మహిళ మృతదేహం వెలికితీత
మహిళ మృతదేహం వెలికితీత
Published Tue, Jul 11 2017 11:33 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
- తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం
- వై.ఖానాపురం, కంబదహాలు గ్రామస్తుల మధ్య ఘర్షణ
- నలుగురికి గాయాలు
గూడూరు రూరల్: మండల పరిధిలోని వై.ఖానాపురంలో నాలుగు రోజుల క్రితం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని మంగళవారం పోలీసులు వెలిసితీసి వైద్యలతో పోస్టుమార్టం నిర్వహించారు. తన కూతురు కల్యాణిది ఆత్మహత్య కాదని, భర్త వీరేష్, అత్త లక్ష్మిదేవి, మామ నరసింహులు కొట్టి చంపారని తండ్రి ఉప్పరి మల్లికార్జున గూడూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ శివశంకర్‌నాయక్, కోడుమూరు సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెలికి తీసిన మృతదేహానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
సి.బెళగల్ మండలం కంబదహాలుకు చెందిన కల్యాణిని వై.ఖానాపురానికి చెందిన అత్తారింటి వారు వేధింపులు గురిచేయడంతో ఈ నెల 7న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మరుసటిరోజు పుట్టినింటి వారు గొడవకు దిగారు. మృతురాలి కుమారుడి పేరిట ఆస్తి రాసిచ్చేందుకు గ్రామపెద్దలు ఒప్పించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తర్వాత అత్తారింటివారు అడ్డం తిరగడంతో సోమవారం రాత్రి మృతురాలి తండ్రి మల్లికార్జున పోలీసులను ఆశ్రయించాడు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఇరు వర్గాల ఘర్షణ..
కల్యాణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు కంబదహాలు నుంచి దాదాపు 200 మంది వై.ఖానాపురం తరలివచ్చారు. ఇదే సమయంలో స్థానిక పెద్దలు రంగయ్య, నాగేంద్ర, బడేసావ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. వై.ఖానాపురంకు చెందిన రంగయ్య, నాగేంద్ర తీవ్రంగా బడేసావు, రంగస్వామి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement