dedbody
-
40 శవాల వెలికితీత.. ఇంకా దొరకని 164 మంది
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో గల్లంతైన వారికోసం జరుగుతున్న వెతుకులాట కొనసాగుతోంది. ఎన్టీపీసీకి చెందిన తపోవన్–విష్ణుగాద్ హైడల్ ప్రాజెక్టు సొరంగంలో దాదాపు 30 మంది చిక్కుకొని ఉన్నారన్న సమాచారం మేరకు, వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఆర్పీ అహిర్వాల్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు మూడంచెల వ్యూహాన్ని రచించాం. లోపల ఉన్నవారి స్థానాన్ని గుర్తించేందుకు, లోపలి నీటిని బయటకు తోడేసేందుకు అంగులం వెడల్పైన రంధ్రాన్ని చేశాం. ఈ రంధ్రం గుండా కెమెరాను పంపి వారిని గుర్తించే ప్రయత్నం చేస్తాం. లోపల ఒకవేళ నీరు ఉంటే వాటిని బయటకు తోడేసేందుకు అవసరమైన యంత్రాలను కూడా తీసుకొచ్చాం. సొరంగంలోకి బురద నీరు వెళ్లే మార్గాన్ని పెద్ద యంత్రాల ద్వారా దారి మళ్లించాం. లోపల ఉన్న వారిని రక్షించడమే లక్ష్యంగా 100 మంది సైంటిస్టులను రంగంలోకి దించాం’ అని తెలిపారు. నిర్విరామంగా.. తపోవన్ సొరంగంలో ఉన్న వారిని రక్షించేందుకు పలు రకాల యంత్రాలను సొరంగం వద్దకు చేర్చినట్లు జనరల్ మేనేజర్ అహిర్వాల్ చెప్పారు. అందులో ఏక కాలంలో కొన్ని యంత్రాలను మాత్రమే వాడుతున్నట్లు చెప్పారు. తద్వారా యంత్రాల్లో ఏవైనా సమస్యలు ఎదురైనా మిగిలిన వాటితో పనిని నిర్విరామంగా పూర్తి చేయవచ్చన్నది నిపుణులు ఇచ్చిన సూచన అని వెల్లడించారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుకు సంబంధించిన పలువురు అనుభవజ్ఞులైన కార్మికులు వరదల్లో గల్లంతయ్యారని, కొత్త కార్మికులతో ఈ చర్యలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పై ప్రాంతం నుంచి సొరంగం వైపు వస్తున్న వరద నీరు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోవట్లేదని చెప్పారు. ధౌలిగంగ నదిని అసలైన దారిలో వెళ్లేలా చేయడమే తమ ముందున్న అతి పెద్ద లక్ష్యమని, దానికి అనుగుణంగా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 40 మంది మృతదేహాలను వెలికి తీశామని, ఇంకా 164 మంది గల్లంతై ఉన్నారని తెలిపారు. డీఎన్ఏ శాంపిళ్లతో.. సహాయక చర్యలు, వెలికతీతల వ్యవహారంపై డీఐజీ నీలేశ్ ఆనంద్ భార్నే మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ 11 మృతదేహాలను గుర్తించామని తెలిపారు. 18 మందికి చెందిన శరీర భాగాలు లభ్యమయ్యాయని, వాటిని డీఎన్ఏ పరీక్షలకు పంపినట్లు చెప్పారు. వాటిలో పదింటికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రమాదంలో 385 ఉత్తరాఖండ్ గ్రామాలు డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో తీవ్రమైన మెరుపు వరదలు సంభవించే గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 385 గ్రామాలు ఈ ప్రమాద జోన్లో ఉండగా, వాటిలో 5 గ్రామాలను తరలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గురువారం రూ. 2.38 కోట్లను విడుదల చేశారు. 385 గ్రామాల తరలింపునకు దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు అవ్వచ్చని అధికారులు అంచనా వేశారు. జిల్లాలవారీ గ్రామాలివే.. మెరుపు వరదలు సంభవించే గ్రామాల్లో పితోర్ గఢ్ జిల్లాలో 129 గ్రామాలు, ఉత్తరకాశిలో 62, చమోలిలో 61, బగేశ్వర్‌లో 42, తెహ్రీలో 33, పౌరిలో 26, రుద్రప్రయాగ్‌లో 14, చంపావత్‌లో 10, అల్మోరాలో 9, నైనిటాల్లో 6, డెహ్రాడూన్ లో 2, ఉదమ్ సింగ్ నగర్లో 1 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో తెహ్రీ, చమోలి, ఉత్తరకాశీ, బగేశ్వర్‌లోని అయిదు గ్రామాలను తరలించేందుకు తాజాగా నిధులు జారీ అయ్యాయి. -
మృతదేహం నుంచి ముప్పుండదు
సాక్షి, హైదరాబాద్ : కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను కొందరు కుటుంబ సభ్యులు తీసుకెళ్లడానికి నిరా కరించడం.. ఒకవేళ తీసుకువెళ్లా లన్నా గ్రామాలు, పట్టణాల్లోకి రానివ్వకపోవడం.. శ్మశానవాటికల్లో దహన సంస్కారాలు చేసేందుకు ఒప్పుకోక పోవడం.. దీంతో గత్యంతరం లేక మున్సిపల్ సిబ్బందే ఆ మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం వంటి సంఘటనలను చూస్తున్నాం. ఈ పరిస్థితులు మానవత్వానికి మాయని మచ్చగా, కుటుంబ సభ్యులకు తీరని శోకంగా మారాయి. కరోనాతో చనిపోయిన కారణంగా ఆ మృతదేహం నుంచి తమకు ఎక్కడ వైరస్ సోకుతుందో అనే భయంతో జనాలు దగ్గరకు రావడానికి కూడా జంకుతున్నారు. అయితే, కరోనా సోకిన వ్యక్తి మరణించగానే, వారి శరీరంలోని వైరస్ కూడా చనిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ మృతదేహంలోంచి కొన్ని రకాల ద్రవాలు ముక్కు, నోరు, ఇతర రంధ్రాల నుంచి బయటకు రావడానికి వీలుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని మృతదేహాలను బంధువులకు అప్పగించొచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. దహన సంస్కారాలకు పైరవీలా? కరోనాతో చనిపోయిన వ్యక్తులను తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయడం రాష్ట్రంలో వారి కుటుంబ సభ్యులకు సవాల్‌గా మారింది. అద్దె ఇళ్లల్లో ఉండే వాళ్లకైతే చుక్కలే కనిపిస్తున్నాయి. ఇంటి ముందుకు తీసుకొచ్చి భార్యా పిల్లలకు కూడా చూపించడానికి ఒప్పుకోవడంలేదు. గ్రామాల్లోకి మృతదేహాలను రానివ్వడంలేదు. కొన్ని స్మశానవాటికలైతే కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో కుటుంబ సభ్యులు మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించేస్తున్నారు. దీంతో అందరూ ఉన్నా అనాథశవాల్లా అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి స్మశాన వాటికలో దహనసంస్కారాలు చేయడం కోసం రాజకీయ నాయకులు, అధికారులతో ఫైరవీలు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదని ఒక వైద్య నిపుణుడు వ్యాఖ్యానించారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచినప్పుడు ఇన్పెక్షన్ కారణంగా, అనేక ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల గాయాలు కావడం వంటివి ఉంటాయి. పైగా శవాల రంధ్రాల్లోంచి కొన్ని రకాల ద్రవాలు బయటకు వస్తాయి. అందువల్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియలు చేయవచ్చు. వైరస్ ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా.. ఆ సమయంలో అతడి పక్కన ఉండే వ్యక్తికి కరోనా వచ్చే అవకాశం ఉంది. కానీ మృతదేహం దగ్గదు, తుమ్మదు కాబట్టి దాని నుంచి వచ్చే ఛాన్సే లేదని వైద్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అంత్యక్రియలకు ఎక్కువ మంది రావడం వల్ల భౌతిక దూరం లేకపోవడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల.. వైరస్ వచ్చినవాళ్ల నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉంది. అందుకే అత్యంత తక్కువ మందితోనే అంత్యక్రియలు చేయాలని సర్కారు గతంలోనే స్పష్టం చేసింది. కేంద్ర మార్గదర్శకాలు ఇవీ.. – జాగ్రత్తలు పాటించే ఆరోగ్య కార్యకర్తలు లేదా కుటుంబ సభ్యులకు మృతదేహం నుంచి కరోనా వ్యాప్తి జరగదు. – ఆస్పత్రుల్లో కరోనాతో చనిపోయిన మృతదేహాన్ని ప్రత్యేక జాగ్రత్తలతో బ్యాగ్‌లో భద్రపరచాలి. మృతదేహాన్ని తరలించే ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు వాడాలి. – చికిత్సకు ఉపయోగించిన గొట్టాలను, సిరంజీలను మృతదేహంపై నుంచి తొలగించాలి. ఏవైనా గాయాలు, రంధ్రాలు ఉంటే వాటిని హైపోక్లోరైట్‌తో క్రిమిసంహారకం చేయాలి. – శరీరంలోంచి వచ్చే ద్రవాల లీకేజీని నివారించడానికి నోరు, ముక్కులను దూది వంటి వాటితో మూసివేయాలి. – మృతదేహాన్ని లీక్ ప్రూఫ్ ప్లాస్టిక్ బాడీ బ్యాగ్‌లో ఉంచాలి. బాడీ బ్యాగ్ వెలుపలి భాగాన్ని హైపోక్లోరైట్‌తో శుభ్రపరచాలి. – మృతదేహాన్ని రవాణా చేసే వాహనాలను హైపోక్లోరైట్ ద్రావణంతో సరిగా క్రిమిసంహారకం చేయాలి. శరీరాన్ని అందులోంచి బయటకు తీశాక ఛాంబర్ డోర్, హ్యాండిల్స్, ఫ్లోర్‌ను అదే ద్రావణంతో శుభ్రం చేయాలి. – మృతదేహాన్ని తీసుకెళ్లే సిబ్బంది సర్జికల్ మాస్క్, గ్లోవ్స్ ధరించాలి. – కరోనా మృతదేహాలకు శవపరీక్షలు చేయకూడదు. ప్రత్యేక పరిస్థితుల్లో చేయవలసి వస్తే వారు పీపీఈ కిట్లు ధరించాలి. ప్రక్రియ ముగిశాక ప్రత్యేక బ్యాగ్‌లో మృతదేహాన్ని ఉంచాలి. దాని పైభాగాన సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరిచి మృతదేహాన్ని బంధువులకు అప్పగించవచ్చు. – కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. వారి మనోభావాలను గౌరవించాలి. – బంధువులు చివరిసారిగా మృతదేహాన్ని చూడటానికి, తమ మతపరమైన ఆచారాలను పాటించడం, పవిత్ర జలం చల్లుకోవడం వంటి వాటిని అనుమతించవచ్చు. శరీరాన్ని తాకకుండా ఏవైనా మతపరమైన ఆచారాలను అనుమతించవచ్చు. – మృతదేహానికి స్నానం చేయించడం, మీదపడి ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి వాటిని అనుమతించకూడదు. – కరోనా మృతదేహాలతో ఎటువంటి అదనపు ప్రమాదం ఉండదని శ్మశానవాటిక సిబ్బంది గ్రహించాలి. – అంత్యక్రియలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులు చేతులను శుభ్రపరుచుకోవాలి. – దహన ప్రక్రియ అనంతరం బూడిద ఎటువంటి ప్రమాదం కలిగించదు. దీన్ని చివరి కర్మలు చేయడానికి సేకరించవచ్చు. – స్మశానవాటికలో భారీగా జనసమీకరణ చేయడం మంచిదికాదు. దీనివల్ల వారిలో వారికి వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రమాదముంది. తగిన జాగ్రత్తలతో అంత్యక్రియలు చేసుకోవచ్చు కరోనాతో చనిపోయిన మృతదేహాలను గ్రామాల్లోకి, పట్టణాల్లోకి, ఏరియాల్లోకి రానివ్వకపోవడం సరైన పద్దతి కాదు. కరోనా మృతదేహాలతో ఎటువంటి ప్రమాదం ఉండదు. వాటితో వైరస్ వ్యాప్తి చెందదు. ఆస్పత్రుల్లో నుంచి మృతదేహాలను బయటకు తీయడం, అంబులెన్స్ ఎక్కించడం, మళ్లీ కుటుంబ సభ్యులకు అప్పగించడం, దహనసంస్కారాలు చేసేవారంతా మనుషులే కదా? వారికి లేని భయం ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఉండటం సమంజసం కాదు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలతో తగిన జాగ్రత్తలతో అంత్యక్రియలు జరుపుకోవచ్చు. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, కరోనా హైపవర్ కమిటీ సభ్యుడు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ -
మహిళ మృతదేహం వెలికితీత
- తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం - వై.ఖానాపురం, కంబదహాలు గ్రామస్తుల మధ్య ఘర్షణ - నలుగురికి గాయాలు గూడూరు రూరల్: మండల పరిధిలోని వై.ఖానాపురంలో నాలుగు రోజుల క్రితం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని మంగళవారం పోలీసులు వెలిసితీసి వైద్యలతో పోస్టుమార్టం నిర్వహించారు. తన కూతురు కల్యాణిది ఆత్మహత్య కాదని, భర్త వీరేష్, అత్త లక్ష్మిదేవి, మామ నరసింహులు కొట్టి చంపారని తండ్రి ఉప్పరి మల్లికార్జున గూడూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ శివశంకర్‌నాయక్, కోడుమూరు సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెలికి తీసిన మృతదేహానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. సి.బెళగల్ మండలం కంబదహాలుకు చెందిన కల్యాణిని వై.ఖానాపురానికి చెందిన అత్తారింటి వారు వేధింపులు గురిచేయడంతో ఈ నెల 7న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మరుసటిరోజు పుట్టినింటి వారు గొడవకు దిగారు. మృతురాలి కుమారుడి పేరిట ఆస్తి రాసిచ్చేందుకు గ్రామపెద్దలు ఒప్పించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తర్వాత అత్తారింటివారు అడ్డం తిరగడంతో సోమవారం రాత్రి మృతురాలి తండ్రి మల్లికార్జున పోలీసులను ఆశ్రయించాడు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఇరు వర్గాల ఘర్షణ.. కల్యాణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు కంబదహాలు నుంచి దాదాపు 200 మంది వై.ఖానాపురం తరలివచ్చారు. ఇదే సమయంలో స్థానిక పెద్దలు రంగయ్య, నాగేంద్ర, బడేసావ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. వై.ఖానాపురంకు చెందిన రంగయ్య, నాగేంద్ర తీవ్రంగా బడేసావు, రంగస్వామి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.