మెక్సికోలో భూకంప విధ్వంసం | Central Mexico earthquake kills more than 200, topples buildings | Sakshi
Sakshi News home page

మెక్సికోలో భూకంప విధ్వంసం

Published Thu, Sep 21 2017 1:23 AM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM

మెక్సికోలో భూకంప విధ్వంసం

మెక్సికోలో భూకంప విధ్వంసం

శిథిలాల కింద 225 మంది సమాధి.. మరింత పెరగనున్న మృతుల సంఖ్య

►  పాఠశాల భవనం కూలి 21 మంది చిన్నారుల దుర్మరణం
►  శిథిల నగరంగా మెక్సికో సిటీ
►  కొనసాగుతున్న సహాయక చర్యలు
►  వివిధ దేశాధినేతల దిగ్భ్రాంతి.. సాయం చేస్తామని ప్రకటన
 


మెక్సికో సిటీ: పక్షం రోజుల క్రితంనాటి భూకంప బీభత్సాన్ని మరవకముందే మెక్సికోలో మరో భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. మంగళవారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) రిక్టర్‌ స్కేలుపై 7.1 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం 225 మంది ప్రాణాలను బలిగొంది. రాజధాని మెక్సికో సిటీలోని ఓ ఎలిమెంటరీ పాఠశాల కుప్ప కూలిపోవటంతో అందులోని 21 మంది చిన్నారులు దుర్మరణం చెందారు. మెక్సికో సిటీతోపాటు ప్యూబ్లా, మెర్లోస్, గ్యురేరో నగరాల్లోనూ పరిస్థితి భీతావహంగా మారింది. చాలాచోట్ల భవనాలు పూర్తిగా కుప్పకూలటంతో బాధితుల సంఖ్య మరింత పెరగనుంది. సైనికులు, పోలీసులు, వాలంటీర్లు, రెస్క్యూ డాగ్స్‌తో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల్లో చిక్కుకున్న వారికి ట్యూబుల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. వివిధ దేశాధినేతలు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెక్సికోకు అవసరమైన సాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఎటుచూసినా భయానక దృశ్యాలే!
సెప్టెంబర్‌ 7న మెక్సికోలో ఓ భూకంపం సృష్టించిన బీభత్సంలో 100 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను మరవకముందే మంగళవారం మధ్యాహ్నం మరోసారి ప్రకృతి ఆ దేశంపై ప్రకోపించింది. 1985లోనూ ఇదేరోజు (సెప్టెంబర్‌ 19) మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. పదివేల మంది ప్రాణాలు బలిగొంది. దీన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తుండగానే మళ్లీ విరుచుకుపడిన భూకంపం మెక్సికో సిటీని కోలుకోలేని దెబ్బకొట్టింది. తాజా దుర్ఘటనలోనూ భవనాలు ఎక్కడికక్కడ కూలిపోయాయి. ఎత్తైన భవనాలు కాంక్రీటు కుప్పలుగా మిగిలిపోయాయి. మెక్సికో సిటీలోని ఎన్రిక్‌ రెబాస్‌మెన్‌ ప్రైమరీ స్కూలో మూడు అంతస్తులు కూలిపోయాయి. ఈ ఘటనలో 21 మంది చిన్నారులతోపాటు ఐదుగురు టీచర్లు సమాధి అయ్యారు. ఓ టీచర్, ఓ చిన్నారి ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించిన రెస్క్యూ టీమ్‌ వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశాధ్యక్షుడు ఎన్రిక్‌ పెనా నీటో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ‘భూకంప ఘటన దురదృష్టకరం. చిన్నారులు సహా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పాఠశాలలు, ఇళ్లు, కార్యాలయాలు కుప్పకూలిపోయాయి’ అని నీటో ఆవేదన వ్యక్తం చేశారు.

తమవారి కోసం వెతుకులాట
మెక్సికో సిటీ జనాభా 2 కోట్లు. భూకంపంతో చాలా భవనాలు కుప్పకూలటంతో.. చాలా మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. మెక్సికో సిటీ మధ్య భాగంలోనే భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించింది. దీంతో నగరంలో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే స్తంభించింది. దీంతో తమవారి వివరాలు తెలుసుకునేందుకు కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం. ట్రాఫిక్‌ స్తంభించిపోవటంతో.. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించటం కూడా కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. కాగా, మంగళవారం ఉదయమే మెక్సికో సిటీ అధికారులు భూకంపం వస్తే ప్రాణాలు కాపాడుకోవటంపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అది జరిగి కొన్ని గంటలైనా గడవకముందే.. భూకంపం విరుచుకుపడింది. మెక్సికో సిటీలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును మూడు గంటలకు పైగా మూసేశారు. స్టాక్‌ మార్కెట్‌ను కూడా మూసేఉంచారు. స్థానికులు  రాత్రంతా ఇళ్లకు వెళ్లకుండా రోడ్లపై, పార్కుల్లోనే గడిపారు.

క్షణక్షణం భయం భయం
‘ఇది 1985 నాటి పీడకల లాంటిదే. అప్పటి తీవ్రత నాకు గుర్తుంది. అచ్చం ఈ పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలా భయమేస్తోంది’ అని 52 ఏళ్ల  బాధితుడొకరు ఏడుస్తూ చెప్పారు. ‘ఇళ్లు కూలుతుండగానే.. ప్రాణాలు కాపాడుకునేందుకు అరుస్తూ ప్రజలు పరిగెడుతున్న దృశ్యాలింకా కళ్లముందే కదలాడుతున్నాయి. ఆ భయానక దృశ్యాలను ఇంకా మరిచిపోలేకున్నా’ అని మరో బాధితురాలు తెలిపింది. మళ్లీ భూకంపం వచ్చే అవకాశాలున్నాయన్న హెచ్చరికలతో చాలాచోట్ల ఆసుపత్రుల్లోని రోగులను ఖాళీ చేయించారు.

అండగా ఉంటాం
భూకంప విధ్వంసం గురించి తెలియగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా పలు దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. మెక్సికో తిరిగి కోలుకునేలా తమవంతు సాయం చేస్తామని ప్రకటించారు. మెక్సికోకు అన్నివిధాలా అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు. చేశారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో కూడా ‘మా మిత్రుడికి అండగా ఉంటాం’ అని ట్వీట్‌ చేశారు. భూకంపం గురించి తెలియగానే.. సహాయ కార్యక్రమాల కోసం ‘36–స్ట్రాంగ్‌ రెస్క్యూ టీం’ను హొండూరస్‌ పంపింది. కాగా, ఈ ఘటనలో మెక్సికోలో ఉన్న భారతీయులంతా క్షేమంగానే ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పష్టం చేశారు.

ఇక్కడ భూకంపాలు ఎక్కువే!
సాక్షి, నేషనల్‌ డెస్క్‌: రెండు వారాల్లోనే మెక్సికోను రెండు భారీ భూకంపాలు వణికించాయి. సాధారణంగా తీవ్రత ఎక్కువ ఉన్న భూకంపాలు ఒకే ప్రాంతంలో కొన్ని రోజుల వ్యవధిలోనే సంభవించవు. అయితే మెక్సికోలో మాత్రం ఇలా ఎందుకు జరిగిందంటే కారణాన్ని భూభౌతిక శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. మామూలుగానే మెక్సికో దేశం ఉన్న ప్రాంతంలో భూమి కంపించే అవకాశం ఎక్కువ. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో మెక్సికో ఒకటి. అందుకు కారణం ఈ దేశం కోకస్, పసిఫిక్, ఉత్తర అమెరికా అనే మూడు భూ ఫలకాల ఉమ్మడి అంచుల్లో ఉండటమే. ఈ భూ ఫలకాలు ఒకదానికొకటి ఢీ కొన్నప్పుడు, ఒకదానితో మరొకటి సర్దుబాటు చేసుకున్నప్పుడు వివిధ తీవ్రతల్లో భూకంపాలు వస్తుంటాయి.


పైగా ఇప్పుడు మెక్సికో నగరం ఉన్న ప్రాంతం ఒకప్పుడు సరస్సు. అక్కడ మట్టి చాలా  మృదువుగా ఉంటుంది. అందువల్ల చిన్నపాటి భూకంపాలు వచ్చినా, వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంగళవారం వచ్చిన భూకంపం కోకస్, ఉత్తర అమెరికా భూ ఫలకాలు ఢీ కొనడం వల్ల సంభవించింది. 32 ఏళ్ల క్రితం, 1985లో కూడా మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చి దాదాపు 10 వేల మంది చనిపోయారు. అనంతరం చేసిన ఓ పరిశోధనలో తేలిందేంటంటే...అక్కడున్న మృదువైన మట్టి కారణంగా భూకంప తీవ్రత సాధారణం కన్నా ఏకంగా 500 శాతం పెరిగింది. అప్పటినుంచి భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఇక్కడ కొన్నిసార్లు అగ్ని పర్వతాలు బద్దలవటం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement