ఇస్లామాబాద్: తమ బలగాలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. క్షిపణి దాడులతో ఉగ్రవాద స్థావరాలపై దాడులకు తెగబడుతోంది. సిరియా, ఇరాక్‌లో ఇరాన్ మంగళవారం క్షిపణి దాడులు చేసింది. ఆ వెంటనే నేడు పాకిస్థాన్ ప్రాంతంలోని బలూచిస్థాన్‌లో క్షిపణులతో రెచ్చిపోయింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అడ్ల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది.
అయితే ఈ దాడుల్ని పాక్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందారని.. మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని పాక్ తెలిపింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అడ్ల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలను డ్రోన్లు, క్షిపణులతో ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నివేదించింది. పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష‍్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించింది.
అయితే తమ గగనతలంలో ఇరాన్ చేపట్టిన ఈ చర్యను పాక్ ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది.
సిరియా, ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ మంగళవారం దాడులకు తెగబడింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష‍్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఇజ్రాయెల్ గూఢచార బృందాల సమావేశంపై దాడి జరిపినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ తెలిపింది. ఇందులో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాయి. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: Iran Attacks On Iraq Spy HQ: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
Comments
Please login to add a commentAdd a comment