మంచుకొండల్లో మహావిలయం! | Warning bell for mega Himalayan earthquake grows louder | Sakshi
Sakshi News home page

మంచుకొండల్లో మహావిలయం!

Published Sat, Dec 1 2018 4:53 AM | Last Updated on Sat, Dec 1 2018 4:53 AM

Warning bell for mega Himalayan earthquake grows louder - Sakshi

బెంగళూరు: హిమాలయ ప్రాంతానికి మరో భారీ భూకంపం ముప్పు పొంచి ఉందా? అంటే శాస్త్రవేత్తలు అవుననే జవాబిస్తున్నారు. ఈ పర్వతాల భూపొరల్లో విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉందనీ, అది ఏ క్షణమైనా వెలువడవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌లో భూకంప శాస్త్రవేత్తగా ఉన్న సిపీ రాజేంద్రన్‌ బృందం ఓ నివేదికను విడుదల చేసింది. మధ్య హిమాలయాల ప్రాంతంలో ఎప్పుడైనా 8.5 తీవ్రతతో భూకంపం రావచ్చని రాజేంద్రన్‌ అన్నారు.

భూపొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా ఈ ప్రాంతంలో విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు. పశ్చిమ నేపాల్‌లోని మోహనఖోలా, ఉత్తరాఖండ్‌లోని ఛోర్‌గలియా ప్రాంతంలో భూప్రకంపనలతో పాటు ఇతర డేటాబేస్‌లు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాపులు, ఇస్రో పంపిన కార్టోశాట్‌–1 చిత్రాలు, గూగుల్‌ ఎర్త్‌ ఆధారంగా తాము ఈ నిర్ధారణకు వచ్చారు. 2004లో సునామీ రాకను కచ్చితంగా అంచనా వేసిన పుణెకు చెందిన భూకంప శాస్త్రవేత్త అరుణ్‌ బాపట్‌ స్పందిస్తూ.. ఈ ఏడాది చివర్లో లేదా 2019 ఆరంభంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.

పక్కకు జరిగిన హిమాలయాలు..
క్రీ.శ.1315–1440 మధ్యకాలంలో మధ్య హిమాలయాల ప్రాంతంలో 8.5 తీవ్రతతో భీకరమైన భూకంపం సంభవించిందని తమ పరిశోధనలో తేలినట్లు రాజేంద్రన్‌ తెలిపారు. దీని కారణంగా ఈ ప్రాంతంలో 600 కి.మీ పొడవైన పగులు ఏర్పడిందన్నారు. ప్రకంపనల వల్ల పర్వతాలు 15 మీటర్లు పక్కకు జరిగాయన్నారు. హిమాలయాల్లో 2015, ఏప్రిల్‌లో వచ్చిన భూకంపం దెబ్బకు దాదాపు 9,000 మంది ప్రాణాలు కోల్పోయినా, దాని తీవ్రత 7.8గానే ఉందని రాజేంద్రన్‌ అన్నారు. ఈ ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 8.5, అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించి 600 నుంచి 700 సంవత్సరాలు గడిచిపోయాయని వ్యాఖ్యానించారు. పొరల్లో విపరీతమైన ఒత్తిడి కారణంగా ఎప్పుడైనా భూకంపం రావచ్చని చెప్పారు.

పెనువిధ్వంసమే..
ఈ ప్రాంతంలో జనసాంద్రత క్రమంగా పెరుగుతున్నందున ఇలాంటి ప్రకృతి విపత్తు సంభవిస్తే నష్టం ఊహకు అలందదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పెనుభూకంపాన్ని తట్టుకునేవిధంగా కట్టడాలు నిర్మించకపోవడం, ప్రజలను అధికారులు సంసిద్ధులను చేయకపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్త రాజేంద్రన్‌ అన్నారు. ఇప్పుడు హిమాలయాల ప్రాంతంలో 8.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే నేపాల్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై పరిశోధనలు జరుపుతున్న అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరడోకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త రోజర్‌ బిల్హమ్‌ ఈ విషయమై స్పందిస్తూ.. హిమాలయాల్లోని తూర్పు అల్మోరా నుంచి నేపాల్‌లోని పోకరా ప్రాంతం మధ్యలో భూపొరల్లో తీవ్రమైన ఒత్తిడి నెలకొందన్నారు. ఈ అధ్యయనం కోసం 36 జీపీఎస్‌ స్టేషన్ల నుంచి సమాచారాన్ని సేకరించామని తెలిపారు. తమ పరిశోధనను బట్టి వాయవ్య హిమాలయాల్లోని ఘర్వాల్‌–కుమౌన్‌(ఉత్తరాఖండ్‌) సెగ్మెంట్‌ను త్వరలో భారీ భూకంపం కుదిపేసే అవకాశముందని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement