కార్చిచ్చు కనిపించని ఉచ్చు..! | Climate Change Increases the Risk of Wildfires | Sakshi
Sakshi News home page

కార్చిచ్చు కనిపించని ఉచ్చు..!

Published Sun, Aug 13 2023 4:40 AM | Last Updated on Sun, Aug 13 2023 4:40 AM

Climate Change Increases the Risk of Wildfires - Sakshi

మరుభూమిలా లహైనా రిసార్ట్‌ నగరం

కార్చిచ్చులు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఏడాదికేడాది కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగిన క్షణాల్లోనే సమీపంలో నగరాలకు విస్తరించి దగ్ధం చేస్తున్నాయి. అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో  లహైనా రిసార్ట్‌ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది.  అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తుల్లో ఒకటిగా మిగిలిపోయిన ఈ కార్చిచ్చు బీభత్సంలో 80 మందికి పైగా మరణించారు. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్‌ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి.

మొదలైతే.. అంతే  
► పశ్చిమ అమెరికా, దక్షిణ ఆ్రస్టేలియాలో తరచూ కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. చరిత్రలో అతి పెద్ద కార్చిచ్చులన్నీ అక్కడే వ్యాపించాయి. గత కొన్నేళ్లుగా బ్రిటన్‌ అత్యధికంగా కార్చిచ్చుల బారినపడుతోంది. 2019లో బ్రిటన్‌లో 135 కార్చిచ్చులు వ్యాపించి 113 చదరపు మైళ్ల అడవిని దగ్ధం చేశాయి. రష్యా, కెనడా, బ్రెజిల్‌ దేశాలకు కూడా కార్చిచ్చు ముప్పు అధికంగా ఉంది.  
► బ్రిటన్‌లో మాంచెస్టర్‌లో 2019లో సంభవించిన కార్చిచ్చు ఏకంగా మూడు వారాల పాటు కొనసాగింది. 50 లక్షల మంది వాయు కాలు ష్యంతో అనారోగ్య సమస్యలు  ఎదుర్కొన్నారు.  


2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో వ్యాపించిన కార్చిచ్చు వేలాది ఇళ్లను దగ్ధం చేసింది. 300 కోట్ల జంతువులు మరణించడమో లేదంటే  పారిపోవడం జరిగింది.  
► అమెరికాలో కాలిఫోరి్నయాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయి. 2020లో కార్చిచ్చు 4 లక్షల హెక్టార్ల అడవుల్ని మింగేసింది. 1200 భవనాలు దగ్ధమయ్యాయి.  
► 2021లో ప్రపంచ దేశాల్లో  కార్చిచ్చుల వల్ల 176 వందల కోట్ల మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ గాల్లో కలిసింది


కార్చిచ్చులతో ఏర్పడిన కాలుష్యానికి ప్రపంచంలో ఏడాదికి దాదాపుగా 34 వేల మందికి ఆయుష్షు తగ్గి ముందుగానే మరణిస్తున్నారు.  
► 1918లో అమెరికాలో మిన్నెసోటాలో ఏర్పడిన కార్చిచ్చు చరిత్రలో అతి పెద్దది. ఈ కార్చిచ్చు వెయ్యి మంది ప్రాణాలను బలి తీసుకుంది.  
► యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ అంచనాల ప్రకారం ప్రపంచంలో ఏడాదికి 40 లక్షల చదరపు కిలోమీటర్ల అడవుల్ని కోల్పోతున్నాం.  


ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి పెరిగిపోనున్న కార్చిచ్చులు 14%
2050 నాటికి30%, ఈ శతాబ్దం అంతానికి 50%కార్చిచ్చులు పెరుగుతాయని యూఎన్‌ హెచ్చరించింది.  

ఎందుకీ మంటలు ?  
► కార్చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చుల్లో 10 నుంచి 15% మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి, కరువు పరిస్థితులు ఏర్పడి,  చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక మెరుపు మెరిసినా కార్చిచ్చులు ఏర్పడతాయి. బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి.  
► మానవ తప్పిదాల కారణంగా 85 నుంచి 90% కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. అడవుల్లో ఎంజాయ్‌ చేయడానికి వెళ్లి క్యాంప్‌ఫైర్‌ వేసుకొని దానిని ఆర్పేయకుండా వదిలేయడం, సిగరెట్లు పారేయడం, విద్యుత్‌ స్తంభాలు వంటివి కూడా కార్చిచ్చుకి కారణమవుతున్నాయి.  
► ఇందనం లేదంటే మరే మండే గుణం ఉన్న పదార్థాలు చెట్లు, పొదలు, గడ్డి దుబ్బులు ఉన్న అటవీ ప్రాంత సమీపాల్లో ఉంటే కార్చిచ్చులు ఏర్పడతాయి. 2021లో కాలిఫోరి్నయాలో చమురు కారణంగా 7,396 కార్చిచ్చులు ఏర్పడి 26 లక్షల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది.  
► ప్రస్తుతం అమెరికా హవాయి ద్వీపంలో కార్చిచ్చు మెరుపు వేగంతో వ్యాపించడానికి డొరైన్‌ టోర్నడో వల్ల ఏర్పడిన బలమైన గాలులే కారణం. కాలిఫోర్నియాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపించడానికి గాలులే ప్రధా న పాత్ర పోషించాయి.  

అగ్గి మరింత రాజేస్తున్న వాతావరణ మార్పులు  
సహజసిద్ధంగా ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై భూమి తిరిగి పోషకాలతో నిండుతుంది. మా­నవ నిర్లక్ష్యంతో ఏర్పడే కార్చిచ్చులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇవాళ రేపు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు ఎక్కువైపోతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితులతో వాతావరణం పొడిగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువైపోవడం వంటి వాటితో దావానలాలు పెరిగిపోతున్నాయి. 1760లో పారిశ్రామిక విప్లవం వచి్చన తర్వాత భూ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగిపోయాయి. దీని ప్రభావం ప్రకృతిపై తీవ్రంగా పడింది.

అటవీ ప్రాంతాల్లో తేమ తగ్గిపోవడం వల్ల కార్చిచ్చులు మరింత ఎక్కువ కాలం పాటు సంభవిస్తున్నాయి.  జనాభా పెరిగిపోవడం వల్ల అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివాసం ఏర్పరచుకోవడంతో కార్చిచ్చులు జనావాసాలకు పాకి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా అమెరికాలోని కాలిఫోరి్నయాలో అత్యధికంగా కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. భవిష్యత్‌లో వీటి తీవ్రత మరింత పెరిగిపోయే ఛాన్స్‌ కూడా ఉంది. మొత్తానికి ఏ సమస్య అయినా భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా గ్లోబల్‌ వారి్మంగ్‌ దగ్గరకే వచ్చి ఆగుతోంది. భూతాపాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో పని చేస్తే కార్చిచ్చులతో పాటు ఇతర సమస్యల్ని కూడా అధిగమించవచ్చు.

చరిత్రలో భారీ కార్చిచ్చులు
దేశం          ఏడాది    దగ్ధమైన అటవీ
రష్యా           2003    2.2 కోట్ల హెక్టార్లు
ఆ్రస్టేలియా    2020    1.7 కోట్ల  హెక్టార్లు
కెనడా         2014    45 లక్షల  హెక్టార్లు
అమెరికా      2004    26 లక్షల హెక్టార్లు

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement