విషాదాంతమవుతున్న పర్యటనలు
శరవేగంగా కరిగిపోతున్న గ్లేసియర్స్
మంచులో చిక్కి పర్యాటకుల దుర్మరణం
తెల్లని రంగులో మెరిసిపోతూ చూడగానే మనసుకు హాయిగొలిపే హిమానీ నదాలు (గ్లేసియర్స్) మనసును ఇట్టే ఆకర్షిస్తాయి. వాటికి సమీపంలోకి వెళ్లాలని, మంచును బంతులుగా చేసి ఆడుకోవాలని, మంచు ముద్దలతో గుహలాగా చేసుకొని అందులో సేదదీరాలని పర్యాటకులు ఆరాటపడుతుంటారు. అందుకే గ్లేసియర్ టూరిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. గ్లేసియర్స్ ఉన్న దేశాలకు ఈ పర్యాటకంతో భారీ ఆదాయం లభిస్తోంది.
హిమానీనదాలను ప్రత్యక్షంగా చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. అయితే ఆనందం మాటున విషాదం అన్నట్లుగా గ్లేసియర్ టూరిజం ప్రాణాంతకంగా మారుతోంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు కొన్నేళ్లుగా గ్లేసియర్స్ శరవేగంగా కరిగిపోతుండటం పర్యాటకుల పాలిట శాపమవుతోంది. హిమానీ నదాలను సందర్శించే క్రమంలో కొన్నేళ్లలో పదుల సంఖ్యలో మృతి చెందారు. మంచులో చిక్కి విగత జీవులయ్యారు.
వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయడానికి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి ఉన్నా గ్లేసియర్లలో పరిస్థితులు అనూహ్యం. అవి ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమని గ్లేసియర్ గైడ్లు అంటున్నారు. ‘‘అప్పటిదాకా రాయిలా స్థిరంగా కనిపించే మంచు క్షణాల్లో కరిగిపోతుంది. ఆ సమయంలో అక్కడు వాళ్లంతా మంచులో కూరుకుపోయి మరణించాల్సిందే’’ అని చెబుతున్నారు...!
వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ధ్రువాల్లో మంచు కరిగిపోతోంది. భూమిపై ఉన్న మొత్తం గ్లేసియర్లలో 2100 నాటికి సగం అంతరించిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే అవి చాలావరకు కరిగిపోయాయి కూడా. అందుకే సాహసికులు త్వరపడుతున్నారు. గ్లేసియర్లను సందర్శించడం చాలామందికి ఒక కల. దాన్ని నిజం చేసుకోవడానికి ధ్రువపు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. గ్లేసియర్ పర్యాటకాన్ని ‘లాస్ట్–చాన్స్ టూరిజం’గా భావిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అసోసియేట్ ప్రొఫెసర్ జాకీ డాసన్ చెప్పారు.
కరిగే మంచు.. పెను ముప్పు
సాధారణంగా ఎండాకాలంలోనే గ్లేసియర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. గ్లేసియర్ల ఉపరితలంపై మంచు కరుగుతుండడంతో వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ముక్కలుగా విచి్ఛన్నమవుతున్నాయి. స్థిరంగా ఉన్న గ్లేసియర్ కంటే కరుగుతున్నవి మరింత ప్రమాదకరం. వాటికి దూరంగా ఉండాలని అసోసియేషన్ ఆఫ్ ఐస్‌లాండ్ మౌంటెయిన్ గైడ్స్ ప్రతినిధి గరార్ సిగుర్‌జాన్సన్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు గ్లేసియర్లపై సమ్మర్ స్కీయింగ్‌కు జనం అమితాసక్తి చూపేవారు. ప్రమాదాల నేపథ్యంలో వేసవి కాలంలో స్కీయింగ్‌ను చాలా దేశాలు రద్దు చేశాయి. ప్రమాదాలు, మరణాల పెరుగుతున్నా పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు!
ఎన్నెన్ని విషాదాలో...!
→ 2019లో అలాస్కాలోని వాల్డెజ్ గ్లేసియర్‌లో చిక్కుకొని ముగ్గురు పర్యాటకులు మరణించారు. వీరిలో ఇద్దరు జర్మన్లు, ఒకరు ఆ్రస్టేలియన్.
→ 2018లో అలాస్కా గ్లేసియర్లలో రెండు ప్రమాదాల్లో 32 ఏళ్ల మహిళ, ఐదేళ్ల బాలుడు చనిపోయారు.
→ 2022 జూలైలో ఉత్తర ఇటలీలో మార్మోలడా గ్లేసియర్ నుంచి 64 వేల మెట్రిక్ టన్నుల మంచు, నీరు, రాళ్లు విరిగిపడ్డాయి. మంచు మొత్తం నదిలా పారుతూ దిగువన పర్యాటకులను ముంచెత్తింది. దాంతో 11 మంది మరణించారు.
→ 2023లో ఐస్‌లాండ్‌లోని ఓ గ్లేసియర్‌లో మంచు గుహ హఠాత్తుగా కుప్పకూలడంతో అమెరికన్ టూరిస్టు మృతి చెందాడు. ఇది ఐస్‌లాండ్‌లో సంచలనం సృష్టించింది. గ్లేసియర్ టూరిజం సంస్థలు వేసవిలో ఐస్ కేవ్ టూర్లను నిలిపేశాయి. పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment