mutual attacks
-
Sudan: సూడాన్‌లో కల్లోల పరిస్థితులు.. చిక్కుకుపోయిన మనోళ్లు
ఖార్తూమ్: సూడాన్ సైన్యం, పారామిలటరీ విభాగమైన తక్షణ మద్దతు దళం(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్)కు మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో నెలకొన్న కల్లోల పరిస్థితులు అక్కడి భారతీయులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇరు వర్గాల కాల్పులు, బాంబుల మోతతో ఉన్నచోటు నుంచి కనీసం బయటకురాలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం అర్థిస్తున్నారు. దీంతో దౌత్యమార్గంలో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాల్పుల విరమణకు అమెరికా వంటి దేశాలు పిలుపునిచ్చినా కొద్ది గంటలకే అది విఫలమై గడిచిన 24 గంటల్లోనే మరో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి చేయి దాటేలోపే భారతీయులను వెనక్కితీసుకురావాలనే భారత్ కృతనిశ్చయంతో ఉందని భారత విదేశాంగ శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కర్ణాటక సంప్రదాయ మూలిక వైద్యం చేసే 31 మంది ‘హక్కీ పిక్కీ’ గిరిజనులుసహా 60 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకున్నారని వారి గురించి పట్టించుకోండని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కోరడం, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం తెల్సిందే. సూడాన్ ఘర్షణల్లో ఇప్పటిదాకా దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఖార్తూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక మాజీ భారతీయ సైనికుడు ఆల్బర్ట్ అగస్టీన్ చనిపోయారు. 1,800 మందికిపైగా గాయాలపాలయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, సౌదీ, యూఏఈతో మంతనాలు సూడాన్‌తో సంబంధాలు నెరుపుతున్న అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలతో భారత విదేశాంగ శాఖ మంతనాలు కొనసాగిస్తోంది. క్షేత్రస్థాయిలో భారతీయుల రక్షణకు సాయపడతామని జైశంకర్‌కు సౌదీ, యూఏఈ విదేశాంగ మంత్రులు హామీ ఇచ్చారు. సూడాన్‌లో భారతీయ ఎంబసీ అక్కడి భారతీయులతో వాట్సాప్ గ్రూప్లుసహా పలు మార్గాల్లో టచ్‌లోనే ఉంది. ‘ మా నాన్న వ్యాపార నిమిత్తం అక్కడికెళ్లి శనివారమే ముంబైకి రావాల్సింది. సూడాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా చివరి నిమిషంలో విమానం రద్దయిందని చెప్పి అక్కడి అధికారులు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లగొట్టారు. హోటల్‌కు కాలినడకనే వెళ్లారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఏంటో తెలీడం లేదు’ అని 63 ఏళ్ల వ్యక్తి కూతురు మానసి సేథ్ వాపోయారు. ‘అక్కడంతా ఆటవిక రాజ్యమే. ప్రాణాలకు విలువే లేదు. స్వయంగా సైనికులే లూటీ చేస్తూ అపహరణలకు పాల్పడుతున్నారు. ఖర్తూమ్ హోటల్లో నా భర్త చిక్కుకుపోయారు. బాంబుల దాడి భయంతో హోటల్లోని అతిథులంతా బేస్మెంట్లో దాక్కున్నారు’ అని మరో మహిళ పీటీఐకి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీధుల్లో రాకపోకలు కూడా కష్టమేనని భారత విదేశాంగ శాఖ చెబుతోందంటే అక్కడి పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. 150 ఏళ్ల క్రితమే సూడాన్‌కు వలసలు ప్రస్తుతం సూడాన్‌లో దాదాపు 4,000 మంది భారతీయులున్నారు. వీరిలో 1,200 మంది శాశ్వత స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వీరి కుటుంబాలు 150 ఏళ్ల క్రితమే అక్కడికి వలసవెళ్లాయి. ఇక మిగతావారు సూడాన్ ఆర్థిక రంగం వంటి పలు వృత్తుల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. కొందరు ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలు, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఎవరీ హక్కీ పిక్కీలు ? గుజరాత్ నుంచి శతాబ్దాల క్రితం కర్ణాటకకు హక్కి పిక్కి అనే గిరిజన తెగ ప్రజలు వలసవచ్చారు. అడవుల్లో ఉంటూ మూలికా వైద్యం చేస్తారు. వీరికి సొంత భాష ‘వగ్రీబూలి’తోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వచ్చు. పేద ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఖరీదైన ఇంగ్లిష్ మందులు, వైద్యం పొందగల స్తోమత ఉన్న జనాభా చాలా తక్కువ. అందుకే స్థానికులు చవక వైద్యం వైపు మొగ్గుచూపుతారు. అందుకే వారికి తమ సంప్రదాయ వైద్యం చేసేందుకు సుదూరంలోని సూడాన్‌కు ఈ కర్ణాటక గిరిజనులు చేరుకున్నారు. ఎందుకీ గొడవ ? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని అబ్దల్లా హమ్దోక్ను గత ఏడాది సైన్యం, ఆర్ఎస్ఎఫ్ గద్దెదించి పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. తాజాగా ఆర్ఎస్ఎఫ్ను సైన్యంలో విలీనం చేయాలని సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దుల్ ఫతాహ్ అల్–బుర్హాన్ ప్రతిపాదించగా ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు సాయుధ విభాగాల మధ్య అగ్గి రాజుకుంది. -
తృణమూల్‌లో ట్వీట్ చిచ్చు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో ‘వన్ పర్సన్, వన్ పోస్ట్’ ట్వీట్ దుమారం రేపుతోంది. దీనిపై పార్టీలో నాయకులు కొందరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అభిషేక్ బెనర్జీకి అనుకూలురైన నాయకులు ఈ పోస్టును సమర్ధిస్తూ మాట్లాడగా, పార్టీలో పాత కాపులు మాత్రం ఇదంతా క్రమశిక్షణా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐటీసీలో ఒక వ్యక్తికి ఒక పదవిని తాము సమర్థ్ధిస్తున్నామని అభిషేక్ సన్నిహితులు అదితి, ఆకాశ్ ట్వీట్ చేశారు. చాలా రోజులుగా ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలంటూ అభిషేక్ సూచిస్తున్నారు. అయితే పార్టీలో కొందరు సీనియర్లు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్‌పై కోల్‌కతా మేయర్‌గా, కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న ఫిర్హాద్ హకీమ్ స్పందించారు. నాయకత్వాన్ని సంప్రదించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు. టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా తన అకౌంట్నుంచి ఎవరో ఇదే ఈ్వట్ చేశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించినప్పటినుంచి పార్టీలో నేతల మధ్య వివాదాలు మొదలయ్యాయి. అంతర్గత విభేదాలపై నేడు భేటీ పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల పరిష్కారంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శనివారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. మమత నివాసంలో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. భేటీకి కేవలం ఆరుగురు నేతలకు పిలుపు అందించినట్లు సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, సెక్రెటరీ జనరల్ పార్థా చటర్జీ, పార్టీ బెంగాల్ విభాగం అధ్యక్షులు సుబ్రతా బక్షీ, మంత్రులు ఫిర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, చంద్రిమా భట్టాచార్యకు పిలుపు వెళ్లినట్లు తెలిసింది. పార్టీ నేతల మధ్య విభేదాలు ముదురుతుండడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడంపై మమతా బెనర్జీ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్న వారికి గట్టి సందేశం ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. -
ఎస్ఐ, గొర్రెల కాపరి బాహాబాహీ
సాక్షి, ఆలూరు: ఎస్ఐ, గొర్రెల కాపరి పరస్పరం దాడి చేసుకున్న సంఘటన ఆలూరు మండలంలోని గోనేహాలు–మనేకుర్తి గ్రామాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హాలహర్వి మండల ఎస్ఐ బాలనరసింహులు పని నిమిత్తం ఆదోని పట్టణానికి బైక్‌పై బయలుదేరారు. మనేకుర్తి–గోనేహాలు సమీపంలో రోడ్డుపై గొర్రెలు అడ్డొచ్చాయి. వాటిని పక్కకు తోలాలని కాపరి బీరప్పను దూషించారు. ఆయన మఫ్టీలో ఉండడంతో ఎస్ఐగా గుర్తించలేని గొర్రెల కాపరి కాస్త కటువుగానే మాట్లాడాడు. ‘నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? అవి మూగజీవాలు.. పక్కకు జరగాలని వాటికి తెలియద’ని అన్నాడు.దీంతో ఎస్ఐ.. గొర్రెల కాపరి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో అతను కూడా ఎదురుదాడికి దిగాడు. సంఘటన తరువాత ఎస్ఐ ఆలూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గొర్రెల కాపరి కోసం గాలిస్తున్నారు. -
సిగ్గు సిగ్గు.. నడిరోడ్డుపై పోలీసులు ఇలా!!
ముంబై : మనకు ఏదైనా సమస్య వస్తే నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసువారికి చెప్పుకుంటాం. కానీ ఆ పోలీసులకే సమస్య వస్తే మరి ఎవరికి చెప్పుకుంటారనే సందేహం చాలా మంది మదిలో మెదిలేది. కానీ ఈ మధ్య వారికి ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు కనిపిస్తోంది. వారికి సమస్య వస్తే వారిలో వారే తన్నుకోవడం, తిట్టుకోవడం ఇలా పరస్పర దాడులకు పూనుకుంటున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని జరిగిన ఘటన మరవక ముందే.. తాజాగా మరో ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైకి దగ్గరల్లోని భండారా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగింది. విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు ఒకరి మీద మరొకరు పిడిగుద్దులు కురిపిస్తూ, పరస్పరం దాడి చేసుకున్నారు. ఒకరి కంటే మరొకరు ఎక్కువ కొట్టాలన్న కసితో కొట్టుకున్నారు. చేతులతో కొట్టుకున్న తర్వాత అది సరిపోలేదు అన్నట్లు బూట్లు తీసి మరీ కొట్టుకున్నారు. పరస్పరం దాడులకు పాల్పడిన వారిని విష్ణు కేడికర్, వికాస్ గైక్వాడ్‌గా గుర్తించారు. వీరు దాడికి పాల్పడుతున్న సమయంలో నిలువరించేందుకు సివిల్ డ్రెస్‌లో ఉన్న పక్కనున్నవారు ప్రయత్నించారే తప్ప, ఆ సమయంలో వారితో ఉన్న పోలీసులు వెంటనే ఆపడాని పక్కకు ప్రయత్నించలేదు. సివిల్ డ్రెస్‌లో ఓ వ్యక్తి ఒకరిని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్లగా, ఆ తర్వాత మిగిలిన పోలీసులు వచ్చి మరో పోలీసును పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై అధికారులు నుంచి ఎటువంటి స్పందన లేదు. కానీ వారు అలా పరస్పరం ఎందుకు దాడికి దిగి కొట్టుకున్నారో తెలీదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో లంచం విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య తలెత్తిన చిన్న వివాదం కొట్టుకునే వరకూ వెళ్లింది. నడిరోడ్డుపై ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు కర్రలతో విచక్షణా రహితంగా కొట్టుకున్న సంగతి తెలిసిందే. -
కర్రలతో దాడిచేసుకున్న టీడీపీ నేతలు
సాక్షి, అనపర్తి/తూర్పు గోదావరి : మండలంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాహేతర సంబంధం వ్యవహారంపై కొప్పవరంలో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నేతలు వెంకట్రామిరెడ్డి, సర్రెడ్డి వర్గీయులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. వివాహేతర సంబంధంలో సెటిల్మెంట్ బెడిసికొట్టడంతో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంపీటీసీ సర్రెడ్డికి గాయలయ్యాయి. దీంతో వెంకట్రామిరెడ్డి ఇంటిపై సర్రెడ్డి వర్గీయులు దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో టీడీపీ మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తలకు గాయమైంది. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఘర్షణలు చెలరేగకుండా గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగినట్టు సమాచారం. -
కర్రలతో దాడిచేసుకున్న టీడీపీ నేతలు
-
కలపకుంటే తిరుగుబాటే
న్యూఢిల్లీ: మెజారిటీ ప్రజలను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు చేయకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తిరుగుబాటు చెలరేగే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. భారత్‌లో ప్రధాని మోదీ ప్రభుత్వం ఆదివాసీలు, దళితులు, మైనారిటీలను ఇదే తరహాలో అభివృద్ధికి దూరంగా ఉంచుతోందన్నారు. జర్మనీలోని హాంబర్గ్‌లో ఉన్న బుసెరియస్ సమ్మర్ స్కూల్లో బుధవారం జరిగిన ఓ సదస్సులో రాహుల్ మాట్లాడారు. ‘2003లో అమెరికా–ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాక్‌లో ఓ తెగ వారిని ప్రభుత్వ ఉద్యోగాలు, సైన్యంలో తీసుకోకుండా నిషేధిస్తూ చట్టం తెచ్చారు. దీంతో ఆ తెగవారు తిరుగుబాటుదారుల్లో చేరిపోయారు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఈ తిరుగుబాటుదారులు సిరియాకూ విస్తరించారు. చివరికి అదే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) వంటి అంతర్జాతీయ ఉగ్రసంస్థగా రూపాంతరం చెందింది’ అని రాహుల్ అన్నారు. మహిళలకు ప్రపంచంలోనే భారత్ ప్రమాదకరమైన దేశమన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కానీ దేశంలో మహిళల పట్ల దారుణాలు పెరిగిపోతున్నాయని అంగీకరించారు. ‘భారత్ మారాల్సిన అవసరం ఉంది. పురుషులు మహిళలను గౌరవంతో, తమతో సమానంగా చూడాలి. కానీ ఇది ప్రస్తుతం భారత్‌లో జరగడం లేదు’ అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగం కారణంగా మూకహత్యలు నిరుద్యోగం, పేదలకు సమాన అవకాశాలు రాకపోవడం కారణంగా ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహంతోనే దేశంలో మూకహత్యలు జరుగుతున్నాయని రాహుల్ అన్నారు. కేంద్రం అనాలోచితంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, దుందుడుకుగా తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ)కారణంగా చిన్న వ్యాపారాలు నాశనమైపోయాయని దుయ్యబట్టారు. మరోవైపు, జర్మనీలో జరిగిన సదస్సులో మహిళల భద్రత విషయంలో భారత్‌ను కించపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. దేశంలోని ముస్లింలకు ఉద్యోగాలు కల్పించకుంటే వారంతా ఇస్లామిక్ స్టేట్‌లో చేరతారన్నట్లు రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మండిపడ్డారు. -
గోదావరిఖనిలో రెండు వర్గాల పరస్పర దాడులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖని విఠల్‌నగర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతానికి దారితీసిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరు వర్గాల వారు కత్తులు మారాణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమం ఉంది. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
భూతగాదా: రేగుపల్లిలో పరస్పర దాడులు
బెజ్జంకి : భూ తగాదా భగ్గుమంది. శుక్రవారం బెజ్జంకి మండలం రేగులపల్లిలో రెండువర్గాలు పరస్పర దాడులకు దిగాయి. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు... పోలీసుల కథనం... రేగులపల్లి గ్రామానికి చెందిన ఉతుకం రాజయ్య, ఉతుకం అంజయ్య, ఉతుకం శ్రీను, ఉతుకం సత్తయ్యలు అన్నదమ్ములు కొడుకులు. ఉతుకం రాజయ్యకు గత పదేళ్లుగా ఉతుకం అంజయ్య, ఉతుకం శ్రీను, ఉతుకం సత్తయ్యలతో ఎకరం భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. ఇదే క్రమంలో వారు పోలీసులనూ సంప్రదించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉతుకం అంజయ్య, ఉతుకం శ్రీను, ఉతుకం సత్తయ్యలు ఆ భూమిలో వరిసాగు చేశారు. పంట కోతకు రావడంతో అంజయ్యతో భార్య దేవమ్మ, శ్రీను, ఆయన భార్య పద్మ, సత్తయ్యలు కోస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి ఉతుకం రాజయ్య, ఆయన భార్య సుగుణ కొడుకులు శ్రీకాంత్, శ్రావణ్, బావమరిది కొండ సంపత్ పొలం వద్దకు చేరుకున్నారు. ఇదే క్రమంలో పొలం ఎందుకు కోస్తున్నారని సుగుణ ప్రశ్నించింది. దీంతో ఇరువర్గాలు మధ్య దూషణలు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాలు గొడ్డళ్లతో దాడులకు దిగారు. పక్కనే వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు కేకేలు విని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారిని నిలువరించారు. దాడి ఘటనలో ఉతుకం రాజయ్య, శ్రీకాంత్, శ్రావణ్, ఉతుకం సత్తయ్య, ఉతుకం శ్రీను, ఉతుకం అంజయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఉతుకం సుగుణ పుస్తెలతాడు పోయింది. సమాచారం తెలసుకున్న బెజ్జంకి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత పొలం పరిశీలించారు. సంఘటనకు దారితీసిన వివరాలను స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. దాడికి ఉపయోగించిన ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.