బెజ్జంకి :
భూ తగాదా భగ్గుమంది. శుక్రవారం బెజ్జంకి మండలం రేగులపల్లిలో రెండువర్గాలు పరస్పర దాడులకు దిగాయి. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు... పోలీసుల కథనం... రేగులపల్లి గ్రామానికి చెందిన ఉతుకం రాజయ్య, ఉతుకం అంజయ్య, ఉతుకం శ్రీను, ఉతుకం సత్తయ్యలు అన్నదమ్ములు కొడుకులు. ఉతుకం రాజయ్యకు గత పదేళ్లుగా ఉతుకం అంజయ్య, ఉతుకం శ్రీను, ఉతుకం సత్తయ్యలతో ఎకరం భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. ఇదే క్రమంలో వారు పోలీసులనూ సంప్రదించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉతుకం అంజయ్య, ఉతుకం శ్రీను, ఉతుకం సత్తయ్యలు ఆ భూమిలో వరిసాగు చేశారు. పంట కోతకు రావడంతో అంజయ్యతో భార్య దేవమ్మ, శ్రీను, ఆయన భార్య పద్మ, సత్తయ్యలు కోస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి ఉతుకం రాజయ్య, ఆయన భార్య సుగుణ కొడుకులు శ్రీకాంత్, శ్రావణ్, బావమరిది కొండ సంపత్ పొలం వద్దకు చేరుకున్నారు. ఇదే క్రమంలో పొలం ఎందుకు కోస్తున్నారని సుగుణ ప్రశ్నించింది. దీంతో ఇరువర్గాలు మధ్య దూషణలు చోటుచేసుకున్నాయి.
రెండు వర్గాలు గొడ్డళ్లతో దాడులకు దిగారు. పక్కనే వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు కేకేలు విని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారిని నిలువరించారు. దాడి ఘటనలో ఉతుకం రాజయ్య, శ్రీకాంత్, శ్రావణ్, ఉతుకం సత్తయ్య, ఉతుకం శ్రీను, ఉతుకం అంజయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఉతుకం సుగుణ పుస్తెలతాడు పోయింది. సమాచారం తెలసుకున్న బెజ్జంకి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత పొలం పరిశీలించారు. సంఘటనకు దారితీసిన వివరాలను స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. దాడికి ఉపయోగించిన ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భూతగాదా: రేగుపల్లిలో పరస్పర దాడులు
Published Sat, Nov 1 2014 4:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement