భారీ భూకంపం.. సునామీ ప్రమాదం
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. ఇండోనేషియాకు నైరుతి దిశగా ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. పడాంగ్ నగరానికి 808 కిలోమీటర్ల నైరుతి దిశలో భూకంప కేంద్రం ఉందని, ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని చెప్పింది. ఇండోనేషియా ప్రభుత్వం ఇప్పటికే సునామీ హెచ్చరికను కూడా జారీచేసింది. పశ్చిమ సుమత్రా, ఉత్తర సుమత్రా, అచె తదితర ప్రాంతాలకు ఈ సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఇండోనేషియాలో ప్రధానంగా సుమత్రా, అచె ప్రాంతాలు 2004 నాటి సునామీలో తీవ్రంగా దెబ్బతిన్నాయి.
పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతానికి కూడా సునామీ ముప్పు పొంచి ఉన్నట్లు తొలుత హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే కొంతసేపటి తర్వాత ఆస్ట్రేలియా ఆ సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకుంది. ఇండోనేషియా పశ్చిమతీరంలోని మెంటవాయ్ ప్రాంతంలో కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. రేడియో ద్వారా అక్కడి అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం ఏమీ లేదని ఇండోనేషియా అధికారులు చెబుతున్నారు.
తాజా భూకంపం వల్ల సంభవించిన ఆస్తినష్టం, ప్రాణనష్టాలకు సంబంధించిన సమాచారం ఏదీ ఇంతవరకు అందలేదు గానీ.. నష్టం ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. 2004లో వచ్చిన స్థాయిలో సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. కాగా, ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో సంభవించిన ఈ భారీ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు ఇంతవరకు రిపోర్టులేవీ రాలేదని నేషనల్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.