డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో గల్లంతైన వారికోసం జరుగుతున్న వెతుకులాట కొనసాగుతోంది. ఎన్టీపీసీకి చెందిన తపోవన్–విష్ణుగాద్ హైడల్ ప్రాజెక్టు సొరంగంలో దాదాపు 30 మంది చిక్కుకొని ఉన్నారన్న సమాచారం మేరకు, వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఆర్పీ అహిర్వాల్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు మూడంచెల వ్యూహాన్ని రచించాం. లోపల ఉన్నవారి స్థానాన్ని గుర్తించేందుకు, లోపలి నీటిని బయటకు తోడేసేందుకు అంగులం వెడల్పైన రంధ్రాన్ని చేశాం. ఈ రంధ్రం గుండా కెమెరాను పంపి వారిని గుర్తించే ప్రయత్నం చేస్తాం. లోపల ఒకవేళ నీరు ఉంటే వాటిని బయటకు తోడేసేందుకు అవసరమైన యంత్రాలను కూడా తీసుకొచ్చాం. సొరంగంలోకి బురద నీరు వెళ్లే మార్గాన్ని పెద్ద యంత్రాల ద్వారా దారి మళ్లించాం. లోపల ఉన్న వారిని రక్షించడమే లక్ష్యంగా 100 మంది సైంటిస్టులను రంగంలోకి దించాం’ అని తెలిపారు.
నిర్విరామంగా..
తపోవన్ సొరంగంలో ఉన్న వారిని రక్షించేందుకు పలు రకాల యంత్రాలను సొరంగం వద్దకు చేర్చినట్లు జనరల్ మేనేజర్ అహిర్వాల్ చెప్పారు. అందులో ఏక కాలంలో కొన్ని యంత్రాలను మాత్రమే వాడుతున్నట్లు చెప్పారు. తద్వారా యంత్రాల్లో ఏవైనా సమస్యలు ఎదురైనా మిగిలిన వాటితో పనిని నిర్విరామంగా పూర్తి చేయవచ్చన్నది నిపుణులు ఇచ్చిన సూచన అని వెల్లడించారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుకు సంబంధించిన పలువురు అనుభవజ్ఞులైన కార్మికులు వరదల్లో గల్లంతయ్యారని, కొత్త కార్మికులతో ఈ చర్యలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పై ప్రాంతం నుంచి సొరంగం వైపు వస్తున్న వరద నీరు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోవట్లేదని చెప్పారు. ధౌలిగంగ నదిని అసలైన దారిలో వెళ్లేలా చేయడమే తమ ముందున్న అతి పెద్ద లక్ష్యమని, దానికి అనుగుణంగా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 40 మంది మృతదేహాలను వెలికి తీశామని, ఇంకా 164 మంది గల్లంతై ఉన్నారని తెలిపారు.
డీఎన్‌ఏ శాంపిళ్లతో..
సహాయక చర్యలు, వెలికతీతల వ్యవహారంపై డీఐజీ నీలేశ్ ఆనంద్ భార్నే మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ 11 మృతదేహాలను గుర్తించామని తెలిపారు. 18 మందికి చెందిన శరీర భాగాలు లభ్యమయ్యాయని, వాటిని డీఎన్‌ఏ పరీక్షలకు పంపినట్లు చెప్పారు. వాటిలో పదింటికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు.
ప్రమాదంలో 385 ఉత్తరాఖండ్ గ్రామాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో తీవ్రమైన మెరుపు వరదలు సంభవించే గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 385 గ్రామాలు ఈ ప్రమాద జోన్‌లో ఉండగా, వాటిలో 5 గ్రామాలను తరలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గురువారం రూ. 2.38 కోట్లను విడుదల చేశారు. 385 గ్రామాల తరలింపునకు దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు అవ్వచ్చని అధికారులు అంచనా వేశారు.
జిల్లాలవారీ గ్రామాలివే..
మెరుపు వరదలు సంభవించే గ్రామాల్లో పితోర్ గఢ్ జిల్లాలో 129 గ్రామాలు, ఉత్తరకాశిలో 62, చమోలిలో 61, బగేశ్వర్‌లో 42, తెహ్రీలో 33, పౌరిలో 26, రుద్రప్రయాగ్‌లో 14, చంపావత్‌లో 10, అల్మోరాలో 9, నైనిటాల్‌లో 6, డెహ్రాడూన్ లో 2, ఉదమ్ సింగ్ నగర్‌లో 1 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో తెహ్రీ, చమోలి, ఉత్తరకాశీ, బగేశ్వర్‌లోని అయిదు గ్రామాలను తరలించేందుకు తాజాగా నిధులు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment