డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అటవీ శాఖ అధికారులు మొట్టమొదటి సారి ఓ సంచలన విషయాన్ని గుర్తించారు. హిమాలయాల్లో సుమారు 2400 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రా సంచారాన్ని గుర్తించారు. మంచు వాతావరణంలో ఇంత ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాల సంచారాన్ని గుర్తించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో దీని గురించి పూర్తి స్థాయిలో శాస్త్రీయ పరిశోధన జరగాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ అటవి శాఖ అధికారులు ఓ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం పాములు వంటి శీతల రక్త జీవులు టెరాయి ప్రాంతంలో 400 మీటర్ల ఎత్తులో కనిపించగా.. కొండ ప్రాంతాల్లో 2400 మీటర్ల ఎత్తులో కనిపిస్తాయి. కానీ హిమాలయాల వంటి మంచు ప్రాంతంలో ఇంత ఎత్తులో కింగ్ కోబ్రాల సంచారం కనిపించడం ఇదే ప్రథమం కాక అసాధరణ విషయం అని నివేదిక తెలిపింది. దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన జరగాలని సూచించింది. (చదవండి: వైరల్: కింగ్ కోబ్రాతో ఆట అదుర్స్!)
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌లో భాగంగా ఉత్తరాఖండ్ అటవిశాఖ అధికారులు నైనిటాల్ జిల్లాలోని ముక్తేశ్వర్ పర్వత ప్రాంతంలో దాదాపు తొమ్మిది నెలల పాటు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో వీరు అనేక చోట్ల కింగ్ కోబ్రా నివాసాలను గుర్తించారు. సాధారణంగా పాములు వంటి శీతర రక్తం కల జీవులు బయటి వేడి మీద ఆధారపడతాయి. ఈ క్రమంలో అవి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలను తమ ఆవాసాలుగా చేసుకుంటాయి. ఈ సందర్భంగా సంజీవ్ చతుర్వేది అనే అధికారి మాట్లాడుతూ.. ‘ముక్తేశ్వర్ పర్వత ప్రాంతంలో దాదాపు 2400 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రా గూళ్లను(పుట్టలు) చూశాం. ఇంత ఎత్తులో మంచు ప్రాంతంలో ఇవి కనిపించడం నిజంగా రికార్డే. గతంలో డెహ్రాడూన్‌లో 2,303 మీటర్ల ఎత్తులో, సిక్కింలో 1088 మీటర్ల ఎత్తులో, మిజోరాంలో 1170 మీటర్ల ఎత్తులో.. నీలగిరిలో 1830 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రాల సంచారాన్ని గుర్తించాము. ప్రస్తుతం నైనిటాల్‌లో గుర్తించిన కింగ్ కోబ్రా తన ఆవాసంగా పైన్ చెట్ల ఆకులను వినియోగించుకుంది. వీటికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మంటలు వ్యాపించడంలో ప్రతి ఏటా ఈ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి’ అన్నారు. (చదవండి: ‘ఉస్సెన్ బోల్ట్ కూడా నన్ను పట్టుకోలేడు’)
సాధారణంగా కింగ్ కోబ్రాలు ఎక్కువగా పశ్చిమ, తూర్పు కనుమల ప్రాంతంలో, సుందర్‌బన్స్ మాంగ్రూవ్స్, ఒడిశాలో కనిపిస్తాయి. అయితే కోబ్రాలు ఏ వాతావరణంలో అయినా త్వరగా కలిసిపోతాయని.. అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు తమను తాము మార్చుకుంటాయంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితులకు గ్లోబల్ వార్మింగ్ కూడా కారణం అంటున్నారు నిపుణులు. దీని కారణంగా చల్లని ప్రదేశాలు కూడా వేడిగా మారుతున్నాయని.. ఫలితంగా పాములు మంచు ప్రాంతాల్లో కూడా నివసించగల్గుతున్నాయన్నారు. అంతేకాక ఇంత ఎత్తు ప్రాంతంలో జనసంచారం పెరగడం.. ఫలితంగా చెత్తా చెదారం పెరుకుపోవడంతో ఎలుకలు ఇక్కడ ఉంటున్నాయని.. ఇవి పాములను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఏది ఏమైనా ఈ అరుదైన విషయంపై సమగ్ర శాస్త్రీయ పరిశోధన జరగాలంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment