్లో టచ్‌లోనే ఉంది. ‘ మా నాన్న వ్యాపార నిమిత్తం అక్కడికెళ్లి శనివారమే ముంబైకి రావాల్సింది. సూడాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా చివరి నిమిషంలో విమానం రద్దయిందని చెప్పి అక్కడి అధికారులు ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లగొట్టారు.
హోటల్‌కు కాలినడకనే వెళ్లారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఏంటో తెలీడం లేదు’ అని 63 ఏళ్ల వ్యక్తి కూతురు మానసి సేథ్ వాపోయారు. ‘అక్కడంతా ఆటవిక రాజ్యమే. ప్రాణాలకు విలువే లేదు. స్వయంగా సైనికులే లూటీ చేస్తూ అపహరణలకు పాల్పడుతున్నారు. ఖర్తూమ్ హోటల్‌లో నా భర్త చిక్కుకుపోయారు. బాంబుల దాడి భయంతో హోటల్‌లోని అతిథులంతా బేస్‌మెంట్‌లో దాక్కున్నారు’ అని మరో మహిళ పీటీఐకి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీధుల్లో రాకపోకలు కూడా కష్టమేనని భారత విదేశాంగ శాఖ చెబుతోందంటే అక్కడి పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.
150 ఏళ్ల క్రితమే సూడాన్‌కు వలసలు
ప్రస్తుతం సూడాన్‌లో దాదాపు 4,000 మంది భారతీయులున్నారు. వీరిలో 1,200 మంది శాశ్వత స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వీరి కుటుంబాలు 150 ఏళ్ల క్రితమే అక్కడికి వలసవెళ్లాయి. ఇక మిగతావారు సూడాన్ ఆర్థిక రంగం వంటి పలు వృత్తుల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. కొందరు ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలు, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు.
ఎవరీ హక్కీ పిక్కీలు ?
గుజరాత్ నుంచి శతాబ్దాల క్రితం కర్ణాటకకు హక్కి పిక్కి అనే గిరిజన తెగ ప్రజలు వలసవచ్చారు. అడవుల్లో ఉంటూ మూలికా వైద్యం చేస్తారు. వీరికి సొంత భాష ‘వగ్రీబూలి’తోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వచ్చు. పేద ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఖరీదైన ఇంగ్లిష్ మందులు, వైద్యం పొందగల స్తోమత ఉన్న జనాభా చాలా తక్కువ. అందుకే స్థానికులు చవక వైద్యం వైపు మొగ్గుచూపుతారు. అందుకే వారికి తమ సంప్రదాయ వైద్యం చేసేందుకు సుదూరంలోని సూడాన్‌కు ఈ కర్ణాటక గిరిజనులు చేరుకున్నారు.
ఎందుకీ గొడవ ?
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని అబ్దల్లా హమ్దోక్‌ను గత ఏడాది సైన్యం, ఆర్‌ఎస్‌ఎఫ్ గద్దెదించి పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. తాజాగా ఆర్‌ఎస్‌ఎఫ్‌ను సైన్యంలో విలీనం చేయాలని సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దుల్ ఫతాహ్ అల్–బుర్హాన్ ప్రతిపాదించగా ఆర్‌ఎస్‌ఎఫ్ చీఫ్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు సాయుధ విభాగాల మధ్య అగ్గి రాజుకుంది.
Comments
Please login to add a commentAdd a comment