
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు దశాబ్దాల మిస్టరీకి తెరపడింది. హిమాలయాల్లో సముద్రమట్టానికి 5 వేల మీటర్ల ఎత్తున ఉన్న రూప్‌కుండ్ సరస్సు వద్ద లభించిన అస్థిపంజరాలు ఏ దేశం వారివో తెలిసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల ద్వారా ఈ అస్థిపంజరాలు గ్రీకు లాంటి మధ్యధరా ప్రాంతానికి చెందిన వారివని తెలిసింది. వీరితోపాటు భారతీయ, ఆగ్నేయాసియా ప్రాంత ప్రజలకు చెందినవని, జన్యు పరిశోధనల ద్వారా దీన్ని నిర్ధారించామని పరిశోధనకు నేతృత్వం వహించిన సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు.
అందుబాటులో ఉన్న రుజువులను బట్టి చూస్తే వీరు నందాదేవి దర్శనానికి వెళుతున్న వారు గానీ, వ్యాపారులుగానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నేచర్ కమ్యూనికేషన్స్ సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమైన సందర్భంగా సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా, తంగరాజ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఇదీ నేపథ్యం...
1956లో భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు కొందరు రూప్‌కుండ్ సరస్సు వద్ద 500 అస్తిపంజరాలు ఉండటాన్ని తొలిసారి గుర్తించారు. వీరు ఎవరు? ఎక్కడి వారు? సరస్సు వద్ద ఎందుకు మరణించారు? అన్న విషయాలు మాత్రం తెలియలేదు. వీటిపై అనేక ఊహాగానాలు వచ్చినా.. వాస్తవం ఏమిటన్నది మాత్రం నిర్ధారణ కాలేదు. దీంతో రూప్‌కుండ్ సరస్సు మిస్టరీని ఛేదించేందుకు సీసీఎంబీ 2005లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ లాల్జీసింగ్, డాక్టర్ తంగరాజ్‌లు పరిశోధనలు ప్రారంభించారు. లాల్జీసింగ్ ఇటీవలే మరణించగా, అంతర్జాతీయ శాస్త్రవేత్తల సహకారంతో తంగరాజ్ ఈ పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేశారు.