
టెహ్రాన్: రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ఇరాక్–ఇరాన్ సరిహద్దుల్లో భారీ విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టవడంతో రెండు దేశాల్లో మొత్తం 407 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 7 వేల మంది గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. రాత్రివేళ కావడంతో చాలా మంది తప్పించుకునే వీల్లేక శిథిలాల కింద చిక్కుకుని మరణించారు.
ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూ పరిశీలన సంస్థ తెలిపింది. ఇరాన్, ఇరాక్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9.48 గంటల (భారత కాలమానం ఆదివారం రాత్రి 11.48 గంటలు) సమయంలో భూప్రకంపనలు మొదలయ్యాయి. కొద్ది క్షణాల్లో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని కెర్మన్‌షా ప్రావిన్సు, ఇరాక్ ఉత్తర భాగంలోని కుర్దిష్ ప్రావిన్సుల్లో పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బగా మారిపోయాయి. ఒక్క ఇరాన్‌లోనే 401 మంది మృత్యువాతపడగా, మరో 6,603 మంది క్షతగాత్రులయ్యారు. ఇరాక్‌లో ఆరుగురు మరణించగా 535 మంది గాయపడ్డారు. భూకంపం అనంతరం దాదాపు 100 స్వల్ప ప్రకంపనాలు నమోదయ్యాయి.
తీవ్రంగా దెబ్బతిన్న సర్పోలే జహాబ్ సిటీ
ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో జర్గోస్ పర్వతాల మధ్య ఉన్న సర్పోలే జహాబ్ పట్టణం(ఇరాన్) భూకంపం తీవ్రతకు బాగా దెబ్బతింది. జహాబ్‌లో విద్యుత్తు, నీటి సరఫరా వ్యవస్థలు పూర్తిగా నాశనం కాగా.. టెలిఫోన్, సెల్‌ఫోన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇరాన్‌లో 14 ప్రావిన్సులపై భూకంప ప్రభావం ఉందని స్థానిక వార్తాసంస్థ తెలిపింది. ఇరాన్ అగ్రనేత అయతుల్లా ఖొమైనీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
భూకంప బాధితులకు పూర్తి స్థాయిలో సాయం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భూకంప ప్రభావిత ప్రాంతాల్ని మంగళవారం పరిశీలించనున్నారు. పలు నగరాల్లో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఇరాక్ ప్రధాన మంత్రి హైదర్ అల్ అబాదీ అధికారులను ఆదేశించారు. ఇరాన్, ఇరాక్‌ల్లో సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని...
భూకంపానికి ఎక్కువగా నష్టపోయిన సర్పోలే జహాబ్ ప్రావిన్స్‌లో 300 మంది మరణించినట్లు ప్రాథమిక అంచనా. ‘మా అపార్ట్‌మెంటు భవనం కూలింది. అదృష్టవశాత్తూ ప్రకంపనలు మొదలవగానే వస్తువులన్నీ ఇంట్లో వదిలేసి బయటకు పరుగెత్తడంతో ప్రాణాలు కాపాడుకున్నాం’ స్థానిక మహిళ చెప్పింది. మరో వ్యక్తి తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘భూమి కంపించగానే ఇంటిల్లిపాదీ వీధిలోకి పరుగెత్తాం. భూమి రెండోసారి కంపించగానే మొత్తం భవనం కూలిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్‌లో భూప్రకంపనలు సాధారణం. 2003లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపానికి చారిత్రక నగరం బామ్‌లో 26 వేలమంది మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment