ప్రపంచంలో ఉన్న ఘర్షణలు చాల్లేదన్నట్టు కొత్త తగువులు పుట్టుకొస్తున్న తీరు ఆందోళన కలిగి స్తోంది. ఇస్లామిక్ రాజ్యాలైన ఇరాన్, పాకిస్తాన్‌లు ఉగ్రవాదాన్ని అణిచే పేరిట పరస్పరం క్షిపణులతో, డ్రోన్‌లతో దాడులు జరుపుకోవటం తాజా పరిణామమైతే ఇంతవరకూ ఇరుపక్షాలకూ సర్దిచెప్పటా నికి ఎవరూ ప్రయత్నిస్తున్నట్టు లేదు. పాక్ గగనతలాన్ని అతిక్రమించిన ఇరాన్ విమానాలు సున్నీ మిలిటెంట్ సంస్థ జైష్ అల్ అదల్ స్థావరాలపై దాడులు చేయగా పాకిస్తాన్ సైతం ఇదే వంకతో ఇరాన్ భూభాగంపై బాంబులు కురిపించింది. ఇరాక్, సిరియాలపైనా ఇరాన్ దాడులు చేసింది.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం మొదలై రెండేళ్లు దాటుతుండగా, మూడు నెలల క్రితం గాజాలో ఇజ్రాయెల్ మొదలెట్టిన దాడులు విరామం లేకుండా సాగుతూనేవున్నాయి. దాదాపు 24,000 మంది పాలస్తీనా పౌరుల ప్రాణాలు బలయ్యాయి. అటు ఎర్ర సముద్రంలో హౌతీలపై అమెరికా, బ్రిటన్‌లు చేస్తున్న దాడులు ఫలిస్తున్న సూచనలు కనబడటం లేదు. ఇండో–పసిఫిక్‌ప్రాంతం రానున్న కాలంలో పెను సవాలు కాబోతున్నదని అగ్రరాజ్యాలు అంచనా వేసుకుని పది హేనేళ్లుగా పథక రచన చేస్తుండగా తాజా పరిణామాలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి.
దేశాల మధ్య ఉన్న విభేదాలు దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉండిపోతే అవి ఏదో ఒక దశలో కొత్త బలాన్ని సంతరించుకుని మరింత సంక్లిష్టంగా మారుతాయి. ఇప్పుడు ఘర్షణలు తలెత్తిన ప్రాంతాలు, ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ప్రాంతాలు గమనిస్తే ఈ సమస్యలు కొత్తగా తలెత్తి నవి కాదని అర్థమవుతుంది. 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం చోటుచేసుకుని అప్పటి పాలకుడు ఇరాన్ షా పదవీచ్యుతుడయ్యేవరకూ ఇరాన్, పాకిస్తాన్ రెండూ అమెరికాకు గట్టి మిత్ర దేశాలు. మనతో 1965లోనూ, ఆ తర్వాత 1971లోనూ పాకిస్తాన్ తలపడినప్పుడు ఆ దేశాన్ని అన్నివిధాలా ఆదుకున్న చరిత్ర ఇరాన్‌ది. పాకిస్తాన్ విచ్ఛిన్నాన్ని సహించబోనని ఇరాన్ షా పరోక్షంగా మన దేశాన్ని హెచ్చరించాడు. అలాగని ఇరాన్–పాకిస్తాన్ సరిహద్దులు ఎప్పుడూ ప్రశాంతంగా లేవు. అక్కడ స్థావరాలు ఏర్పర్చుకుని ఆ రెండింటినీ చికాకు పెడుతున్న బలూచిస్తాన్ మిలిటెంట్లకు కొదవ లేదు.
కానీ ఇరాన్‌లో ఆయతుల్లా ఖొమైనీ ఏలుబడి తర్వాత అక్కడ షియాల ఇస్లామిక్ రాజ్యం ఏర్పడ్డాకే ఆ దేశానికి సున్నీ మెజారిటీ పాకిస్తాన్‌తో సమస్యలు బయల్దేరాయి. అటు పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసిన స్థితిలో వుండగా, ఇటు ఇరాన్ అమెరికా విధించిన ఆంక్షలతో ఊపిరాడకుండా వుంది. ఇలాంటి గడ్డు స్థితిలో అక్కడ తక్షణం యుద్ధం తలెత్తే ప్రమాదం వుండకపోవచ్చు. అలాగని ఆ రెండు దేశాలూ ఒక అంగీకారానికి రాకపోతే ఏమైనా జరగొచ్చు. వాస్తవానికి ఇజ్రాయెల్ అస్తిత్వా నికి ఏ బెడదా లేకుండా చేయటానికీ, పశ్చిమాసియాలో తన పట్టు జారకుండా చూసుకొనేందుకూ అమెరికా చేయని ప్రయత్నమంటూ లేదు. పాలస్తీనా విషయంలో 1973 వరకూ ఏకతాటిపై ఉన్న అరబ్ దేశాలూ, ఇతర ముస్లిం దేశాలూ ఆ తర్వాత కాలంలో పరస్పరం విభేదించుకోవటంలో అమె రికా పాత్ర తక్కువేమీ కాదు.
1979లో ఇజ్రాయెల్–ఈజిప్టు మధ్య సయోధ్య కుదిర్చిన మాదిరిగానే 1994లో జోర్డాన్‌తో, ఈమధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, మొరాకోలతో ఇజ్రా యెల్‌కు సఖ్యతను ఏర్పర్చింది కూడా అమెరికాయే. మరోపక్క సిరియాలో బషర్ అల్ అసద్‌తో, యెమెన్‌లో హౌతీలతో, గాజాలో హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌లతో, లెబనాన్‌లో హిజ్‌బొ ల్లాతో జట్టుకట్టి అమెరికా అనుకూల ఫ్రంట్‌కు ప్రత్యామ్నాయాన్ని రూపొందించటంలో ఇరాన్ చాన్నాళ్లుగా బిజీగా వుంది. ఇజ్రాయెల్‌కు దగ్గరైన దేశాల్లో చాలా భాగం సున్నీ ఆధిపత్యంలోనూ, ఇరాన్ కూడగడుతున్న దేశాలు షియా ప్రాబల్యంలోనూ ఉండటం యాదృచ్ఛికం కాదు. ఈమధ్యలో చైనా ఏడెనిమిదేళ్లుగా జరుపుతున్న మధ్యవర్తిత్వం ఫలించి నిరుడు మార్చిలో ఇరాన్–సౌదీ మధ్య చర్చలు మొదలయ్యాయి.
ఏదీ కారణం లేకుండా మొదలు కాదు. విస్తరించదు. బలూచిస్తాన్‌లో ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరించటంలో ఇరాన్, పాకిస్తాన్ రెండూ వైఫల్యం చెందటం వల్లే ఆ ప్రాంతం చాన్నాళ్లుగా భగ్గుమంటోంది. బలూచిస్తాన్‌లో అటు షియాలూ, ఇటు సున్నీలూ ఉన్నా జాతి, తెగల పరంగా ఆ వర్గాలమధ్య ఎన్నో వ్యత్యాసాలున్నా ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలూ, భాష వగైరాల్లో అక్కడి ప్రజల తీరుతెన్నులే వేరు. తాము అటు ఇరాన్‌కూ, ఇటు పాకిస్తాన్‌కూ చెంద బోమని, తమది ప్రత్యేక విధానమని వారి వాదన. స్వతంత్ర సిస్తాన్–బలూచిస్తాన్ ఏర్పాటులోనే తమ భవిష్యత్తు ముడిపడివున్నదని అక్కడి పౌరులు భావిస్తుంటారు. ఈ మైనారిటీల మనోభావా లను సకాలంలో గుర్తించి, సరిచేసేందుకు ప్రయత్నించివుంటే మిలిటెంట్ సంస్థల ప్రభావం అక్కడ వుండేది కాదు. కానీ అటు ఇరాన్, ఇటు పాకిస్తాన్ అణిచివేతనే నమ్ముకున్నాయి.
పైగా మీ మెతక దనంవల్లే సమస్య ముదిరిందని పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. తాజా ఇరాన్ దాడుల వెనక పశ్చిమాసియా ఘర్షణలను విస్తరించాలన్న ఆలోచనలున్నాయని కొందరు విశ్లేషకులు అనుమానిస్తు న్నారు. కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలు ఇప్పటికే ప్రపంచాన్ని పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయేలా చేశాయి. రష్యానూ, ఇజ్రాయెల్‌నూ అదుపు చేసేందుకు ప్రయత్నించాల్సిన తరుణంలో మరో సంక్షోభాన్ని పెంచటం క్షమార్హం కానిది. కనుకనే పాకిస్తాన్, ఇరాన్ రెండూసంయమనం పాటించి చర్చలకు సిద్ధపడాలి. ఆ ప్రాంత మైనారిటీల మనోభావాలేమిటో తెలుసు కుని పరిణతితో ఆలోచిస్తే శాశ్వత పరిష్కారం అసాధ్యం కాదని గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment