న్యూఢిల్లీ: హింస, అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరి’ మొదలైంది. భారత నౌకాదళానికి చెందిన ‘ఐఎన్‌ఎస్ సుమేధ’ నౌక తొలి విడతగా 278 భారతీయులతో మంగళవారం సూడాన్ పోర్టు నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు బయలుదేరింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ మేరకు ట్వీట్ చేశారు. వారిని భారత్ చేర్చేందుకు జెడ్డాలో రెండు విమానాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.
ఆక్రమణలో సూడాన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్
మరోవైపు.. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని నేషనల్ హెల్త్ ల్యాబ్ ఆక్రమణకు గురైందని ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. వైరి పక్షాలైన ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్)లో ఒకరు ఈ ల్యాబ్‌ను ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. 12 రోజులుగా ఆగని ఆధిపత్య పోరుతో సామాన్యులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న వేళ ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూడాన్ ప్రతినిధి డాక్టర్ నీమా సయీద్ అబిడ్ అన్నారు. ల్యాబ్‌లో కలరా, మీజిల్స్, పోలియో తదితర వ్యాధికారక వైరస్‌లు, బ్యాక్టీరియాలున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ల్యాబ్‌కు అతి సమీపంలోనే ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్ భీకర పోరు సాగిస్తున్నాయి. సూడాన్‌లోని మూడో వంతు అంటే 1.6 కోట్ల మందికి తక్షణం సాయం అవసరమని ఐరాస అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment