సాక్షి, అమరావతి: ‘ఐస్‌ల్యాండ్‌లోని ఒకుకూల్ హిమనీనదం అంతరించిపోయింది. అది ఇక మృత హిమనీనదం’ అని శాస్త్రవేత్తలు ఒడ్డుర్ సిగురొసన్, కైమెన్ హువే ఈ నెల 18న ప్రకటించారు. వాతావరణ మార్పులతో భూమిపై పర్యావరణానికి ముంచుకొస్తున్న పెనుముప్పుకు తాజా సంకేతం ఇదీ. ఒక్క ఐస్‌ల్యాండ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిమనీనదాలు వేగంగా కరిగిపోతుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మనదేశ నదీజలాలకు ప్రధాన ఆదరవుగా ఉన్న హిమాలయాల్లోని హిమనీనదాలకు కూడా పెనుప్రమాదం ముంచుకొస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ముంచుకొస్తున్న ముప్పు
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తాజా అధ్యయనం ప్రకారం.. గ్రీన్‌హౌస్ ఉద్గారాలు ప్రస్తుత రేటులోనే కొనసాగితే ప్రపంచంలో దాదాపు సగం హిమనీనదాలు 2100 నాటికి పూర్తిగా కనుమరుగైపోతాయి. వాయు కాలుష్యంతో గ్రీన్‌హౌస్ ఉద్గారాల రేటు అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. 2019, ఆగస్టులో గాలిలో కార్బన్ డయాక్సెడ్ సాంద్రత 415.26 పీపీఎంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా శీతల, సమశీతోష్ణ, ఉష్ణ, సముద్ర తీరప్రాంతాలపై తీవ్ర దుష్ఫలితాలకు కారణమవుతోంది. ఆర్కిటిక్, అంటార్కిటిక్ మినహాయించి హిమనీనదాల ఉపరితల ప్రదేశం 50 శాతం తగ్గిపోయింది.
హిమాలయాల్లోని 40 శాతం హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ముఖ్యంగా సూత్రి ఢాకా, బాటల్, బారా షిగ్రీ, సముద్ర తాపు, జెపాంగ్ గాథ్, కుంజుమ్ అనే ఆరు హిమనీనదాలు ఏటా 13 మిల్లీమీటర్ల నుంచి 33 మిల్లీమీటర్ల చొప్పున కరిగిపోతున్నాయని గుర్తించారు. వీటిలో బారా షిగ్రీ హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. పంజాబ్, హరియాణాలను సస్యశ్యామలం చేస్తున్న చినాబ్ నదికి ఈ హిమనీనదమే ప్రధాన ఆదరువు. ఇది పూర్తిగా కరిగిపోతే చినాబ్ నదిలో నీటి లభ్యత అమాంతం తగ్గిపోతుంది. గంగోత్రి, సియాచిన్ హిమనీనదాలు కూడా అంతకంతకూ కరుగుతుండటం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఇవేకాకుండా ఆండీస్, ఆల్ప్స్, రాకీ పర్వతాల్లోని హిమనీనదాలు కూడా వేగంగా కరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐస్‌ల్యాండ్‌లో మరో 400 హిమనీనదాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని.. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించకపోతే రాబోయే 200 ఏళ్లలో అవి పూర్తిగా కనుమరుగైపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
మేల్కొనకుంటే పెను ప్రమాదమే
భూతాపం పెరుగుతుండటం భారత ఉపఖండంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు, సముద్రమట్టాలు పెరగడం, శక్తివంతమైన తుపానులు, వరదలు విరుచుకుపడటం, మరోవైపు ఎడారీకరణ ఇలా పలు రూపాల్లో దుష్ఫ్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజూ లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. 2030 నాటికి ఓజోన్ పొర క్షీణత కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన 26 శాతం తగ్గుతుందని అంచనా వేశారు.
వాతావరణ మార్పుల వల్ల రైతులు, తీరప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాతోపాటు తెలంగాణలోని నల్గొండ, ఒడిశాలోని కలహండీ, కర్ణాటకలోని బెల్గాం జిల్లాలు ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని రిమోట్ సెన్సింగ్ డేటా అధ్యయనాలు వెల్లడించాయి. వాతావరణ మార్పులతో 974 కి.మీ. పొడవైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్రం తరచూ తుపాన్ల బారిన పడుతోంది. తీరప్రాంతం కోతకు గురికావడం, సముద్రపు నీరు పొలాల్లోకి చేరి భూగర్భ జలాలు లవణీకరణకు గురై పంటలు దెబ్బతింటున్నాయి.
తీరప్రాంతాన్ని అటవీ శాఖకు అప్పగిస్తే మేలు
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. లేకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయి. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు తీరప్రాంతం కేంద్ర బిందువుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. తీరప్రాంతాన్ని అటవీ శాఖకు అప్పగిస్తే బాగుంటుంది. తీరప్రాంతం నుంచి 300 మీటర్ల వరకు మడ అడవులను అభివృద్ధి చేయాలి. తద్వారా కార్బన్ డయాక్సైడ్‌ను నియంత్రించడంతోపాటు సముద్ర కోత, మట్టి క్షయకరణను నివారించవచ్చు.
– మనోజ్ నలనాగుల, భూవిజ్ఞాన శాస్త్ర పరిశోధకుడు
Comments
Please login to add a commentAdd a comment