మృతదేహం నుంచి ముప్పుండదు | coronavirus Not Spread With Dead Bodies | Sakshi
Sakshi News home page

 శవం నుంచి వైరస్‌ సోకే అవకాశమే లేదు

Published Sat, Aug 15 2020 1:10 AM | Last Updated on Sat, Aug 15 2020 1:10 AM

coronavirus Not Spread With Dead Bodies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను కొందరు కుటుంబ సభ్యులు తీసుకెళ్లడానికి నిరా కరించడం.. ఒకవేళ తీసుకువెళ్లా లన్నా గ్రామాలు, పట్టణాల్లోకి రానివ్వకపోవడం.. శ్మశానవాటికల్లో దహన సంస్కారాలు చేసేందుకు ఒప్పుకోక పోవడం.. దీంతో గత్యంతరం లేక మున్సిపల్‌ సిబ్బందే ఆ మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం వంటి సంఘటనలను చూస్తున్నాం. ఈ పరిస్థితులు మానవత్వానికి మాయని మచ్చగా, కుటుంబ సభ్యులకు తీరని శోకంగా మారాయి. కరోనాతో చనిపోయిన కారణంగా ఆ మృతదేహం నుంచి తమకు ఎక్కడ వైరస్‌ సోకుతుందో అనే భయంతో జనాలు దగ్గరకు రావడానికి కూడా జంకుతున్నారు. అయితే, కరోనా సోకిన వ్యక్తి మరణించగానే, వారి శరీరంలోని వైరస్‌ కూడా చనిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ మృతదేహంలోంచి కొన్ని రకాల ద్రవాలు ముక్కు, నోరు, ఇతర రంధ్రాల నుంచి బయటకు రావడానికి వీలుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని మృతదేహాలను బంధువులకు అప్పగించొచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది.

దహన సంస్కారాలకు పైరవీలా?
కరోనాతో చనిపోయిన వ్యక్తులను తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయడం రాష్ట్రంలో వారి కుటుంబ సభ్యులకు సవాల్‌గా మారింది. అద్దె ఇళ్లల్లో ఉండే వాళ్లకైతే చుక్కలే కనిపిస్తున్నాయి. ఇంటి ముందుకు తీసుకొచ్చి భార్యా పిల్లలకు కూడా చూపించడానికి ఒప్పుకోవడంలేదు. గ్రామాల్లోకి మృతదేహాలను రానివ్వడంలేదు. కొన్ని స్మశానవాటికలైతే కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో కుటుంబ సభ్యులు మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించేస్తున్నారు. దీంతో అందరూ ఉన్నా అనాథశవాల్లా అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి స్మశాన వాటికలో దహనసంస్కారాలు చేయడం కోసం రాజకీయ నాయకులు, అధికారులతో ఫైరవీలు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదని ఒక వైద్య నిపుణుడు వ్యాఖ్యానించారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచినప్పుడు ఇన్పెక్షన్‌ కారణంగా, అనేక ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల గాయాలు కావడం వంటివి ఉంటాయి.

పైగా శవాల రంధ్రాల్లోంచి కొన్ని రకాల ద్రవాలు బయటకు వస్తాయి. అందువల్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియలు చేయవచ్చు. వైరస్‌ ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా.. ఆ సమయంలో అతడి పక్కన ఉండే వ్యక్తికి కరోనా వచ్చే అవకాశం ఉంది. కానీ మృతదేహం దగ్గదు, తుమ్మదు కాబట్టి దాని నుంచి వచ్చే ఛాన్సే లేదని వైద్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అంత్యక్రియలకు ఎక్కువ మంది రావడం వల్ల భౌతిక దూరం లేకపోవడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల.. వైరస్‌ వచ్చినవాళ్ల నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉంది. అందుకే అత్యంత తక్కువ మందితోనే అంత్యక్రియలు చేయాలని సర్కారు గతంలోనే స్పష్టం చేసింది.

కేంద్ర మార్గదర్శకాలు ఇవీ..
జాగ్రత్తలు పాటించే ఆరోగ్య కార్యకర్తలు లేదా కుటుంబ సభ్యులకు మృతదేహం నుంచి కరోనా వ్యాప్తి జరగదు. 
– ఆస్పత్రుల్లో కరోనాతో చనిపోయిన మృతదేహాన్ని ప్రత్యేక జాగ్రత్తలతో బ్యాగ్‌లో భద్రపరచాలి. మృతదేహాన్ని తరలించే ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు వాడాలి. 
– చికిత్సకు ఉపయోగించిన గొట్టాలను, సిరంజీలను మృతదేహంపై నుంచి తొలగించాలి. ఏవైనా గాయాలు, రంధ్రాలు ఉంటే వాటిని హైపోక్లోరైట్‌తో క్రిమిసంహారకం చేయాలి. 
– శరీరంలోంచి వచ్చే ద్రవాల లీకేజీని నివారించడానికి నోరు, ముక్కులను దూది వంటి వాటితో మూసివేయాలి.
– మృతదేహాన్ని లీక్‌ ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ బాడీ బ్యాగ్‌లో ఉంచాలి. బాడీ బ్యాగ్‌ వెలుపలి భాగాన్ని హైపోక్లోరైట్‌తో శుభ్రపరచాలి.
– మృతదేహాన్ని రవాణా చేసే వాహనాలను హైపోక్లోరైట్‌ ద్రావణంతో సరిగా క్రిమిసంహారకం చేయాలి. శరీరాన్ని అందులోంచి బయటకు తీశాక ఛాంబర్‌ డోర్, హ్యాండిల్స్, ఫ్లోర్‌ను అదే ద్రావణంతో శుభ్రం చేయాలి.
– మృతదేహాన్ని తీసుకెళ్లే సిబ్బంది సర్జికల్‌ మాస్క్, గ్లోవ్స్‌ ధరించాలి. 
– కరోనా మృతదేహాలకు శవపరీక్షలు చేయకూడదు. ప్రత్యేక పరిస్థితుల్లో చేయవలసి వస్తే వారు పీపీఈ కిట్లు ధరించాలి. ప్రక్రియ ముగిశాక ప్రత్యేక బ్యాగ్‌లో మృతదేహాన్ని ఉంచాలి. దాని పైభాగాన సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపరిచి మృతదేహాన్ని బంధువులకు అప్పగించవచ్చు. 
– కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. వారి మనోభావాలను గౌరవించాలి.
– బంధువులు చివరిసారిగా మృతదేహాన్ని చూడటానికి, తమ మతపరమైన ఆచారాలను పాటించడం, పవిత్ర జలం చల్లుకోవడం వంటి వాటిని అనుమతించవచ్చు. శరీరాన్ని తాకకుండా ఏవైనా మతపరమైన ఆచారాలను అనుమతించవచ్చు. 
– మృతదేహానికి స్నానం చేయించడం, మీదపడి ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి వాటిని అనుమతించకూడదు.
– కరోనా మృతదేహాలతో ఎటువంటి అదనపు ప్రమాదం ఉండదని శ్మశానవాటిక సిబ్బంది గ్రహించాలి.
– అంత్యక్రియలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులు చేతులను శుభ్రపరుచుకోవాలి. 
– దహన ప్రక్రియ అనంతరం బూడిద ఎటువంటి ప్రమాదం కలిగించదు. దీన్ని చివరి కర్మలు చేయడానికి సేకరించవచ్చు.
– స్మశానవాటికలో భారీగా జనసమీకరణ చేయడం మంచిదికాదు. దీనివల్ల వారిలో వారికి వైరస్‌ వ్యాప్తి చెందడానికి ప్రమాదముంది.


తగిన జాగ్రత్తలతో అంత్యక్రియలు చేసుకోవచ్చు
కరోనాతో చనిపోయిన మృతదేహాలను గ్రామాల్లోకి, పట్టణాల్లోకి, ఏరియాల్లోకి రానివ్వకపోవడం సరైన పద్దతి కాదు. కరోనా మృతదేహాలతో ఎటువంటి ప్రమాదం ఉండదు. వాటితో వైరస్‌ వ్యాప్తి చెందదు. ఆస్పత్రుల్లో నుంచి మృతదేహాలను బయటకు తీయడం, అంబులెన్స్‌ ఎక్కించడం, మళ్లీ కుటుంబ సభ్యులకు అప్పగించడం, దహనసంస్కారాలు చేసేవారంతా మనుషులే కదా? వారికి లేని భయం ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఉండటం సమంజసం కాదు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలతో తగిన జాగ్రత్తలతో అంత్యక్రియలు జరుపుకోవచ్చు.
– డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, కరోనా హైపవర్‌ కమిటీ సభ్యుడు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement